బెంగళూరు : డిజిటల్ ఎకానమీ ఓ బంగారు బాతు వంటిదని అమెరికా-భారత్ వ్యాపార మండలి (USIBC) చీఫ్ అతుల్ కేశప్ అభివర్ణించారు. ఈ రంగం నిరంతరం బలోపేతమవడానికి, వృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, నిబంధనలు, చట్టపరమైన నియంత్రణలను అమెరికా, భారత దేశాల్లో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన ఇండియా ఐడియాస్ కాంక్లేవ్‌లో ‘‘కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2.0’’ ప్యానెల్‌ను ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. కేశప్ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మాజీ డిప్లమేట్. ఇటీవల ఆయన భారత దేశంలో అమెరికా దౌత్య కార్యాలయంలో ఛార్జ్ డిఅఫైర్స్‌గా పని చేశారు.
చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్న భారత దేశ అభివృద్ధి (Impressive development), ప్రభుత్వ నేతృత్వంలో డిజిటైజేషన్ కృషి (Digitization efforts) విజయవంతమవడం, వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశ హోదాల గురించి అతుల్ మాట్లాడారు. ఇరు దేశాలకు డిజిటల్ ఎకానమీ ట్రేడ్ బంగారు గుడ్లు పెట్టే బాతు వంటిదని చెప్పారు. అమెరికా, భారత దేశాల్లో డిజిటల్ ఎకానమీ నిరంతరం వృద్ధి చెందడానికి, నిరంతరం బలోపేతమవడానికి వీలు కల్పించే వ్యవస్థలు, నిబంధనలు, చట్టపరమైన నియంత్రణలను ఏర్పాటు చేయాలని కోరారు.
భారత దేశంలో పెను విప్లవం జరుగుతోందని, దీని ప్రభావం భారత దేశం, అమెరికాలతోపాటు యావత్తు ప్రపంచంపైనా సకారాత్మకం (Positive)గా పెద్ద ఎత్తున ఉంటుందన్నారు. అనేక శతాబ్దాల అంతరాయాల తర్వాత భారత దేశం తిరిగి తన చారిత్రక హోదాకు వస్తోందన్నారు. ఈ భూమండలంపై అతి పెద్ద, అత్యంత చురుకైన, సౌభాగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశం (India) ఉండేదని తెలిపారు.
అమెరికా-భారత దేశం (The US-India) మధ్య సహకారం ఉంటే ప్రపంచ ఆర్థిక సవాళ్ళలో కొన్నిటిని పరిష్కరించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. సెమీకండక్టర్స్, రేర్ ఎర్త్ (భూమిలో ఉండే విలువైన లోహాలు) వంటివాటి విషయంలో ఆధారపడదగిన, తట్టుకోగలిగిన, స్వేచ్ఛా ప్రపంచ సరఫరా వ్యవస్థలను నిర్మించడంలో అంతిమ పరిష్కార ప్రభావాన్ని సాధించగలమని చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసే సమాజాలకు ఇంధనం, విద్యుత్తు, సహకారం అందజేయడానికి ఈ మెటీరియల్స్ చాలా ముఖ్యమైనవని వివరించారు.
అంతర్జాతీయ కంపెనీల నుంచి నిరంతరం పెట్టుబడులను ఆకర్షించాలన్నా, అమెరికాతో నిరంతరం బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరుచుకోవాలన్నా భారత దేశం తప్పనిసరిగా ఆచరణసాధ్యమైన, ఊహించదగిన విధానపరమైన వేదికను ఏర్పాటు చేయాలన్నారు.
సుస్థిరత, ముందుగా ఊహించదగిన పరిస్థితులు, పారదర్శకత, వ్యాపారాన్ని సులువుగా చేయగలగడం, సరళమైన విధానాలు, సమాన స్థాయిలో పోటీ పడేందుకు అవకాశాలుగల బరి ఉండటాన్ని పెట్టుబడిదారులు కోరుకుంటారని చెప్పారు. అనుచిత ప్రయోజనాలను వారు కోరుకోరన్నారు. అమెరికా-భారత్ వ్యాపార భాగస్వామ్యం 500 బిలియన్ డాలర్లకు చేరాలనే USIBC విజన్ గురించి మరొకసారి నొక్కి వక్కాణించారు. భావి అభివృద్ధి, అవకాశాల వేదికగా డిజిటల్ ఎకానమీ నిలుస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి