ఉత్తరాంధ్ర కథల హవల్దారు

ABN , First Publish Date - 2022-06-20T06:20:49+05:30 IST

‘విరామం’ రచయితగా శ్రీ అంగర వెంకటకృష్ణారావు నాకు తెలుసు. 1970లో విరామం చదివేను. ఓసారికాదు, చాలాసార్లు!...

ఉత్తరాంధ్ర కథల హవల్దారు

‘విరామం’ రచయితగా శ్రీ అంగర వెంకటకృష్ణారావు నాకు తెలుసు. 1970లో విరామం చదివేను. ఓసారికాదు, చాలాసార్లు! 


నే చదివేననే కంటే అదే అన్నిసార్లు చదివించింది అని చెప్పాలి. ఉత్తమ సాహిత్యం పదేపదే మనల్ని తనలోకి లాక్కుపోతూ ఉంటుంది. ఆయన కథల్ని చదివే అవకాశం ఇప్పుడు ‘కథాకృష్ణమ్‌’ సంకలనం వల్ల కలిగింది.


‘కథాకృష్ణమ్‌’లో నలభైఎనిమిది కథలు ఉన్నాయి. ఈ సృజనశీలి తన పద్దెనిమిదో ఏట ఓ మూడు కథలూ, పంతోమ్మిదో ఏట ఓ కథా రాసేక తిరిగి పదేళ్ల తర్వాత ధారాళంగా పట్టిన కలం కిందకు దించకుండా కథారచన చేసినట్టు వారి రచనా ప్రస్థాన పరిశీలన తెలియచేస్తోంది. 


ఈ పదేళ్ల విరామానికి కారణం- ఆయన హవల్దారుగా సైన్యంలో చేరడం. సైన్య విరమణానంతరం- అనగా 1940లో తన ఇరవయ్యో ఏట సైన్యంలో చేరి ఎనిమిదేళ్ల తర్వాత 1948లో బైటకు వచ్చిన  తర్వాత- ఓ వెల్లువలా రచనా, ప్రచురణ జరిపేరు. విలువలూ ఆశయాల కోసం పట్టిన ఆ కలం ఆయన కన్ను మూసేటంతవరకూ సాగింది. ఆగలేదు. జీవించినది ఏభైనాలుగు సంవత్సరాలు మాత్రమే.


ఆయన కథారచయితగా నిరాడంబర వ్యక్తిగా రూపొందడంలో రెండు అంశాలు ప్రధాన భూమిక పోషించాయి. మొదటిది వారి బాల్యకౌమార్యాల్లో తమ మేనమామ గారి దగ్గర పెరగడం. రెండవది 1939-46 మధ్య రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తూర్పు బెంగాల్‌లో హవల్దారుగా ప్రజల దుస్థితిని ప్రత్యక్షంగా చూడడం. కృష్ణారావుగారి మేనమామ మరెవరో కాదు. ఆనాటి ప్రసిద్ధ చారిత్రక నవలారచయితా, కథకులు మొసలికంటి సంజీవరావుగారు. ఆయన ‘బక్సారు యుద్ధం’, ‘మొగలాయి దర్బారు’, ‘ఔరంగజేబు పాదుషా’ మొదలైన నవలలే కాక ‘మగడా! నన్ను ఆజ్ఞపెట్టకు’ వంటి కథలు కూడా రచించారు. వారి దగ్గర పెరిగిన అంగరవారు సాహిత్య పఠన పిపాసిగా ఉత్తమ రచయితగా రూపొందడంలో ఆశ్చర్యం ఏమీలేదు! హవల్దారుగా తాను కళ్లారా చూసిన బతుకు ఆయన మనసు మీద ఎప్పటికీ చెరగని ముద్రవేసింది. జనసామాన్యుల బతుకు బాధలు కలవర పరిచాయి. సరళమైన జీవితం, లోతైన ఆలోచనతో బతుకు సాగించాలన్న నిర్ణయం, లేనివారి పట్ల జాలీ కరుణ, స్త్రీల అభ్యున్నతికి తపన, మానవతా దృక్పథం వారిని వ్యక్తిగా, రచయితగా నడిపించాయి. చిట్టివలస జనపనార మిల్లులో చిన్నపాటి ఉద్యోగంతో ప్రారంభించి, సైన్య జీవితానుభవాన్ని పొంది, సైన్య సేవా విరమణ తర్వాత లభించే పెన్షను గురించి గాని దాని వల్ల వచ్చే భూవసతి గురించి గాని పట్టించుకోకుండా, విశాఖపట్నంలో బ్రూక్‌బాండ్‌ కంపెనీ శాఖా కార్యాలయపు ఉద్యోగాన్ని బతుకు చివరదాకా చేయడంలోనూ ఆయన దృక్పథం కనబడుతుంది.


యుద్ధాలు శాంతికి శత్రువులు. జన సామాన్యుల, ముఖ్యంగా స్త్రీలూ పిల్లల బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయి. యుద్ధాలు లేని రోజు మానవ సమాజంలో ఏనాటికైనా వస్తుందా అనే తపన కూడా అంగర కృష్ణారావుగారి దృక్పథంలో ఒక అంశమై ఉన్నట్టూ తెలుస్తుంది. సాయుధ పోరాటానికి రచయితలు నిబద్ధత కలిగి ఉండడాన్ని ఆయన అంగీకరించకపోవడం వెనక యుద్ధకాలంనాటి ఆయన అనుభవంతో ఏర్పడిన ఈ దృక్పథమూ ఉంది. భావప్రకటనా స్వేచ్ఛ మౌలిక ప్రాతిపదికగా సాహితీవేదిక అవసరమని భావించి విశాఖసాహితిని స్థాపించడంలోనూ ఆయన ఈ తత్వమే కార్యసాధనకి ప్రేరేపించిం దనడం సత్యదూరం కాబోదు. ఈ జీవితనేపథ్యంతో ఆయన తాను ప్రత్యక్షంగా చూసిన జీవితాన్ని తనకు తారసపడిన వ్యక్తుల శీలస్వభావపరిశీలనతో తాను ఎరిగిన, తిరిగిన, ఎదిగిన ప్రాంతాల వాతావరణాన్ని ఒడిసి పట్టుకొని నవలలు, కథలు రచించారు.


ఈ సంకలనంలో ఉన్న కథ కాని కథలు; దెయ్యంకథలు; సంగీతపు కథలు; రైలు ప్రయాణం కథలు; కథకుల కథలు; స్త్రీల వెతల స్థితిగతుల కథలు; అవినీతి లంచగొండితనం, దగాలు, మోసాలతో నిండి ఉన్న సమాజ కథలు; ప్రేమాపగా కథలు- ఇలా వస్తువైవిధ్యంతో ఏ కథకా కథ వేరుగా బతుకును చిత్రీకరించింది. కథల నిడివి కూడా వేరు వేరుగా ఉంటుంది. ఒక పేజీలో ఉన్న పొట్టికథా ఉంది, ఇరవై పేజీల పొడుగు కథలూ ఉన్నాయి!


అంగరా, చాసో సమకాలికులు. చాసో కన్నా అంగర ఐదు సంవత్సరాలు చిన్నవారు. ఇద్దరూ ఒకే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు. విజయనగరం సంగీత గాలులను పీల్చినవారు. అంగర రచించిన ‘బాదంచెట్టూ - తంబూరా పెట్టె’ కథా, చాసో రచించిన ‘వాయులీనం’ కథా స్త్రీల సంగీతం కథలే. అంగర 1965లో రచించారు. చాసో వాయులీనం 1952లో రాసేరు. 13 సంవత్సరాల తేడాలో రాసిన కథలు. ఒకరు మధ్యతరగతి ఎల్‌.డి. గుమస్తా భార్య అయితే మరొకరు గొప్పింటి కోడలు. ఇద్దరి సంగీతం అత్తారిళ్లలో అర్థం లేనిదయింది. ఒకరిది ‘వాయులీనం’ అయిపోయింది. రెండవ ఆమె ఆయువు వాయువులో కలిసిపోయింది. ఈ రెండు కథలను తులనాత్మకంగా సామ్య భేదాలతో చర్చించవచ్చు. అంగర వారి కథ మరో కథనీ గుర్తుకు తెస్తుంది. అది అమెరికన్‌ కథకుడు ఒ.హెన్రీ రాసిన ‘ది లాస్ట్‌ లీఫ్‌’. ఇక్కడ బాదంచెట్టు ఆకులురాల్చి ఎండిపోతే అక్కడ Ivy vine ఆకులు రాల్చేస్తుంది! ఇక్కడ ఊపిరితిత్తుల్లో పుట్టకురుపు మొలిస్తే అక్కడ నిమోనియాతో బీద యువతి బాధపడుతుంది. ఒ.హెన్రీ 1907లో రాసిన కథ! ఈ రెండింటినీ కూడా తులనాత్మకంగా సామ్య భేదాలతో చర్చించవచ్చు. అలాగే అంగర వారి ‘పెద్దమనిషి’ కథా, చాసో ‘జంక్షనులో బడ్డీ’ కథా బడ్డీ దుకాణాలని పీకించేసే కథా వస్తువును తీసుకుని రాసి నవి. ఈ రెండింటి తేడాలను, రాసిన విధా నాలను వెనక ఉన్న తాత్త్వికతలను చర్చిం చవచ్చు. ఈ రకమైన విశ్లేషణలు ఒకే భాషలో రాసిన రచయితలవీ, భిన్న భాషల రచయితలవీ రావల్సిన అవసరం ఉంది. ఇటువంటి విమర్శ పెరగాలి.


అంగర పదేళ్ల విరామం తర్వాత 1948లో తిరిగి కలం పట్టిన సంవత్సరంలోనే మొసలికంటివారి ‘మగడా! నన్ను ఆజ్ఞపెట్టకు’ ఆనంద వాణిలో అచ్చయింది. రోమన్‌ చక్రవర్తి అగస్టస్‌ సీజరు కూతురు జారిణి జూలియా కథ. సంస్కృత సమాసభూయిష్టమైన శిష్ట వాఙ్మయపు ధోరణితో పాటు సామాన్యుల సరళమైన మాటలను సమానంగా రాసే నేర్పును ఈ కథలో చూస్తాం. సంజీవరావుగారి ఈ భాషా శైలి, చెప్పే ధోరణి కృష్ణారావుగారి కథల్లో కనబడుతుంది. సంజీవరావు గారి కథా శీర్షికే అటువంటిది. కథ ‘మగడా! నా సహస్రవిటులలో నీవొకడవి! నన్ను ఆజ్ఞపెట్టకు’ అనే వాక్యంతో ప్రారంభం అవుతుంది! కృష్ణారావు గారి ‘మిథ్యామతి’ కథలో ‘ఓసీ - స్త్రీ! భార్యా! అస్వతంత్రజీవీ! ఇంతపొగరా!’ వాక్యం ఇటువంటిదే! కథాసందర్భాలూ, వస్తువూ వేరయినవే అయినా బరువైన భాషనీ, తేలికైన మాటలని సమానంగా వాడుతూ కథనడిపించే విధానంలో ఈ పోలిక కనబడుతుంది.


ఔచిత్యానికి పెద్దపీట వేస్తూ బరువు భాషనీ, తేలిక భాషని సమా నంగా రాయగలిగిన రచయిత అంగర వారు. వస్తువుని బట్టి భాషా కథనం మారుతూ ఉంటుంది వారి కథల్లో. ఒకటి రెండు పేజీల కథ అయినా ఇరవై పేజీల పొడుగు కథలయినా పాఠకుడి దృష్టిని అటూ ఇటూ పోనివ్వకుండా ఆయన కలం తన పట్టులో బిగించి నడిపిస్తుంది. ఆయన తన కథలకు పెట్టిన శీర్షికల్లోనూ బరువు భాషా, తేలిక భాషల ప్రయోగాన్నీ, కథావస్తువుకనుగుణంగా పెడ్తారన్న అంశం మన గమనంలోకి వస్తుంది: ముక్తధార, కుముద్వతి, మిథ్యామతి, హృదయ ఛురికలు వంటివీ; చిట్టిబూరెలు, చిలుకపలుకు, సత్తురూపాయి, చవట మేనళ్లుళ్లు వంటివి - రెండు రకాలవి కనబడతాయి. ఇదే విధంగా ఆయన పొట్టి శీర్షికలూ, పొడుగు శీర్షికలు కూడా తమ కథలకు పెట్టేరు. రైలులో గాజుల చప్పుడు, రైలు మారిన ప్రయాణం, బాదం చెట్టు-తంబూరపెట్టి, జిగిబిగి, వెలుగు, గుర్రం, వంతెన... ఇత్యాదులు.


వీరి కథల్లో కొట్టొచ్చినట్టు కనిపించే మరొక విశిష్టత వీరి ఉటంకింపులు. వారు ఎంతగానో అభిమానించి చదువుకున్న సంస్కృతం, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు భాషల కావ్యాల పంక్తులకి పంక్తులు వారి కథల్లో కనబడతాయి. షేక్స్‌పియర్‌ పద్యాలు, డేనియల్‌ డెఫో ‘రాబిన్సన్‌ క్రూసో’, అరబ్బీరాత్రులు, భగవద్గీత శ్లోకాలు, జయదేవుని అష్టపదులు, శ్రీశ్రీ, నారాయణబాబు గేయాలు (శ్రీశ్రీ- ‘బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను’ - మీద కథే రాసేరు) రవీంద్రుడి తాజమహల్‌, తదితర ప్రేమగీతాలు, తత్త్వాలు, భక్తి పాటలు ఇత్యాదులు. తమ పాండితీ గరిమ, విద్వత్తుల నిరూపణకు కథల మధ్య ఇరికించి అతికించిన ఉటంకింపులు కావివి. ఆయా కథలకూ, సందర్భాలకూ, పాత్రల మనస్తత్వానికి సరిపోయినవి, ఆయా వాతావరణానికి తగినవి, కథల్లో మిళితమైపోయి నవి ఆ ఉటంకింపులు! గురజాడ కన్యాశుల్కానికి అనుబంధం జోడించి అందులో ఆయన పేర్కొన్న వాటి వివరణలు ఇచ్చినట్టుగా అంగర సంకలనానికి కూడా అనుబంధం జోడించి వివరణలు ఇవ్వవలసినదే. అందులోనూ ఈనాటి కొత్తతరం యువతకు వాటి అవసరం ఎక్కువ అని వేరే చెప్పుకోనక్కరలేదు!


