విరబూసిన అందాలు

ABN , First Publish Date - 2022-05-21T14:22:20+05:30 IST

నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో రెండేళ్ల తర్వాత ఏర్పాటైన పుష్ప ప్రదర్శనను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ప్రారంభించారు. అదే సమయంలో ఊటీ నగరం

విరబూసిన అందాలు

- ఊటీలో ఘనంగా ఫ్లవర్‌షో

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో రెండేళ్ల తర్వాత ఏర్పాటైన పుష్ప ప్రదర్శనను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ప్రారంభించారు. అదే సమయంలో ఊటీ నగరం ఆవిర్భవించి రెండు శతాబ్దాలు పూర్తయిన సందర్భంగా ‘ఊటీ 200’ పేరుతో ప్రత్యేక వేడుకలకు ఆయన శ్రీకారం చుట్టారు. నీలగిరి జిల్లాలో ప్రతియేటా వేసవిలో ఫ్లవర్‌షో, గులాబీ ప్రదర్శన, పడవల ప్రదర్శన, ఫల ప్రదర్శన ఇలా పలు రకాల ప్రదర్శనలను జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఉద్యానవన శాఖ సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. గత రెండేళ్లుగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రదర్శన నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో అట్టహాసంగా ఫ్లవర్‌ షో ప్రారంభమైంది. ఈ 124వ ఫుష్ప ప్రదర్శన ఈ నెల 24 వరకు కొనసాగనుంది. సుమారు లక్ష కార్నేషన్‌ పుష్పాలతో వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనం రూపాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా వివిధ రకాల పుష్పాలతో 200 రకాల కార్టూన్‌  రూపాలను కూడా ఉద్యావనంలో రూపొందించారు. ఇదే విధంగా వివిధ రకాల పుష్పాలతో పది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జెరేనియం, సైకల్‌మన్‌, సినోరియా, క్లాక్సీనియా, రెన్నకులస్‌,  ఆర్నమెంటల్‌ కేల్‌, ఓరియంటల్‌ లిల్లీ, ఆసియాటిక్‌ లిల్లీ, ఇన్కామెర్రీగోల్డ్‌, బికోనియా, కేండిడ్‌పట్‌, పెటూనియా, జీనియా, వెర్బినా, సన్‌పఫ్లవర్‌ ఇలా వివిధ రకాల పుష్పాలంతో ఏర్పాటైన ఈ ప్రదర్శన పర్యాటకులకు కనువిందు చేస్తోంది. సుమారు 200ల రకాలకు చెందిన పుష్పాలతో రూపొందించిన ఈ వింత ఆకృతులను సందర్శించేందుకు శుక్రవారం ఉదయమే వేల సంఖ్యలో సందర్శకులు బొటానికల్‌ గార్డెన్‌కు తరలివచ్చారు. ఈ పుష్ప ప్రదర్శనను సతీమణి దుర్గతో కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు.  అనంతరం ఆ ప్రాంతంలో పర్యాటకులతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. స్థానికులందించిన వినతి పత్రాలను స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. బ్యాటరీ కారులో ఇటాలియన్‌ పార్కుకు చేరుకున్నారు. ఆ సమయంలో తొలికరి జిల్లులు పడుతుండగా ఆయన వర్షంలో తడుస్తూ గొడుగుపట్టుకుని ప్రకృతి సౌందర్యాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, రామచంద్రన్‌, నీలగిరి ఎంపీ ఎ.రాజా, డిఎంకే కార్యదర్శి ముబారక్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి సమయమూర్తి, ఉద్యానవనాల శాఖ సంచాలకులు ఎన్‌ బృందాదేవి, నీలగిరి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అమ్రీత్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రదర్శన అందరూ తిలకించేందుకు శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా నీలగిరి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చేందుకుగా వీలుగా రవాణా సంస్థ 40 ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది.



Updated Date - 2022-05-21T14:22:20+05:30 IST