నా తొలి ప్రాధాన్యత దానికే: వివేక్ మూర్తి

ABN , First Publish Date - 2021-02-26T16:05:07+05:30 IST

మహమ్మారి నిర్మూలనకే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా సర్జన్ జనరల్‌గా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన భారత సంతతి వైద్య నిపుణుడు వివేక్ మూర్తి అన్నారు.

నా తొలి ప్రాధాన్యత దానికే: వివేక్ మూర్తి

వాషింగ్టన్: మహమ్మారి నిర్మూలనకే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా సర్జన్ జనరల్‌గా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన భారత సంతతి వైద్య నిపుణుడు వివేక్ మూర్తి అన్నారు. తన ఫ్యామిలీలోని ఏడుగురిని ఈ వైరస్ బలిగొందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కనుక కరోనా అనేది దేశ సమస్యతో పాటు తన వ్యక్తిగత సమస్య కూడా అని గురువారం ఆయన నామినేషన్ నిర్ధారణకు భేటీ అయిన సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్, పెన్షన్స్ కమిటీ సమావేశంలో తెలియజేశారు. అమెరికన్లను మహమ్మారి తీవ్రంగా దెబ్బకొట్టిందన్నారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా మందిని వైరస్ బలిగొందని.. అందులో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


'కోవిడ్ వల్ల ఇంకా చాలా మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నేను సర్జన్ జనరల్‌గా ఎన్నికైతే మాత్రం ఈ వైరస్‌ను అంతమొందించడమే నా తొలి ప్రాధాన్యం. ఇంతకు ముందు ఒకసారి దేశానికి సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఇప్పుడు మరోసారి నేను తిరిగి రావడానికి కారణం.. ఈ మహమ్మారి పీడను శాశ్వతంగా తొలగించడానికే.' అని వివేక్ చెప్పుకొచ్చారు. ఇక 2011లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో వివేక్ మూర్తి వైద్య రంగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో 2013లో ఆయనను ఒబామా అమెరికా సర్జన్ జనరల్‌గా కూడా నామినేట్ చేశారు. 

Updated Date - 2021-02-26T16:05:07+05:30 IST