ఉషారాణి భాటియా: సాహిత్యమే వృత్తీ,ప్రవృత్తీ

ABN , First Publish Date - 2021-01-02T06:19:10+05:30 IST

ఉషారాణి భాటియా ఇతివృత్తాలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. కేవలం మధ్యతరగతి జీవన వైవిధ్యాన్ని, వైచిత్రిని కథాగతం చేయడమే కాక, -సామాజిక అస్తవ్యస్తతల్ని, అసమానతల్ని కూ...

ఉషారాణి భాటియా: సాహిత్యమే వృత్తీ,ప్రవృత్తీ

ఉషారాణి భాటియా ఇతివృత్తాలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. కేవలం మధ్యతరగతి జీవన వైవిధ్యాన్ని, వైచిత్రిని కథాగతం చేయడమే కాక, -సామాజిక అస్తవ్యస్తతల్ని, అసమానతల్ని కూడా- కథావస్తువులుగా చేసుకుని ఆమె రచనలు చేశారు.


నవలా, కథా రచయిత్రిగా నాలుగు దశాబ్దాల తెలుగు పాఠకలోకానికి ఉషారాణి భాటియా సుపరిచితులు. ఆమె ప్రసిద్ధ రచయిత చలం తమ్ముడు, తొలితరం సినీ, రంగస్థల నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతిదేవిల చిన్నకుమార్తె, కొడవటిగంటి కుటుంబరావుకు మరదలు. చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆంధ్రపత్రికలో కొంతకాలం పని చేసి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారి ఆంగ్లపత్రిక సంపాదకవర్గంలో చేరారు. ఆ తరువాత నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ తెలుగుశాఖ తొలి ఎడిటర్‌గా 1990 వరకు పదవీబాధ్యతలు నిర్వహించారు. పలు పుస్తకాల ప్రచురణతో పాటు బాలసాహిత్యాన్ని ప్రోత్సహించి ఎనలేని సేవ చేశారు. తాను స్వయంగా ‘చిన్నారి’, ‘తండ్రి కూతురు’, ‘ప్రతీకారం’, ‘అరుణోదయం’ నవలలు రాశారు.


కథారచయిత్రిగా ఉషారాణి యువ, ఆంధ్రపత్రిక, వనిత వంటి అనేక పత్రికల్లో రచనలు చేశారు. రాసిన కథలన్నింటా ఆమె విస్తృత గ్రంథపఠనం, సమాజ పరిశీలన ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. స్త్రీల సంసారిక ఇక్కట్లను ఎంతో సున్నితంగా, ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ‘క్షణం శాంతి లేదు’ కథలో రాధ ఉమ్మడి కుటుంబంలో సహజంగా ఉత్పన్నమయ్యే దైనందిన బాధల నుంచి కొంత విముక్తి కోసం భర్తను ఒప్పించి పుట్టింటికి పోతే, అక్కడ ఆడపడుచు పిల్లల గోలా.. గొడవలూ! ఇక్కడికంటే ‘తన’ ఇల్లే మేలనుకొని తిరుగు ప్రయాణమవుతుంది. ‘దేవుడి ఇల్లు’లో పనిమనిషి లచ్చమ్మపై పెద్దింటి పెద్దమనిషి చూపు పడితే, లలితమ్మకి, తులశమ్మకి అన్యాపదేశంగా తన అవస్థను చెప్పకనే చెప్పి విశదం చేస్తుంది, ఆ పెద్దమనిషి ఈ తులశమ్మ భర్తే! ఆ సందర్భంలో తులశమ్మ, పక్కన ఉన్న తన స్నేహితురాలు లలితమ్మ చూపులో చూపు నిలుపలేక తేలుకుట్టిన దొంగలా తలవంచుకుంటుంది. 1993లో ‘వనిత’ మాసపత్రికలో వచ్చిందీ కథ. ‘నిర్ణయం’ కథలో నర్సు తాయారు పరిస్థితి- కుడితిలో పడిన ఈగ చందం. పక్షవాతంతో మంచం పట్టిన తల్లి, చదువుకుంటున్న చెల్లెలు, తన పెళ్ళి ఆలోచనకే అవకాశం లేని సంసార బాధ్యతలు. చివరికి ఒక వరుడు తటస్థపడితే,- అతడు ఆమె జీతాన్ని ఆశిస్తూ తాను పెళ్ళి చేయవలసిన ఇద్దరు చెల్లెళ్ళ గురించీ, తమ్ముడి చదువు గురించి చెబుతాడు. హతాశురాలవుతుంది తాయారు. ఈ ఇక్కట్ల నుంచి విముక్తి కోసం, దుబాయ్‌లో నర్సులు కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుంటుంది. 


