అమెరికా సంచలన ప్రకటన.. వారికి మాస్క్ అవసరం లేదట!

ABN , First Publish Date - 2021-03-10T01:17:42+05:30 IST

మాస్క్ ధరించడంపై అమెరికా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారో.. వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

అమెరికా సంచలన ప్రకటన.. వారికి మాస్క్ అవసరం లేదట!

వాషింగ్టన్: మాస్క్ ధరించడంపై అమెరికా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారో.. వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, వారు కలిసే ఎదుటి వ్యక్తులు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలని పేర్కొంది. అప్పుడు మాత్రమే మాస్క్ ధరించకుండా వారితో కలవొచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి సంబంధించి సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ సోమవారం ప్రత్యేక గైడ్‌‌లైన్స్ విడుదల చేశారు. రెండు మోతాదుల టీకా తీసుకున్న వారు ఇకపై ముఖానికి మాస్క్ లేకుండా ఇతరులను కలవొచ్చని పేర్కొన్నారు. అయితే, భారీ జనసమూహలకు మాత్రం దూరంగా ఉండాలని సూచించారు.


ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 9.2 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైందని, అలాగే సుమారు 18 శాతం(దాదాపు 58.9 మిలియన్) మంది ఒక డోసు టీకా తీసుకున్నారని రోషెల్ తెలిపారు. కనుక దేశ పౌరులు, నివాసితులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవరకు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని రోషెల్ తెలియజేశారు. కాగా, ఇటీవల దేశంలోని కొన్ని రాష్ట్రాలు, నగరాలు ప్రజా ఆరోగ్య నిపుణుల సూచన మేరకు కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన.. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను యధావిధిగా పాటిస్తున్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ గుర్తు చేశారు. ఇప్పటికీ ఇంకా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు కనుక కరోనా నిబంధనలు పాటించడం చాలా అవసరమన్నారు. కాగా, అగ్రరాజ్యం ఫైజర్, మొడెర్నా, జాన్సన్ & జాన్సన్ కొవిడ్ టీకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-10T01:17:42+05:30 IST