H1B Visa కోసం ఎదురుచూస్తున్న వారికి మరో లక్కీ ఛాన్స్!
ABN , First Publish Date - 2021-07-30T16:46:25+05:30 IST
హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసా కోసం త్వరలోనే రెండో విడత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్లు అమెరికా వెల్లడించింది.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసా కోసం త్వరలోనే రెండో విడత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్లు అమెరికా వెల్లడించింది. దీంతో ఇటీవల చేపట్టిన ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక కానివారి ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. డిజిటల్ పద్దతిలో చేపట్టిన మొదటి విడత డ్రాలో కావాల్సినంత మందికి వీసాలు ఇవ్వలేకపోయినందున రెండోసారి ఈ లాటరీని నిర్వహించాలని భావిస్తున్నట్లు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా అవసరాలకు అనుగుణంగా మరిన్ని రిజిస్ట్రేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది.
ఇక ఇంతకుముందు వచ్చిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను జులై 28న ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ అభ్యర్థులకు తమ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పింది. అయితే, హెచ్-1బీ పిటిషన్లను ఆన్లైన్లో ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇక అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసా ద్వారా ప్రతి యేటా వేల సంఖ్యలో విదేశీ నిపుణులు ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా భారతీయులు, చైనీయులు ఉంటున్నారు. తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి మేలు జరగనుంది.