జీవితాల్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యే కథా వస్తువుల్ని ఎంచుకుని క్లుప్తతకి పెద్దపీట వేస్తూ రచనలు చేశారు ఉషారాణి. ‘ఆ లోకం నుంచీ ఆహ్వానం’ కథ జూన్‌ 1996 ‘వనిత’లో వచ్చింది. ఇందులో ఆమె విలక్షణమైన కథాశిల్పాన్ని కూర్చారు. తాయారు చనిపోయింది. ‘ఆ లోకంలో’, ‘నువ్వుటే తాయారు’ అంటూ ఆహ్వానించింది అత్తగారు! వెనుకటి గుణం ప్రకారం ఒకర్ని ఒకరు ఎత్తిపొడుపులతో, నిష్ఠూరాలతో దూషించుకున్నారు. అంతలో అక్కడికి తాయారు చిన్ననాటి స్నేహితురాండ్రు వచ్చారు. వాళ్ళు ‘మాకిక్కడ ఎంతో బాగుంది’ అని చెబుతారు. ‘ఇక్కడ ఒంటరి స్థలాలు లేవు. ఒకరి వెనుక ఒకరు గుసగుసలు పోవటాలూ, గోతులు తవ్వుకోవటాలూ లేవు. స్వేచ్ఛగా ఏ నాటకీయత లేకుండా జీవిస్తాం’ అంటూ స్నేహం, ప్రేమ అనే వాటి అసలైన అర్థాన్నీ, విలువనీ గౌరవించకుండా, పైపై వేషభాషణల్ని చూసి భ్రమించిన తాయారు ప్రవర్తననీ, స్వభావాన్నీ ఆమె ముందు కుప్పబోసి అంతరంగ దర్పణాన్ని ఆమె ముందు పెడతారు. మిథ్యా గౌరవాలూ, కలహాలూ, పెదవులపై నవ్వులూ, కుహనా సామాజిక సేవలూ, సభలూ, బోలు ప్రసంగాలూ- వీటన్నిటిలోని డొల్లతనాన్నీ విశదం చేస్తారు. ఆ తర్వాత ఆమె ఎదుట స్కూల్‌ టీచర్‌ మూర్తి మాష్టారు ఎదురవుతారు. ఆయనా అదే పద్ధతిలో మాట్లాడి ‘కరుణ, దయ, క్షమాగుణం వంటి వాటిని మనకు నేర్పేవారు లేరు తల్లీ. మనకు మనమే నేర్చుకోవాలి, ఇతరులకు పంచాలి. ఇదే జీవి తెలుసుకోవలసిన పరమరహస్యం. జ్ఞానమంటే ఇదే తల్లీ’ అని హితబోధ చేస్తారు! ఇలా, చిన్న కథలో ఒక వ్యక్తి ప్రవర్తనలోని బలహీనతల్నీ, వైకల్యాల్నీ, మానసిక వైరుధ్యాల్నీ వినూత్న కథనంతో చిత్రించారు.


