
‘మన ఊరు-మన బడి’లో భాగస్వాములవ్వండి..
సౌకర్యాల కల్పనకు సాయమందించండి
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎక్కడో ఉన్న గ్రామాల నుంచి వచ్చి నేడు అమెరికాలో గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నారంటే.. దానికి కారణం మీకు చదువు చెప్పిన పాఠశాలే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు తెలంగాణ సర్కారు మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆర్థిక సహకారం అందించి మీ ఊరి పాఠశాల రుణం తీర్చుకోండి’’ అని మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి శనివారం న్యూజెర్సీలో స్థిరపడ్డ తెలంగాణ వాసులు నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది జూన్, జూలై నుంచి ప్రారంభం కానున్న కొత్త విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధన ప్రారంభించనున్నామని, ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ కూడా కొనసాగుతోందని చెప్పారు. అలాగే తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, డిజిటల్ తరగతులు, స్వచ్ఛమైన నీరు, ప్రహరీ, వంటగది, మొక్కల పెంపకం.. లాంటి 12 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు.
ఎన్నారైలు తాము చదివిన పాఠశాల, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అక్కడ కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ కంపెనీని ఏర్పాటు చేస్తున్న సియాటిల్‌లో స్థిరపడ్డ నర్సంపేట వాసి వంశీరెడ్డి; కరీంనగర్, వరంగల్, నల్లగొండల్లో ఐటీ కంపెనీ ప్రారంభించనున్న వర్జీనియాలో స్థిరపడ్డ కరీంనగర్ వాసి కార్తీక్పొలసానిలను మంత్రి కేటీఆర్ అభినందించారు.

సెల్ఫీ @ స్ట్రీట్ ఫుడ్
వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం కొద్దిసేపు న్యూయార్క్ వీధుల్లో తిరిగారు. ఫైజర్ ఛైర్మన్‌తో సమావేశం అయ్యేందుకు వెళ్తూ మార్గమధ్యలో లెక్సింగ్టన్, 34 అవెన్యూలో స్ట్రీట్ ఫుడ్ షాప్‌లో వేడివేడి సాస్‌తో రైస్ చికెన్ ఆరగించారు. న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ నుంచి కేటీఆర్ మార్కెటింగ్, ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇక్కడే తనకిష్టమైన చికెన్ రైస్, హాట్ సాస్ తినేవాడినని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ అవకాశం లభించిందని ట్విటర్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. షాప్ వద్ద సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు.

ఫైజర్ చైర్మన్‌తో కేటీఆర్ భేటీ
జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే ఉన్నతాధికారులతోనూ సమావేశం లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో శనివారం సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్‌తో కలిసి ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్ క్లైన్ ( జీఎస్కే) కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. వ్యాక్సిన్ల తయారీ కంపెనీ ‘ఫైజర్’ చైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్లాతో పాటు కంపెనీ చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్లతో జరిగిన భేటీలో ఫార్మా రంగంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని వివరించారు. మరో ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మథాయ్ మామోన్, గ్లాక్సో స్మిత్ క్లైన్ ( జీఎస్కే) కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అగం ఉపాధ్యాయ్లతోనూ కేటీఆర్ సమావేశమై పలు అంశాలు చర్చించారు. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజంటేషన్ ఇచ్చారు. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగనున్న ‘20వ బయో ఏషియా’ సదస్సులో పాల్గొనాలని వారిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి