ఉగ్రవాదులతో Bjpకి లింకులు

ABN , First Publish Date - 2022-07-10T16:27:05+05:30 IST

ప్రజలకు నిత్యం దేశభక్తి, జాతీయత పాఠాలు చెప్పే బీజేపీ, ఉగ్రవాదులతో అంటకాగుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఉదయ్‌పూర్‌ హత్య ఘటనలో

ఉగ్రవాదులతో Bjpకి లింకులు

- ప్రధాని నోరు విప్పరేం 

- కాంగ్రెస్‌ ప్రశ్న 


బెంగళూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు నిత్యం దేశభక్తి, జాతీయత పాఠాలు చెప్పే బీజేపీ, ఉగ్రవాదులతో అంటకాగుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఉదయ్‌పూర్‌ హత్య ఘటనలో నిందితులకు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నట్టు వెలువడుతున్న కథనాలపై కాంగ్రెస్‌ దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. కేపీసీసీ కార్యాలయంలో లోక్‌సభ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. కొందరు ఉగ్రవాదులతో బీజేపీకి ఉన్న సంబంధాలను తెలిపే ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. కన్హయ్యాలాల్‌ హత్యకేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్‌ రియాజ్‌, బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడని ఫొటోలతో సహా మీడియాలో వెలుగుచూసిందన్నారు. ఇంత జరిగినా ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా నోరు మెదకపపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ఇటీవల పట్టుబడిన లష్కరె-తోయిబా సంస్థకు చెందిన తాలిబ్‌ హుసేన్‌ జమ్ము-కశ్మీర్‌ బీజేపీ మైనారిటీ మోర్చా సోషల్‌ మీడియా వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నాడన్నారు. బీజేపీకి చెందిన తారిక్‌అహ్మద్‌ మీర్‌ 2020లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ అరెస్టయ్యాడని గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ భజరంగ్‌దళ్‌ నేత బలరాంసింగ్‌ను కూడా ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేశాడన్న ఆరోపణలతోనే అరెస్టు చేశారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఉగ్రవాది మసూద్‌ అజర్‌కు ఆప్తుడైన మహ్మద్‌ ఫారుక్‌కు బీజేపీ శ్రీనగర్‌ పాలికె ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చిందని, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్లకొద్దీ ఉదాహరణలు ఉన్నాయన్నారు. బీజేపీ ఉగ్రవాదుల విషయంలో దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతోందన్నారు. జపాన్‌ మాజీ ప్రధాని దారుణహత్య అనంతరమైనా అగ్నిపథ్‌ పథకంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు సైనిక శిక్షణ ఇచ్చి నాలుగేళ్ల తర్వాత రిటైర్డ్‌ చేస్తే మనదేశంలోనూ జపాన్‌ తరహా ఘటనలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌, సోషల్‌మీడియా విభాగం అధ్యక్షుడు ప్రియాంక ఖర్గే తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-10T16:27:05+05:30 IST