పన్నుల బాదుడు!

ABN , First Publish Date - 2021-06-02T05:25:20+05:30 IST

కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ప్రజలకు పన్నుల బాదుడు తప్పడం లేదు. చెత్త సేకరణపై సైతం యూజర్‌ చార్జీల వసూలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం చెత్తసేకరణ విషయంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. యూజర్‌ చార్జీలు నిర్ణీత సమయంలో చెల్లించకుంటే అపరాధ రుసుం విధించనున్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీఎల్‌ఏపీ-క్లాప్‌) పేరిట కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు, నగర పంచా

పన్నుల బాదుడు!
ఇచ్ఛాపురంలో చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికులు


చెత్తసేకరణకు యూజర్‌ చార్జీలు

కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో వసూలుకు రంగం సిద్ధం

ప్రయోగాత్మకంగా వార్డుల ఎంపిక

 ఆందోళనలో ప్రజలు, చిరు వ్యాపారులు

కరోనా వేళ..ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత

(ఆమదాలవలస/ఇచ్ఛాపురం)

 కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ప్రజలకు పన్నుల బాదుడు తప్పడం లేదు. చెత్త సేకరణపై సైతం యూజర్‌ చార్జీల వసూలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం చెత్తసేకరణ విషయంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.  యూజర్‌ చార్జీలు నిర్ణీత సమయంలో చెల్లించకుంటే అపరాధ రుసుం విధించనున్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీఎల్‌ఏపీ-క్లాప్‌) పేరిట కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. కార్పొరేషన్లలో నెలకు రూ.120, గ్రేడ్లు వారీగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నెలకు రూ.90 వంతున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏటా 5 శాతం పెంచనున్నట్టు పేర్కొంది. ఇళ్లతో పాటు వాణిజ్య, వ్యాపార సంస్థలు, తినుబండారాల దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు సైతం వివిధ రకాలుగా యూజర్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంది. 


 ఎంపిక చేసిన వార్డులివే..

 ఆమదాలవలస మునిసిపాల్టీలో 27 వార్డులకు గాను 16వ వార్డును ఎంపిక చేశారు.  ఈ వార్డులో యూజర్‌ చార్జీల కింద రూ.90 వసూలు చేయాలని నిర్ణయించారు. రాజాం నగర పంచాయతీలో నాలుగో వార్డును ఎంపిక చేశారు. రూ.50 వసూలు చేయాలని నిర్ణయించారు. పాలకొండలో నాలుగో వార్డులో రూ.60 వంతున వసూలు చేయాలని నిర్ణయించారు. పలాస-కాశీబుగ్గలోని 18వ వార్డును యూజర్‌ చార్జీలకు ఎంపిక చేశారు. చదరపు అడుగును బట్టి రూ.45 వరకూ వసూలుకు నిర్ణయించారు. ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో 23 వార్డులకుగాను.. ఇళ్లకు మినహాయింపు ఇవ్వాలని కొందరు సభ్యులు..పూర్తిగా రద్దు చేయాలని మరికొందరు పట్టుబడడంతో ఎంపిక వాయిదా పడింది. 


 చార్జీలు ఇలా..

ఐదు నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లకు నెలకు రూ.10వేలు మూడు నక్షత్రాల హోటళ్లకు రూ.7,500, లాడ్జీలు 50 గదులు దాటితే రూ.2,500, 20 నుంచి 50 గదుల లోపు ఉంటే రూ.2,000, 20 లోపు గదులు ఉంటే రూ.500, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు రూ.2,000, వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.1,000, వెయ్యిలోపు ఉన్న వాటికి రూ.750, చిన్న హోటళ్లకు రూ.250 వంతున వసూలు చేయనున్నారు. బేకరీ, స్వీట్‌షాపులకు రూ.200, రోడ్డు పక్కన ఉండే టిఫిన్‌ షాపులు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, జ్యూస్‌ షాపులకు రూ.100 లెక్కన వసూలు చేయనున్నారు. 

 పట్టణ వాసుల పెదవివిరుపు

కరోనా విపత్కర సమయంలో పన్నుల బాదుడు సరికాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాపారాలు లేక కనీసం అద్దెలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కరోనా ప్రారంభం నుంచే వ్యాపారాలు పడిపోయాయని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమకు స్వాంతన కలిగే నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి...అదనపు భారం మోపుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సామాన్యులు సైతం ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. కష్టకాలంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కొన్ని మునిసిపాల్టీల పాలకవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.





Updated Date - 2021-06-02T05:25:20+05:30 IST