USA: ఆ లైంగిక వ్యాధిని దేవుడే నాకు ఇచ్చాడు.. ఓ మహిళ స్టేట్‌మెంట్.. కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2022-08-15T01:12:53+05:30 IST

భగవంతుడే తనను హెర్పిస్(Herpes) వ్యాధి బారినపడేలా చేశాడంటూ అమెరికాకు చెందిన ఓ మహిళ తాజాగా స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.

USA: ఆ లైంగిక వ్యాధిని దేవుడే నాకు ఇచ్చాడు.. ఓ మహిళ స్టేట్‌మెంట్.. కారణం తెలిస్తే..

ఎన్నారై డెస్క్: భగవంతుడే తనను హెర్పిస్(Herpes) వ్యాధి బారినపడేలా చేశాడంటూ అమెరికాకు చెందిన ఓ మహిళ తాజాగా స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ఇది తనకో మేలుకొలుపు అని, జీవితాన్ని సరిదిద్దుకోవాలంటూ భగవంతుడు ఇచ్చిన సందేశమని ఆమె వ్యాఖ్యానించారు. దీన్ని దేవుడిచ్చిన దీవెనగా భావిస్తున్నానని తెలిపారు. లాస్‌వేగస్‌కు(Las Vegas) చెందిన అలెగ్జాండ్రా హార్‌బుష్కా 2011లో ఈ లైంగిక వ్యాధి బారినపడ్డారు. అప్పట్లో ఆమె సన్నిహితంగా ఉన్న వ్యక్తి కారణంగా ఈ వ్యాధి సోకింది. హెర్సిస్‌ను పూర్తిగా నయం చేసే మందులేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా.. హెర్పిస్ వ్యాధి బారినపడక మునుపు తన జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉండేది కాదని అలెగ్జాండ్రా చెప్పుకొచ్చారు. ‘‘అలాంటి సమయంలో దేవుడు నాకీ వ్యాధి ఇచ్చాడు. అది నాకో మేలుకొలుపు. అప్పటి నా స్థితిని అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలని సూచించే సందేశం. ఆ తరువాతే..నేను ఎలా ఉండాలి, నా పయనం ఎటు అనే అంశాల్లో స్పష్టత వచ్చింది’’ అని తాజా ఇంటర్వ్యూలో ఆమె కామెంట్ చేశారు. 


అయితే.. తనకు హెర్సిస్ ఉందన్న విషయం తెలిశాక ఆమె తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేశారు. తన జీవితం ఇక వ్యర్థం అన్న నిర్ధారణకు వచ్చారు. మరో వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించడం ఆమెకు కష్టమైంది. అలెగ్జాండ్రా వ్యాధి గురించి తెలుసుకున్న అనేక మంది ఆమెకు దూరంగా వెళ్లిపోయారు. ‘‘నా వ్యాధి గురించి తెలిశాక ఎవరైనా దూరం జరిగితే వారు నాకు తోడుగా జీవితాంతం నిలిచేందుకు అర్హులు కారని నేను అప్పుడు నిర్ణయించుకున్నా’’ అని ఆమె చెప్పారు. ఇలా రెండేళ్ల పాటు అనేక సంఘర్షణలకు లోనైన ఆమె చివరకు పరిస్థితులకు మెల్లగా అలవాటు పడ్డారు. ఆ తరువాత అలెగ్జాండ్రా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తే భర్తగా ఆమె జీవితంలో కాలుపెట్టాడు. ప్రస్తుతం అలెగ్జాండ్రా వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతోంది. ఆ దంపతులకు రెండేళ్ల పాప కూడా ఉంది. 


మందులేని హెర్పిస్ వ్యాధితో తనలాగా సతమతమయ్యే వారి కోసం అలెగ్జాండ్రా ఓ వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ‘‘రక్షిత శృంగారంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను. హెర్పిస్ బారిన పడ్డ వారు ఈ వ్యాధితో ఎలా జీవించాలో, సంతోషమయ జీవితాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నా జీవితానుభవాలతో చెప్పాలనేదే నా ఉద్దేశ్యం’’ అని ఆమె తెలిపారు. 



Updated Date - 2022-08-15T01:12:53+05:30 IST