Uttarakhand receptionist murder: సొంత పార్టీ నేతలనూ వదలని బీజేపీ ‘బుల్డోజర్’

ABN , First Publish Date - 2022-09-24T15:40:23+05:30 IST

నేరగాళ్ల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేసే సంప్రదాయాన్ని

Uttarakhand receptionist murder: సొంత పార్టీ నేతలనూ వదలని బీజేపీ ‘బుల్డోజర్’

న్యూఢిల్లీ : నేరగాళ్ల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేసే సంప్రదాయాన్ని బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రారంభించారు. గతంలో ఓ మహిళపై దాడి చేసిన బీజేపీ (BJP) నేతకు చెందిన అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని ఆదేశించారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి.  తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ఆ బాటలోనే పయనిస్తున్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన బీజేపీ నేతకు చెందిన రిసార్ట్‌ను కూల్చేయాలని ఆదేశించారు. 


ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మాటీ కాలా బోర్డు మాజీ చైర్మన్, బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌ను కూల్చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం రిసార్ట్‌ కూల్చివేత కొనసాగుతోందని ముఖ్యమంత్రి వద్ద స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అభినవ్ కుమార్ మీడియాకు చెప్పారు. 


అసలేం జరిగింది?

పులకిత్ ఆర్యకు యమకేశ్వర్‌లో ఓ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ మేనేజర్‌గా సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్‌గా అంకిత్ గుప్తా పని చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న 19 ఏళ్ళ యువతి సెప్టెంబరు 18న అదృశ్యమయ్యారు, అనంతరం హత్యకు గురయ్యారు. ఈ కేసులో పులకిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను శుక్రవారం అరెస్టు చేశారు.  వీరిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఆమె తండ్రి కథనం ప్రకారం ఆమెను నిందితులు లైంగికంగా వేధించారు. ఆ ఆడియో రికార్డయింది. 


కూల్చేయాలని నేనే డిమాండ్ చేశా : ఎమ్మెల్యే

యమకేశ్వర్ ఎమ్మెల్యే రేణు బిస్త్ మాట్లాడుతూ, రిసెప్షనిస్ట్ హత్య జరిగిన వెంటనే తాను స్పందించానని చెప్పారు. నేరగాళ్ళలో భయం నింపేందుకు ఆ భవనాన్ని కూల్చేయాలని డిమాండ్ చేశానని చెప్పారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ధన్యవాదాలు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినపుడు అనుచితంగా ప్రవర్తించిన రెవిన్యూ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు.  


అన్ని రిసార్ట్‌ల్లో తనిఖీలు

రిసెప్షనిస్ట్ హత్య జరిగినట్లు వెల్లడైన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన పెల్లుబికింది. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌ను కూల్చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని రిసార్టులను తనిఖీ చేయాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న రిసార్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. రిసెప్షనిస్ట్ హత్య జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను అరెస్టు చేయడానికి తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించారని చెప్పారు. నేరగాళ్ళు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2022-09-24T15:40:23+05:30 IST