అంతర్గత శత్రువులపై పోరాడుతున్నాం

ABN , First Publish Date - 2020-07-06T07:14:31+05:30 IST

అంతర్గత శత్రువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. వారి నుంచి దేశ విలువలను కాపాడతానని ప్రతినబూనారు. లెఫ్టిస్టులు, లూటీదారులు, ఆందోళనకారులను అంతర్గత శత్రువులుగా ఆయన అభివర్ణించారు...

అంతర్గత శత్రువులపై పోరాడుతున్నాం

  • లెఫ్టిస్టులు, అరాచకవాదుల నుంచి దేశాన్ని కాపాడతాను
  • భారత్‌ అంటే మాకిష్టం: ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 5 : అంతర్గత శత్రువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. వారి నుంచి దేశ విలువలను కాపాడతానని ప్రతినబూనారు. లెఫ్టిస్టులు, లూటీదారులు, ఆందోళనకారులను అంతర్గత శత్రువులుగా ఆయన అభివర్ణించారు. అమెరికా 244వ స్వాత్రంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయన శ్వేతసౌధం వద్ద ప్రసంగించారు. ‘వామపక్షవాదులు, అరాచకవాదులు, ఆందోళనకారులు, లూటీదారులను ఓడించే దిశగా మనం పయనిస్తున్నాం. మన చరిత్రను చెరిపివేసే, నేతల విగ్రహాలను ధ్వంసం చేసే కోపిష్టిమూకలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు.


1492లో కొలంబస్‌ అమెరికాను కనుగొన్న నాటి నుంచి అనుసరిస్తున్న దేశ జీవన విధానాన్ని పరిరక్షించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. కాగా, అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ట్రంప్‌కు, అమెరికన్లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు మిత్రమా, భారత దేశాన్ని అమెరికా ప్రేమిస్తోంది’ అంటూ బదులిచ్చారు. కరోనా మహమ్మారికి చైనాయే పూర్తి జవాబుదారీ వహించాలని ట్రంప్‌ అన్నారు. అమెరికాలో కరోనా  విస్తృతి ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిని సమర్ధంగా ఎదుర్కొనగలిగామని చెప్పారు. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ రాప్‌ గాయకుడొకరు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నానని కాన్యే వెస్ట్‌ శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి ఆయన అభిమానులు పెద్దఎత్తున స్పందించారు.  2.5 లక్షల మంది రీట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-07-06T07:14:31+05:30 IST