టెక్సాస్‌లోనూ ట్రంప్‌కు అదే పరిస్థితి !

ABN , First Publish Date - 2020-12-12T16:13:12+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోగా.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ వరుసగా కోర్టు మెట్లెక్కుతున్న విషయం తెలిసిందే.

టెక్సాస్‌లోనూ ట్రంప్‌కు అదే పరిస్థితి !

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోగా.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ వరుసగా కోర్టు మెట్లెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మెయిల్ ఓట్ల వల్లే తాను ఓడిపోవడం జరిగిందని, డెమొక్రట్స్ మోసం చేశారంటూ ట్రంప్ కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ప్రతిచోట ట్రంప్‌కు పరాభవమే ఎదురైంది. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్లను కనీసం విచారించడానికి కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. తాజాగా ట్రంప్ తరుఫున టెక్సాస్‌ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ (రిపబ్లికన్ పార్టీ) వేసిన దావాను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. జో బైడెన్ విజయం సాధించిన టెక్సాస్‌లో బ్యాలెట్ ఓట్లలో అవకతవకలు జరిగాయని శుక్రవారం అటార్నీ ఈ దావా వేయడం జరిగింది. కానీ, ట్రంప్ ఆరోపిస్తున్నట్లు ఏమీ జరగలేదని, ఎన్నికలు న్యాయంగానే జరిగాయంటూ ఈ దావాను విచారించకుండానే న్యాయస్థానం తిరస్కరించింది. 


ఇక ఇప్పటికే పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్ వంటి స్వింగ్  రాష్ట్రాల్లో ట్రంప్ కోర్టు మెట్లెక్కి పరాభవం పాలవగా.. తాజాగా టెక్సాస్‌లో కూడా అదే రిజల్ట్ రిపీట్ అయింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ మెయిల్ ఓట్ల ద్వారానే గెలిచి అధక్ష్య పీఠాన్ని దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ట్రంప్ విషయంలో మెయిల్ ఓట్లు సరియైనప్పుడు.. బైడెన్ దగ్గరికి వచ్చేసరికి ఎలా తప్పు అవుతాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సుప్రీం కోర్టులో ఉన్న తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్ నియమించిన వారే. దీంతో ఈ ఆరుగురు తనకు మద్దతుగా తీర్పిస్తారనే ఆశాభావంతో ట్రంప్ తాను ఓడిన రాష్ట్రాల్లో వరుసగా దావాలు వేస్తున్నారు. కానీ, ఈ ఆరుగురిలో ముగ్గురు ట్రంప్‌తో విభేదిస్తున్నట్లు సమాచారం. ఇదే ట్రంప్ కొంపముంచుతోంది. దాంతో ట్రంప్ వేస్తున్న పిటిషన్లు కనీసం విచారణకు కూడా నోచుకోకుండా తిరస్కరణకు గురవుతున్నాయి.  

Updated Date - 2020-12-12T16:13:12+05:30 IST