వీరి ఉపమానాలు, పోలికలు కూడా ఎంతో మౌలికమైనవి: ‘‘రైలు ఉక్కుగుర్రంలా’’, ‘‘చిరిగిపోయిన డప్పులాంటి గొంతు’’, ‘‘మొక్కజొన్న పొత్తుమీది పీచులాంటి జుత్తు’’, ‘‘పళ్లు గవ్వల దండల్లా’’, ‘‘భోగిమంట లాంటి ఎర్రటి కళ్లు’’, ‘‘చీపురకట్టలాంటి మీసాలు’’, ‘‘రైలింజను దీపాల్లాంటి కళ్లు’’, ‘‘అమృతాంజనం బొమ్మల్లా నర్సులు’’ - వంటివి ఎన్నో!! 


మాండలికాలు: ఖంగుతిండం, మొర్రలు కొట్టడం, టిక్కడి పోవడం, అదాట్టు, నజ్జు మనిషి, దిద్దర, టెంకలు కొట్టడం, సబ్బుడిబ్బీ, కడియం కట్టడం, నత్తానావ, కుతపకాలం, గుమ్మరించడం, పల్లకుండడం, టువ్వు టువ్వు మండం, జుమా యించడం, దారిబుచ్చి, అచ్ఛాణీ, ఇత్యాదులు. హుమస్సు, రహస్సు వంటి మాటలు వాడడం బరువుభాషా నిర్మాణాత్మకలి వల్ల వచ్చినవి!


వ్యక్తీకరణల్లోనూ వారిదే అయిన ముద్ర కనబడుతుంది. ఉదాహరణకి ఛాతీ సైజు చెప్ప డానికి ఆయన ‘‘ఛాతీ మంచం ఈ దండికీ ఆ దండికీ తగుల్తుంది’’ అంటారు. ఎన్నేళ్లయిందో చెప్పడానికి ‘‘తండ్రికి ఆరూ తల్లికి నాలుగూ తద్దినాలు పెట్టేడు’’ అం టారు! ‘‘తలపులు ఇనప కమ్చీల్లా కొడతాయి’’ అనీ అంటారు! దృశ్యాన్ని కళ్ల ముందు కదలాడేటట్టు రాయడం అందరికి రాదు! ‘‘సిగరెట్టుని రెండువేళ్ల మధ్య పెట్టకుండా శంఖంలా పిడికిలిని బిగించి దమ్ములాగి చిటికవేసి రొయ్యి రాల్చేడ’’ట! అవును ఒక్కొక్కరు ఒక్కొక్కలా సిగరెట్టు దమ్ము లాగుతారు! ఆయన హాస్యప్రియత్వం అక్కడక్కడా చిరునవ్వులు తెప్పిస్తుంది. విజయనగరం వారు కూడా కదా రామూర్తి అన్న పేరున్న పాత్రని పెట్టి అతగాణ్ణి గేలిచేస్తారు. ‘‘కోడిరామ్మూర్తిలా ఏనుగును ఛాతీ మీద ఎక్కించుకోలేదు గాని వోమాటు గేదెపెయ్యని యెక్కించుకున్నాడు! ఒక రిబ్బు విరిగింది!’’. 


సంకలనం లోని నలభై ఎనిమిది కథలనూ వివరించి విశ్లేషిస్తూ రాసి ఉండిఉంటే ఆ పుస్తకం కన్నా ఇదే పెద్ద గ్రంథం అవుతుంది! ఆయన నవల ‘విరామం’ కన్నడంలోకి వెళ్లిందని తెలిసింది. మిగతా భాషల్లోకి ఈ నాటికీ వెళ్లలేదు! అన్ని భాషల మాట దేవుడెరుగు, ఇంగ్లీషులోకి, హిందీలోకి ఈ నవల ముందు తర్జుమా అవ్వాలి. విశ్వ సాహిత్య జగత్తులో తెలుగువాణి ప్రతిష్టించబడి ఆయా భాషల్లో అక్కడి జనం నోట పలకాలి. 

చాగంటి తులసి

99633 77672

Updated Date - 2022-06-20T06:20:49+05:30 IST