మాస్కుల విషయంలో బైడెన్ కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2021-02-25T20:11:00+05:30 IST

అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మాస్కుల విషయంలో బైడెన్ కీలక నిర్ణయం !

వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా దేశవ్యాప్తంగా మాస్కులు పంపిణీ చేయాలని బైడెన్​ ప్రభుత్వం నిర్ణయించింది. 2.5కోట్లకు పైగా మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.​ కొవిడ్‌పై పోరులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌస్ బుధవారం వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు కీలకమని ఈ సందర్భంగా యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ అల్పాదాయ అమెరికన్లు మాస్కులు కొనుగోలు చేయలేకపోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. 


మార్చి నుంచి మే మధ్య ప్రభుత్వం 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 60,000 ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో మాస్కుల పంపిణీ చేస్తామని అధ్యక్ష భవనం తెలియజేసింది. కాగా, ఇంతకుముందు ట్రంప్​ ప్రభుత్వం​ ఈ కార్యక్రమాన్ని చేపడదామనుకుని వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇక బైడెన్​ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. అలాగే ప్రజారవాణా, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు.


Updated Date - 2021-02-25T20:11:00+05:30 IST