హథ్రాస్‌లో హతమైన మానవత

ABN , First Publish Date - 2020-10-16T05:36:09+05:30 IST

‘అత్యాచారం అనేది సామాజిక నేరం. అది మగవాళ్ల మీద, మహిళల మీద ఆధారపడి ఉంటుంది. అది ఒకసారి తప్పు కావచ్చు, ఇంకొకసారి ఒప్పు కూడా కావ్వచ్చు’ అని 2014లో....

హథ్రాస్‌లో హతమైన మానవత

‘అత్యాచారం అనేది సామాజిక నేరం. అది మగవాళ్ల మీద, మహిళల మీద ఆధారపడి ఉంటుంది. అది ఒకసారి తప్పు కావచ్చు, ఇంకొకసారి ఒప్పు కూడా కావ్వచ్చు’ అని 2014లో ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు దళిత యువతులు అత్యాచారానికి, హత్యకు గురైనపుడు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి, బిజెపి నాయకుడు బాబూలాల్‌ గౌర్‌ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా అలాంటివే చాలా సంఘటనలు జరిగినపుడు వివిధ రాష్ట్రాలలో ఉన్న బిజెపి నాయకులు మహిళల వస్త్రధారణ మీద, వారి స్వేచ్ఛ మీద బురద చల్లుతూనే ఉన్నారు. దీనికి కారణం మతతత్వాన్ని, మనువాదాన్ని పెంచి పోషించేవారు రాజ్యమేలడమే. ఇది, జాతీయోద్యమ స్ఫూర్తితో ఏర్పడి, దేశాన్ని దాదాపు 60 సంవత్సరాలు పాలించిన పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక హథ్రాస్‌ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే బలవంతంగా అడ్డుకుని కిందపడేసి ఆ కుటుంబాన్ని చేరకుండా చేసేంతదాకా దారితీయడం శోచనీయం.


ఈ రకమైన పిచ్చిచేష్టలు బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మొదలయ్యాయి. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం, బూటకపు కేసులు బనాయించడం, చంపేయడం, విద్యార్థులపై దాడులు, అరెస్టులు చేయడం నిత్యకృత్యమైపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే ‘న స్త్రీ స్వాతంత్ర మర్హతి’ అన్న మనువాద సంస్కృతిని ప్రజల మీద రుద్దుతున్నారు. ‘కుటుంబం లేనివారు, ప్రజాక్షేమమే వారి ధ్యేయం’ అనే నినాదంతో మోదీ పాలన మొదలయింది. వాజ్‌పేయి వారసుడిగా ‘అచ్ఛే దిన్‌ ఆయేంగే’ అనే నినాదంతో ఆయన పాలన సాగింది. అయితే, అనూహ్యంగా 2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌కు పట్టం కట్టబెట్టి మరోసారి దేశ ప్రజల మతస్వేచ్ఛను ప్రభావితం చేయచూశారు.  దళిత మహిళల పైన, ఇతరుల పైన జరిగే అత్యాచారాలలో రాజస్థాన్‌ తర్వాత ఉత్తరప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. గత సెప్టెంబర్‌ 14న ఇరవైఏళ్ల దళిత యువతి మనీషాపై సామూహికంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించడంతో ఆమె మృత్యువుతో పోరాడుతూ సెప్టెంబర్‌ 29న చనిపోయింది. ఈ సంఘటన తర్వాత కూడా నేటి వరకు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అటు రాష్ట్రాలు, ఇటు కేంద్రంలోని నాయకులెవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అధికారదర్పంతో, అహంకారంతో బాధిత కుటుంబాలను బెదిరించడం, పరామర్శించడానికి వచ్చిన వారిని అనుమతించకపోవడం మామూలైపోయింది. రాత్రికి రాత్రే హథ్రాస్‌ ఘటనలో బాధితురాలి మృతదేహాన్ని ఖననం చేయడం వీరి చేష్టలకు పరాకాష్ఠ. హథ్రాస్‌ ఘటనలో మరో కీలకమైన అంశం ఏమిటంటే, రెండేళ్ల క్రితం కథువాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసు సందర్భంగా అక్కడ ఉన్న ఐపిఎస్‌ అధికారి, మనీషా కేసులో కూడా కీలకంగా వ్యవహరించడం. ఇవన్నీ బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు, అధికార దుర్వినియోగానికి అద్దం పడుతున్నాయి.


