ఈసీకి ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు

ABN , First Publish Date - 2021-12-30T02:15:51+05:30 IST

కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ భయాదోళనల నేపథ్యంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల..

ఈసీకి ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు

డెహ్రాడూన్: కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ భయాందోళనల నేపథ్యంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కు ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారంనాడు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై తమ వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా, జస్టిస్ నారాయణ్ సింగ్ ధనిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.


ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉండగా, ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలకు పెద్దఎత్తున జనాలు హాజరవుతున్న ఫోటోలను పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో సహా కోవిడ్ నిబంధనలను ఎవరూ పాటించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇతర కోవిడ్ వేరియంట్ల కంటే ఒమైక్రాన్ వేరియంట్ 300 శాతం వేగంగా విస్తరిస్తోందని, ప్రజల ప్రాణాలను కాపాడాలంటే పెద్దఎత్తున జనసమీకరణ జరిగే ఎన్నికల ర్యాలీల వంటి కార్యక్రమాలకు అడ్డుగట్ట వేయడం అనివార్యమని అన్నారు. న్యాయవాది శివ్ భట్ ఈ పిటిషనర్ వేశారు. కాగా, ఇదే అంశంపై పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు కూడా హైకోర్టు ముందు పెండింగిలో ఉన్నాయి. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని ప్రస్తుతం కోర్టు నిశితంగా పరిశీలిస్తోంది.

Updated Date - 2021-12-30T02:15:51+05:30 IST