శ్మశానంలో ఎస్‌యూవీ కారులో మహిళ డ్రైవింగ్ ప్రాక్టీస్.. ఇంతలో జరిగిందో షాకింగ్ ఘటన!

ABN , First Publish Date - 2022-04-23T01:24:58+05:30 IST

సాధారణంగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్లు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి కారు నడిపేందుకు ట్రై చేస్తారు. అయితే.. అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇటీవల డ్రైవింగ్ ప్రాక్టీసుకు వేదికగా ఏకంగా శ్మశానాన్నే ఎంచుకుంది.

శ్మశానంలో ఎస్‌యూవీ కారులో మహిళ డ్రైవింగ్ ప్రాక్టీస్.. ఇంతలో జరిగిందో షాకింగ్ ఘటన!

ఎన్నారై డెస్క్: సాధారణంగా కారునడపడం నేర్చుకునే వాళ్లు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అయితే.. అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన ప్రాక్టీసుకు వేదికగా ఏకంగా శ్మశానాన్నే ఎంచుకుంది. ఆ తరువాత.. సమాధుల మధ్య కారు నడిపిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపెట్టుకునే ప్రయత్నంలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఆమె అనుకోకుండా ఓ పొరపాటు చేసింది. ఫలితంగా.. ఆ శ్మశానంలో ఓ దారుణం జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సదరు మహిళ డ్రైవింగ్ చేసే క్రమంలో బ్రేక్‌ పెడల్‌పై పాదం వేసే బదులు యాక్సిలరేటర్‌ను నొక్కింది. ఫలితంగా ఒక్కసారిగా కారు వేగం పుంజుకుంది. 


దీంతో.. గాబరా పడిపోయిన ఆమె కారును నియంత్రించలేకపోవడంతో అది సమీపంలో ఉన్న సమాధులను ఢీకొడుతూ వెళ్లి చివరకు ఓ చెట్టును తగిలి ఆగిపోయింది. ఈ క్రమంలో ఏకంగా ఎనిమిది సమాధులు ధ్వంసమైపోయాయి. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని మెల్రోస్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలమే రేపింది. అదృష్టవశాత్తూ ఆమెకు ఏ గాయాలు కాకపోయినా..  సమాధులు ధ్వంసమవడంతో కొందరు ఆమె మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బంధువుల జ్ఞాపకాలను అపవిత్రం చేశావంటూ ఆమెపై ఫైరైపోయారు. ఆమెపై తగు చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో మహిళతో పాటు ఆమె బంధువు ఒకరు కూడా కారులోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి సూచనల మేరకే ఆమె డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెపై ఏ చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ స్థానికుల్లో నెలకొంది. 

Updated Date - 2022-04-23T01:24:58+05:30 IST