జాతీయ నేరపరిశోధన శాఖ 2019 సంవత్సరంలో జరిగిన నేరాలపై ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో మహిళలపై హింసకు సంబంధించి రోజుకు సుమారు 88 కేసులు నమోదు అవుతున్నాయి. 2018లో ప్రతి లక్ష మంది మహిళల్లో 58.8 శాతం మంది హింసకు గురయితే, 2019లో అది 62.4 శాతానికి పెరిగింది. ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం, ప్రతి నాలుగు గంటలకు ఒక అక్రమ రవాణా, ప్రతి 30 గంటలకు ఒక సామూహిక అత్యాచారం, ప్రతి రెండు రోజులకు ఒక ఆసిడ్‌ దాడి, ప్రతి గంటకు ఒక వరకట్న చావు జరుగుతున్నాయి. మరి ఈ గణాంకాలన్నీ ప్రభుత్వంలో ఉన్న నాయకుల దృష్టికి వెళ్లడం లేదా? వెళ్లినా వాళ్లకవి పెద్దగా ప్రాధాన్యం ఉన్న అంశాలని అన్పించడం లేదా? తెలియడం లేదు.


‘‘కాంగ్రెస్‌ కో హఠావో దేశ్‌ కో బచావ్‌’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మహిళల కోసం రూపొందించిన చట్టాలను అమలుపరిచే అవసరం లేదనుకుంటోంది. 2012లో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారం చేసి చంపేసిన సంఘటన జరిగిన వెంటనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నేర శిక్షా స్మృతికి సవరణ చేసి నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. అలాగే, పని చేసే ప్రదేశాలలో రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువచ్చి అమలులోకి తెచ్చి మహిళలకు తోడుగా నిలిచింది. అలాంటి చట్టాల మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో నిర్భయ కేంద్రాలను, మహిళల కోసం ప్రవేశపెట్టిన హెల్ప్‌లైన్లను గాలికొదిలేసింది. ఇలాంటి విషయంలో మన రాష్ట్రం కూడా ఏమాత్రం తీసిపోదు. ఈ దురాగతాలపై కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. ప్రజల సెంటిమెంటును మతం వైపు, దేశభక్తి వైపు ప్రేరేపిస్తూ వారి మనోభావాలతో ఆడుకుంటున్నాయి. మహిళలపై నిరాటకంగా అత్యాచారాలు జరుగుతున్నా అలాంటి ఘటనలను, హింసను అరికట్టడానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం కోసం పోలీసు యంత్రాంగాన్ని, న్యాయవ్యవస్థను, అధికార వ్యవస్థను, మీడియాను వారి చెప్పుచేతల్లో పెట్టుకుని బడుగు, బలహీన, దళిత వర్గాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. మహిళా రక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు పరిచి సమానత్వాన్ని, ఆస్తిహక్కును కల్పించి, సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో వారి ప్రాధాన్యాన్ని పెంచిన కాంగ్రెస్‌ పార్టీ మహిళలు, దళితలపై జరుగుతున్న అకృత్యాలను ఎదిరించడానికి, అక్కున చేర్చుకోవడానికి, ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది, అండగా నిలుస్తుంది. మనువాద పాలనకు పరాకాష్ఠగా నిలిచిన హథ్రాస్‌ సంఘటన సహా ఇప్పటికీ జరుగుతున్న అలాంటి అనేక దారుణాలపై జాతీయ స్థాయిలో పౌరసమాజం తీవ్రంగా స్పందించాలి. వాటిని ముక్తకంఠంతో ఖండించాలి.


కల్పన తడక (కార్యదర్శి, టిపిసిసి)

Updated Date - 2020-10-16T05:36:09+05:30 IST