‘ఆరోజు సాయంత్రం’ కథలో ఉషారాణి స్త్రీ వ్యక్తిత్వ పార్శ్వంలోని ఒక మేలిగుణాన్ని ఎంతో స్థిమితంగా చిత్రించారు. పెళ్ళిచూపుల్లో చూసి ‘మరీ మామూలు ఆడపిల్ల’ అని సరోజని తిరస్కరిస్తాడు రవి. ఆమె రమణ ఇల్లాలవుతుంది. అతను రవి మిత్రుడు. భర్తతో పిల్లలతో సుఖంగా సంసారం చేసుకుంటుంది సరోజ. ఒకసారి రమణ ఇంటికి వస్తాడు రవి. వాళ్ళ సంసారాన్నీ, సరోజ పొందికనీ, గృహ నిర్వహణనీ అర్థం చేసుకుంటాడు. తన అంతరంగంలో ఆమెనీ, తన భార్యనీ పక్కపక్కన నిలుపుకుని పోల్చుకుంటాడు. అమెరికా వదిలిరాలేని భార్య అక్కడే ఉంది. ఇతను ఇక్కడ మన దేశంలో ‘మామూలు’ స్త్రీ ఔన్నత్యమెలాంటిదో తెలిసి జ్ఞానోదయమవుతుంది అతడికి. కానీ ఏంలాభం, సమయం మించిపోయింది కదా. ఇలా, మానసిక సంఘర్షణనీ, కుటుంబ సమస్యల్నీ, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్నీ నిశిత పరిశీలనతో స్పష్టమైన కథాకథనంతో నిరాడంబరమైన శైలిలో చిత్రించారు ఉషారాణి.


కేవలం మధ్యతరగతి జీవన వైవిధ్యాన్ని, వైచిత్రిని కథాగతం చేయడమే కాక, ఉషారాణి -సామాజిక అస్తవ్యస్తతల్ని, అసమానతల్ని, దుర్మార్గాల్ని కూడా- కథావస్తువుల్ని చేసుకుని రచనలు చేశారు. 1975లో ఆంధ్రపత్రికలో వచ్చిన ‘తెల్లవారింది’ కథలో గుడిశెల్ని ఖాళీ చేయించి, బంగ్లాలు లేపే దౌష్టాన్ని అపూర్వమైన శిల్పంతో ఆవిష్కరించారు.


‘ఓ ముగ్గురి కథ’–ఓ గుడిసెవాసి మంగాలు రోజుకూలి ఆరాటం, ఒక ఎల్‌డిసి శీను ప్రమోషన్‌ తాపత్రయం, ఒక చిన్న ఆఫీసరు శేఖరం, విదేశీయానం కోసం పెద్దవారిని ‘పట్టు’కునే పరిశ్రమ గురించి సంఘటనాత్మక శిల్పంతో ‘యువ’ పాఠకుల్ని అలరించింది. కథ ముగింపులో శేఖరం విదేశీయానంలో విజయుడవుతాడు! నిచ్చెనమెట్ల సమాజంలో ‘బలవంతుడెవ్వడో వానిదీ ధర’ అని ధనస్వామ్య రీతి రివాజుని చిన్నకథలో చూపారు రచయిత్రి. ‘ఎవరైనా చెప్పండి’లో పనిమనిషి కూతురు పధ్నాలుగేళ్ళ లక్ష్మికి చదువుమీద ఆసక్తి. కానీ తల్లి కూతురుకి వరుణ్ణి తెచ్చి పెళ్ళి చేయబోతుంది. అందుకే కథాశీర్షికను అలా ఎన్నుకున్నారు ఉషారాణి. ఇలా వస్తురూపాల మేలికలయికతో నేల మీద నడిచే పాత్రలతో పాఠకుల మనసుని, మేధని ఆలోచింపజేస్తూ కథాసృజన చేశారు ఆమె. ఉషారాణి మరణం సాహితీలోకానికి తీరని లోటు.


విహారి

Updated Date - 2021-01-02T06:19:10+05:30 IST