ఓకే చెప్పలేదో.. మీ వాట్సాప్ ఖాతా గోవిందా!

ABN , First Publish Date - 2021-01-06T23:10:36+05:30 IST

నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతూనే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. ...

ఓకే చెప్పలేదో.. మీ వాట్సాప్ ఖాతా గోవిందా!

న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతూనే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. తాము కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు, గోప్యతా విధానానికి అంగీకారం తెలిపితేనే వినియోగదారులకు వాట్సాప్ వాడేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. వచ్చే నెల 8 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామనీ... ఆలోగా నూతన నిబంధనలు, ప్రైవసీ పాలసీకి అంగీకారం తెలియజేయాలని వాట్సాప్ పేర్కొంది. ఈ మేరకు సదరు సంస్థ ఇప్పటికే ఖాతాదారులకు ఇన్-యాప్ నోటిఫికేషన్లు సైతం పంపిస్తోంది. 2021 ఫిబ్రవరి 8లోగా కొత్త నిబంధనలను అంగీకరించని పక్షంలో వినియోగదారులు తమ ఖాతాను యాక్సిస్ చేసుకునే అవకాశం కోల్పోతారంటూ నోటిఫికేషన్లో పేర్కొంది. యూజర్లు వారి అకౌంట్స్‌ను డిలీట్ చేయదల్చుకుంటే తమ హెల్ప్ సెంటర్లను సంప్రదించవచ్చని కూడా వాట్సాప్ పేర్కొంది. కాగా వాట్సాప్ కొత్త నిబంధనలపై వినియోగదారులు ట్విటర్ వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. డేటా భద్రత, ప్రైవసీపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వాట్సాప్ ఈ తరహా షరతులు విధించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా వేరే ప్రత్నామ్నాయాలు, దేశీయ మెసేజింగ్ యాప్‌లను వినియోగిస్తామని కూడా చెబుతున్నారు. 







Updated Date - 2021-01-06T23:10:36+05:30 IST