మరో 200 మిలియన్ డోసులకు అగ్రరాజ్యం ఆర్డర్

ABN , First Publish Date - 2021-01-28T01:18:16+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనావైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటికే రెండున్నర కోట్ల మందికి వైరస్ సోకగా.. ఇందులో నాలుగు లక్షలకు పైగా మంది కరోనాకు బలయ్యారు.

మరో 200 మిలియన్ డోసులకు అగ్రరాజ్యం ఆర్డర్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనావైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటికే రెండున్నర కోట్ల మందికి వైరస్ సోకగా.. ఇందులో నాలుగు లక్షలకు పైగా మంది కరోనాకు బలయ్యారు. దీంతో మహమ్మారి నుంచి అమెరికన్లు కాపాడేందుకు అక్కడి బైడెన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే పనిలో ఉన్న సర్కార్.. మంగళవారం అదనంగా 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేసింది. రోజురోజుకీ  కొవిడ్-19 కేసులు పెరుగుతుండడం, ప్రస్తుతం జరుగుతున్న టీకా పంపిణీ ప్రక్రియను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రకటించారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీక్లీ 8.6 మిలియన్ డోసుల టీకా పంపిణీ జరుగుతుండగా.. దీనిని 10 మిలియన్లకు పెంచే దిశగా తన పరిపాలన విభాగం చర్యలు తీసుకుంటోందని ప్రెసిడెంట్ వెల్లడించారు. వచ్చేవారం ప్రారంభం నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో మరింత వ్యాక్సిన్ డోసులు అవసరం ఉంటాయని తాజాగా మరో 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అంతేగాక ఈ సమ్మర్‌లోనే తమ చేతికి ఈ టీకా డోసులు వస్తాయని చెప్పారు. అలాగే తన మొదటి 100 రోజుల పాలనలో 100 మిలియన్ డోసుల టీకా పంపిణీ లక్ష్యాన్ని ఈ సందర్భంగా బైడెన్ మరోసారి గుర్తు చేశారు. కాగా, అగ్రరాజ్యం ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.   

Updated Date - 2021-01-28T01:18:16+05:30 IST