‘చైనా న్యూక్లియర్ మిసైల్ ప్రయోగ కేంద్రాలను పెంచుతోంది’

ABN , First Publish Date - 2021-07-30T23:32:51+05:30 IST

చైనా వ్యూహాత్మకంగా న్యూక్లియర్ మిసైల్ సిలోస్‌ను

‘చైనా న్యూక్లియర్ మిసైల్  ప్రయోగ కేంద్రాలను పెంచుతోంది’

వాషింగ్టన్ : చైనా వ్యూహాత్మకంగా న్యూక్లియర్ మిసైల్ సిలోస్‌ను పెంచుతోందని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ వెల్లడించింది. దాదాపు 250 అండర్‌గ్రౌండ్ మిసైల్ సిలోస్ నిర్మాణంలో ఉన్నట్లు అమెరికన్ సైంటిస్టుల సమాఖ్య పరిశోధకులు తెలిపారు. పశ్చిమ చైనాలో ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా ఓ సిలోను గుర్తించినట్లు తెలిపారు. ఈ సమాఖ్య వెల్లడించిన వివరాలుగల కథనాన్ని ఓ ప్రముఖ అమెరికన్ ఆంగ్ల పత్రిక ఇటీవల ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ ట్వీట్ చేసింది. 


ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు గురించి, దాని చుట్టూ అలముకున్న రహస్యాల ముసుగు గురించి ఇంత కాలం చెప్తున్నామని, అది ఇప్పుడు బయటపడిందని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ తెలిపింది. ఈ వేసవి కాలంలో బయటపడినవాటిలో రెండో ఫీల్డ్ జింజియాంగ్‌లోనిదని తెలిపింది. దానికి పొరుగునే ఉన్న గన్సుంగ్ ప్రావిన్స్‌లో మరొక నిర్మాణంలో ఉన్న ఫీల్డ్‌ను జూన్‌లో గుర్తించినట్లు పేర్కొంది. దీనిని కాలిఫోర్నియాలోని జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్ ప్రొలిఫరేషన్ స్టడీస్ గుర్తించినట్లు వివరించింది. 


ఈ వార్తలపై చైనా స్పందించలేదు. తాజాగా బయటపడినదాని గురించి ప్రశ్నించినపుడు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందిస్తూ, దీని గురించి తమకు తెలియదని పేర్కొంది. 


చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఎడిటర్ హు క్సిజిన్ మాట్లాడుతూ, చైనాపై ఒత్తిడి తేవడం కోసం మిసైల్ ఫీల్డ్స్ గురించి అమెరికా సంస్థలు, మీడియా అతిశయోక్తులను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. చైనా గురించి అమెరికన్ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలను గమనించాలని కోరారు. అదేవిధంగా చైనా సమీపంలో అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల రెచ్చగొట్టే చర్యలను గమనించాలన్నారు. దేశ భద్రతకు కీలకమైన సైనిక శక్తిని చైనా బలోపేతం చేసుకోవాలని, అణ్వాయుధ నిరోధక వ్యవస్థను పటిష్టపరచాలని అన్నారు. 


సిలో అంటే క్షిపణిని ప్రయోగించే కేంద్రం. దీనిని భూగర్భంలో నిర్మిస్తారు. దీనినే న్యూక్లియర్ సిలో అని కూడా అంటారు. దీనిలో ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను భద్రపరచి, అవసరమైనపుడు ప్రయోగిస్తారు. అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ ఆ దేశంలోని అణ్వాయుధాలను పర్యవేక్షిస్తుంది. 


Updated Date - 2021-07-30T23:32:51+05:30 IST