విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మరో రాష్ట్రం నుంచి మోసం.. అతను ఎలా చేశాడంటే..

ABN , First Publish Date - 2021-12-01T11:41:32+05:30 IST

విదేశాలలో ఉద్యోగం అంటే తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ ప్రయత్నంలో దళారులను నమ్ముకొని మోసపోతుంటారు. ఇలాంటిదే ఒక కేసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఆ మోసం చేసిన ఏజెంట్ ఉత్తరాఖండ్‌లో కూర్చొని కేంద్రపాలిత ప్రాంతాలైన దమన్ దయు, దాద్రా నాగర్ హవేలీలో ఉన్న యువకులను భారీ స్థాయిలో టార్గెట్ చేశాడు...

విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మరో రాష్ట్రం నుంచి మోసం.. అతను ఎలా చేశాడంటే..

విదేశాలలో ఉద్యోగం అంటే తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ ప్రయత్నంలో దళారులను నమ్ముకొని మోసపోతుంటారు. ఇలాంటిదే ఒక కేసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఆ మోసం చేసిన ఏజెంట్ ఉత్తరాఖండ్‌లో కూర్చొని కేంద్రపాలిత ప్రాంతాలైన దమన్ దయు, దాద్రా నాగర్ హవేలీలో ఉన్న యువకులను భారీ స్థాయిలో టార్గెట్ చేశాడు.


ఉత్తరాఖండ్‌కు చెందిన పూరన్ సింగ్ అనే వ్యక్తి టర్కీ దేశంలో ఉద్యోగం చేసి అయిదు సంవత్సరాల క్రితం భారత్ తిరిగివచ్చాడు. ఆ తరువాత ఒక ఏజెన్సీ స్థాపించి అక్కడి యువతకు విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు 15 మందిని టర్కీలో ఉద్యోగానికి పంపించాడు. ఆ తరువాత అతడు ఆన్‌లైన్‌లో తన ఏజెన్సీ గురించి ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనకి కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.


కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి పూరన్ సింగ్ వెళ్లి అక్కడ ఏకంగా 150 మంది వద్ద నుంచి కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. వారందరికీ వెంటనే ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పాడు. వారిలో 35 మంది వద్ద పాస్‌పోర్ట్‌లు తీసుకొని వారందరినీ విమానశ్రయానికి రమ్మన్నాడు. ఆ 35 మంది విమానాశ్రయం వచ్చినప్పుడు పూరన్ సింగ్ అక్కడికి రాలేదు. దీంతో తాము మోసపోయామని అర్థం చేసుకున్న వారంతా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేసి పూరన్ సింగ్ కేసులో ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసులను సహాయం కోరారు. ఆ తరువాత ఇరు రాష్ట్రాల పోలీసులు ఒక వ్యూహం పన్ని పూరన్ సింగ్‌ని పట్టుకున్నారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-12-01T11:41:32+05:30 IST