ఉత్తి కోతలే!

ABN , First Publish Date - 2021-08-03T04:59:20+05:30 IST

జిల్లాలో సాగునీటి వనరులకు కొదవ లేదు. వాటిని రైతులకు ఉపయోగపడేలా మళ్లించడంలోనే వైఫల్యం కనిపిస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టే సమగ్ర చర్యలు లేవు. మైదాన ప్రాంతాల నుంచి నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలంటే ఎత్తిపోతల పథకాలే ఆధారం.

ఉత్తి కోతలే!
తోటపల్లి రిజర్వాయర్‌

ప్రతిపాదనల్లోనే పథకాలు

మంజూరు చేసి.. నిర్మాణాలు మరిచిన వైనం

జిల్లాలో ఎత్తిపోతల పథకాల తీరిదీ

అడుగు ముందుకు పడని తోటపల్లి స్కీంలు


జిల్లాలో సాగునీటి వనరులకు కొదవ లేదు. వాటిని రైతులకు ఉపయోగపడేలా మళ్లించడంలోనే వైఫల్యం కనిపిస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టే సమగ్ర చర్యలు లేవు. మైదాన ప్రాంతాల నుంచి నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలంటే ఎత్తిపోతల పథకాలే ఆధారం. జిల్లాలో అనేక చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. నిర్మాణం మాత్రం మరిచారు.


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

మెట్ట ప్రాంతాల రైతాంగానికి సాగునీటిని చేరువ చేయాలంటే ఎత్తిపోతల పథకాల ద్వారానే సాధ్యం.  వాగులు....సాగునీటి కాల్వలపైన, జలాశయాల్లో అవకాశం ఉన్న చోట్ల పథకాలను ఏర్పాటు చేయవచ్చు. కొన్ని ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదించి పథకాలు మంజూరు చేసినా ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. మరికొన్ని ఉన్నతాధికారుల వద్ద ఫైళ్ల రూపంలోనే ఉన్నాయి. దీంతో రైతులు వాటిపై ఆశలు వదులుకున్నారు. వృథాగా కడలిలో కలిసిపోతున్న నీటిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 తోటపల్లి జలాశయంలో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సాగునీటి కాల్వలపై ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. తొలుత నాగూరు వద్ద ఎడమ కాల్వపై ప్రతిపాదించారు. దీనిని శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రతిపాదనలు రద్దయ్యాయి. తర్వాత జలాశయంలోనే ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదించారు. ఎడమ వైపున మూడు పథకాలకు మంజూరు ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. వీటి ద్వారా 6,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నాగూరు, చింతలబెలగాం, తోటపల్లి పథకాల పేరుతో మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. నేడు వాటి జాడే లేదు. 

బొబ్బిలి మండలం రాముడువలస, తెర్లాం మండలం లోచర్ల ప్రాంతాల్లో తోటపల్లి కుడి ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదించారు. ఇవి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతిపాదనలు. రాముడువలస వద్ద రూ.37 కోట్లతో 2,593 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. లోచర్ల వద్ద రూ.15 కోట్ల వ్యయంతో 1,732 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు ఎస్‌ఈ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించినవి కావడం వల్ల వీటిని రద్దు చేసి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. 

సాలూరు నియోజకవర్గ పరిధిలో బోగవలస, మామిడిపల్లి, పెదపదం, రొయ్యివానివలసల్లో ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు పంపించారు. వీటి ద్వారా పదివేల ఎకరాల పైచిలుకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఉన్నతాధికారుల వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. ఇవి పూర్తయితే సాలూరు నియోజకవర్గంలోని రైతాంగానికి మేలు జరుగుతుంది. బోగవలసలో 2వేల ఎకరాలకు సాగునీరు అందేలా రూ.18 కోట్లతో ప్రతిపాదించారు. 1,072 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పెదపదంలో రూ.9 కోట్లతో ప్రతిపాదించారు. మామిడిపల్లి వద్ద సువర్ణముఖి నదిపై 160 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1.2 కోట్లతో ప్రతిపాదించారు. ఇవన్నీ ప్రతిపాదనల దశ దాటి కదలలేదు. 

కురుపాం నియోజవర్గ పరిధిలోని కురిశిల, పనసభద్ర, కుంబికోట ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు. కురిశిల వద్ద నాగావళి నదిపై 175 ఎకరాలకు, పనసభద్రలో 325 ఎకరాలకు, కుంబికోటలో 495 ఎకరాలకు, కురుపాం వద్ద గుమ్మిడిగెడ్డపై 325 ఎకరాలకు సాగునీటి కోసం మొత్తంగా నాలుగు మినీ ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదించారు. ఇదే మండలం బల్లపాడు, పెదగొత్తిలి ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదించారు. ఇవేవీ పట్టాలెక్కలేదు. 

బాడంగి మండలంలో వాడాడ వద్ద నూతనంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.8 కోట్ల వ్యయంతో 861 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఈ పథకానికి రూపకల్పన చేసి పూర్తి చేశారు. ఈ ఖరీఫ్‌ నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. జిల్లాలో మిగిలిన పథకాలన్నీంటినీ వదిలేశారు. 

అన్ని పథకాలను పూర్తిచేస్తాం

జిల్లాలో మంజూరైన ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తిచేస్తాం. మరింతగా సాగునీటి వనరులు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త పథకాలు కూడా మంజూరు కానున్నాయి. నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం. వాడాడ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

                                        - సత్యప్రసాద్‌, డీఈ, లిఫ్ట్‌ఇరిగేషన్‌ 


Updated Date - 2021-08-03T04:59:20+05:30 IST