ఆరు నెలలుగా అడవిలో.. గడ్డి, నాచు తిని బతికిన మహిళ!

ABN , First Publish Date - 2021-05-06T15:41:18+05:30 IST

ఆరు నెలల కింద తప్పిపోయిన 47 ఏళ్ల ఓ అమెరికన్ మహిళను పోలీసులు ఆదివారం ఉటాలోని నేషనల్ అడవుల్లో గుర్తించారు.

ఆరు నెలలుగా అడవిలో.. గడ్డి, నాచు తిని బతికిన మహిళ!

ఉటా: ఆరు నెలల కింద తప్పిపోయిన 47 ఏళ్ల ఓ అమెరికన్ మహిళను పోలీసులు ఆదివారం ఉటాలోని నేషనల్ అడవుల్లో గుర్తించారు. ఆరు నెలలుగా ఆమె అడవిలో ఓ గుడారం ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరు నెలలుగా ఆమె అడవిలో దొరికే గడ్డి, నాచు తిని బతికినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది నవంబర్ 25న ఉటాకు చెందిన ఓ మహిళ తప్పిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. 


వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు స్పానిష్ ఫోర్క్ కాన్యన్‌లోని డైమండ్ ఫోర్క్ క్యాంప్‌గ్రౌండ్ వద్ద ఆమె కారును గుర్తించారు. దాంతో ఆ ప్రాంతం చుట్టుపక్కల అంత వెతికారు. కానీ, ఎక్కడ ఆమె జాడ దొరకలేదు. ఆమె బంధువులు, స్నేహితులను కూడా వాకాబు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. 


ఈ క్రమంలో ఆదివారం ఉటా పోలీసులు అనుమానంతో నేషనల్ అటవీ ప్రాంతాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో డ్రోన్ల ద్వారా జల్లెడ పట్టారు. కొద్దిసేపటి  తర్వాత డ్రోన్ కెమెరా కంటికి అడవి మధ్యలో ఓ గుడారం(టెంట్) వేసి ఉండడం చిక్కింది. వెంటనే ఆ గుడారంలోకి డ్రోన్‌తో పరిశీలించగా అందులో ఓ మహిళ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తాము వెతుకుతున్న మహిళ అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. 


కాకపోతే ఆరు నెలలుగా ఆహారం లేకపోవడంతో ఆమె శరీర బరువు తగ్గి, నీరసంగా ఉండడం గమనించారు. ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడు తనతోపాటు కొద్ది మొత్తంలో ఆహారం తీసుకెళ్లినట్లు పోలీసులకు ఆ మహిళ ద్వారా తెలిసింది. అది కొన్ని రోజులకే అయిపోవడంతో అడవిలో దొరికే గడ్డి, నాచులాంటివి తిని బతికినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు ఉటా పోలీస్ అధికారి స్పెన్సర్ కానన్ వెల్లడించారు. అయితే, ఆ మహిళ వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇక ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆ మహిళ తన ఇష్టపూర్వకంగానే ఇలా అడవిలో ఆరు నెలలు ఉన్నట్లు ఉటా పోలీసులు పేర్కొన్నారు.        


Updated Date - 2021-05-06T15:41:18+05:30 IST