ఖాళీలు లక్షల్లో, ఉద్యోగాలు వేలల్లో

ABN , First Publish Date - 2021-07-09T06:20:01+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 2.30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తానంటూ, ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండరును విడుదల చేస్తానంటూ బూటకపు వాగ్దానాలతో...

ఖాళీలు లక్షల్లో, ఉద్యోగాలు వేలల్లో

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 2.30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తానంటూ, ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండరును విడుదల చేస్తానంటూ బూటకపు వాగ్దానాలతో యువతని బులిపించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ పాటు ఉద్యోగ కల్పన ఊసే ఎత్తకుండా గడిపేసి, ఇప్పుడు వాగ్దానం చేసిన 2.30 లక్షల ఉద్యోగాల్లో కేవలం 10,143 ఉద్యోగాలకు మొక్కుబడి జాబ్ క్యాలెండరును విడుదల చేశారు. ప్రకటనల్లో మాత్రం లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామ‌ని నిరుద్యోగుల్ని నిండా ముంచారు. ప్రభుత్వం తక్షణమే ఈ జాబ్ క్యాలెండరును ఉప‌సంహరించుకోవాలి. జగన్ ఎన్నిక‌ల స‌భ‌ల్లో ప్రకటించిన 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి కొత్తగా రీనోటిఫికేష‌న్ ఇవ్వాలి. 


వైసీపీ త‌మ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామ‌ని, మొత్తం 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనూ ఏ జనవరి ఒకటినా జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌లేదు. ఇప్పుడు విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌రులో - రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో దశాబ్దాలుగా పని చేస్తున్న 50వేల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన లెక్కని కూడా తమ ఖాతాలో వేసుకొని కొత్త ఉద్యోగాలు కల్పించినట్టు ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కార్పొరేషన్‌లో చూపి 95,212 కొత్త ఉద్యోగాలను కల్పించినట్లు చూపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ కేవలం ఓట్ల కోసం వేసిన ఎర అని ఇప్పుడు అందరికీ అర్థమైంది.


గత రెండేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించకుండా రెండు లక్షలమందికి పైగా నిరుద్యోగ టీచర్లను రోడ్డున పడేసింది ఈ ప్రభుత్వం. జాబ్ క్యాలెండరులో బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను చూపలేదు. గత ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ, గ్రూప్–1 ఉద్యోగాలను తమ ప్రభుత్వమే ఇచ్చినట్లు చూపించారు. కేవలం రూ.5వేల గౌరవ వేతనంతో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన 2,59,565 వాలంటీరు ఉద్యోగాలు, ఏపీపీఎస్‌సీతో సంబంధం లేకుండా వైసీపీ నేతల సిఫార్సులతో అధికార పార్టీ వారికే ఇచ్చిన 1,21,518 గ్రామ సచివాలయ ఉద్యోగాలు... మొత్తం కలిపి 3,8౧,083 ఉద్యోగాలను గత రెండేళ్లలోనూ కల్పించినట్లు చూపి నిరుద్యోగులను దగా చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన 12వేల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల్లో గౌరవ వేతనంతో నియమించిన సుమారు 20వేల తాత్కాలిక ఉద్యోగాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా జాబ్ క్యాలెండరులో చూపడం నిరుద్యోగులను నిస్సిగ్గుగా దగా చెయ్యడమే. రేషన్ డోర్ డెలివరీ పేరుతో నిరుద్యోగులను మూటలు మోసే కూలీలుగా మార్చిన 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను (రేషన్ వాహనాల నిర్వాహకులను) కూడా ఈ జాబితాలో కలిపేశారంటే జాబ్ కాలెండరు పేరిట కనికట్టు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ఉన్న ఖాళీలలో 0.47శాతానికి మాత్రమే ఉద్యోగాలను ప్రకటించిన ఈ బోగ‌స్ జాబ్ క్యాలెండ‌ర్ ర‌ద్దు చేయాలి. 


వేల పోస్టులు ఖాళీలుండగా గ్రూప్‌ 1, 2లో కేవలం 36 పోస్టులను మాత్రమే జాబ్ క్యాలెండరులో పెట్టి నిరుద్యోగుల ఆశ‌లపై నీళ్ళు చల్లారు. 16వేల కంటే ఎక్కువ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీలుండగా, కేవలం 450 పోస్టుల‌ను ప్రకటించారు. జగన్ పాలనలో ఉద్యోగ కల్పన ఉత్త మాటల మాటగానే మిగిలిపోయింది. విద్యా శాఖలో 26వేల‌కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉండగా కేవ‌లం 2 వేల పోస్టులనే భ‌ర్తీ చేస్తామని ప్రకటించి శిక్షణ తీసుకున్న లక్షలాదిమందిని ఉసూరుమ‌నిపించారు. రెండేళ్ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువ‌త ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ రేటు 38శాతం ఉంద‌ని, దక్షిణాది రాష్ట్రాల‌లో ఇదే ఎక్కువ అని, దేశం మొత్తం మీద నిరుద్యోగ రేటులో ఏపీ నాలుగవ స్థానంలో ఉందని సీఎమ్ఐఈ సర్వే తేల్చి చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో నిరుద్యోగ రేటు 45శాతంగా నమోదు కావ‌డం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొందరు ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారు. కొవిడ్ కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వ అసమర్థ పాల‌న‌ మరింత పతనానికి నెట్టివేసింది. రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. పారిశ్రామిక వృద్ధిని నీరుగార్చి ప్రైవేటు రంగంలో ఉపాధికి గండికొట్టారు. 


లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకి భ‌రోసా ఇవ్వాలంటే, ఆందోళ‌న‌లు చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థుల‌కు న్యాయం జరగాలి అంటే- జగన్ ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్లును నెరవేర్చాలి: పాదయాత్రలో జగన్ వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండరును విడుదల చేయాలి. గ్రూప్ 1, 2 విభాగాల్లో రెండు వేల పోస్టుల‌తో జాబ్ క్యాలెండరును కొత్తగా విడుద‌ల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి 30 రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ విభాగాలలో 20వేల‌కు పైగా ఉన్న ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలి. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్‌సీ ద్వారా భ‌ర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌‍గ్రేషియాను చెల్లించాలి. తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో నిరుద్యోగుల‌కు ఇచ్చిన 2వేల రూపాయల నిరుద్యోగ భత్యాన్ని పున‌రుద్ధరించాలి. ఉత్తుత్తి జాబ్ క్యాలెండరు పేరుతో కోట్ల రూపాయ‌ల ప్రకటనలు గుప్పించడం ద్వారా నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదు. ఉద్యోగాల భ‌ర్తీ కోసం రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల న్యాయ‌మైన డిమాండ్లను 30 రోజుల్లోగా పరిష్కరించాలి. లేకుంటే వారి త‌ర‌ఫున‌ తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నది. 


అట్లాగే యువత కూడా మేలుకోవాలి. అడుగడుగునా వంచించే ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో యువత వివేకవంతం కాక తప్పదు. వాస్తవాలు తెలుసుకొని తమ సమస్యలు పరిష్కారం కొరకు సంఘటిత పోరాటం చేయాలి. యువతీ, యువకులు రాష్ట్రంలో నిర్ణాయక శక్తులుగా ఎదిగి తమ భవిష్యత్తుకి తామే మేలు బాటలు వేసుకోవాలి.


నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-07-09T06:20:01+05:30 IST