మొసలిని బంధించి.. అటవీ అధికారులను రూ. 50 వేలు డిమాండ్ చేసిన గ్రామస్తులు!

ABN , First Publish Date - 2020-09-12T16:07:53+05:30 IST

యూపీలోని లఖీంపుర్ ఖేరీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల మిదనియా...

మొసలిని బంధించి.. అటవీ అధికారులను రూ. 50 వేలు డిమాండ్ చేసిన గ్రామస్తులు!

లక్నో: యూపీలోని లఖీంపుర్ ఖేరీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల మిదనియా గ్రామానికి చెందిన కొంతమంది ఒక మొసలిని బంధించారు. ఆ తరువాత దానిని విడచి పెట్టాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని అటవీశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ గ్రామానికి కొద్ది దూరంలోనే దుధ్వా నేషనల్ పార్కు ఉంది. నీటిని వెదికే ప్రయత్నంలో ఆ మొసలి గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు ఆ మొసలిని బంధించారు. ఈ సందర్బంగా రిజర్వ్ బఫర్ ఏరియా డిప్యూటీ డైరెక్టర్ అనిల్ పటేల్ మాట్లాడుతూ మిదనియా గ్రామంలోకి ఒక మొసలి చొరబడిందంటూ ఫోను రావడంతో తమ బృందం అక్కడకు వెళ్లి, మొసలి కోసం వెదుకులాట సాగించిందని, రాత్రి కావడంతో ఈ పనులు నిలిపివేసిందన్నారు. అయితే మర్నాడు గ్రామం నుంచి తిరిగి ఫోన్ వచ్చిందని, మొసలిని ఎప్పుడు పట్టుకుంటారని వారు ప్రశ్నించారన్నారు. దీంతో తమ బృందం తిరిగి గ్రామానికి వెళ్లిందన్నారు. ఇంతలో గ్రామస్తులు చెరువులోని నీటిని తోడివేసి, ఆ మెసలిని తాళ్లలో బంధించి వెలికి తీశారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మొసలిని పట్టుకున్నామని, అందుకే తమకు ప్రతిఫలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.



గ్రామాధ్యక్షుడు అటవీశాఖ అధికారులకు గ్రామానికి చెందిన 15 మంది పేర్ల జాబితా ఇస్తూ, వీరింతా మొసలిని పట్టుకున్నారని తెలిపారు. వీరందరికీ రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే గ్రామాధ్యక్షుడు తన మొండిపట్టు వీడక, డబ్బులు ఇస్తేగానీ మొసలిని విడిచిపెట్టేది లేదంటూ తెగేసి చెప్పాడు. దీంతో అటవీశాఖ అధికారులు ఇలా ప్రవర్తిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు ఆ మొసలిని అటవీశాఖ అధికారులకు అప్పగించక తప్పలేదు.

Updated Date - 2020-09-12T16:07:53+05:30 IST