పెంపుడు జంతువులతోనూ వెకేషన్స్‌

ABN , First Publish Date - 2022-05-24T22:04:01+05:30 IST

పెంపుడు జంతువులతో చాలామంది విడదీయలేని బంధం ఏర్పరుచుకుంటున్నారు. ఒక్క క్షణమైనా వాటిని విడిచి ఉండలేని వారు ఎందరో.

పెంపుడు జంతువులతోనూ వెకేషన్స్‌

పెట్‌ ఫ్రెండ్లీగా మారుతున్న హోటల్స్‌

రైళ్లు, విమానాలలో ప్రత్యేక ఏర్పాట్లు


హైదరాబాద్‌సిటీ: పెంపుడు జంతువులతో చాలామంది విడదీయలేని బంధం ఏర్పరుచుకుంటున్నారు. ఒక్క క్షణమైనా వాటిని విడిచి ఉండలేని వారు ఎందరో. వేసవి సెలవుల్లో చాలామంది టూర్లకు ప్లాన్‌ చేస్తుంటారు. అలాంటి వారు పెంపుడు జంతువులను వెంట తీసుకువెళ్లలేక, బంధువులకు అప్పజెప్పలేక సతమతమవుతుంటారు. డాగ్‌ హాస్టల్స్‌లో ఉంచొచ్చు కానీ, తమ దగ్గరున్న సౌకర్యం అక్కడ వాటికి ఉండదని మథనపడే వారూ ఉన్నారు. ఇలాంటి వారు తమ సెలవులను రద్దు చేసుకోవడమో లేదంటే, ఎవరో ఒకరు ఇంట్లో ఉండిపోవడమే చేస్తున్నారు. కాస్త శోధించి చూస్తే పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లవచ్చంటున్నారు ట్రావెల్‌ ప్రేమికులు.  మన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల్లో పెట్స్‌ తీసుకువెళ్లడానికి ఒప్పుకోరు కానీ, కర్నాటక ఆర్టీసీ బస్సుల్లో అనుమతులున్నాయని చెబుతున్నారు. గోవా, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ లాంటి ప్రాంతాలలో కూడా పెట్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తున్నాయంటున్నారు. పెట్స్‌తో కలిసి వేసవిలో వెకేషన్స్‌కు ఎలా వెళ్లాలన్న అంశంపై పలువురు జంతు ప్రేమికులు ఇలా సూచిస్తున్నారు.


రైళ్లలో తీసుకువెళ్లవచ్చు

ఇండియన్‌ రైల్వే్‌సలో పెట్స్‌ను తీసుకెళ్లేందుకు కొన్ని సెక్షన్ల ప్రకారం సడలింపులిచ్చారు. భారతీయ రైల్వే చట్టం సెక్షన్‌ 77-ఏ ప్రకారం పెంపుడు జంతువులను అదనపు రుసుము చెల్లించి ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో నిబంధనలకనుగుణంగా తీసుకువెళ్లవచ్చు. సెకండ్‌ స్లీపర్‌ క్లాస్‌ లేదంటే 3 ఏసీలలో నిబంధనలు అనుమతించవు. ఆ సందర్భంలో పెంపుడు జంతువులను బోనులో పెట్టి బ్రేక్‌ వ్యాన్‌లో తరలించాల్సి ఉంటుంది.  


విమానాల్లోనూ ఏర్పాట్లున్నాయ్‌!

విమానాలలో పెట్స్‌ తీసుకువెళ్లవచ్చా అంటే నిరభ్యంతరంగా  తీసుకువెళ్లవచ్చు. కాకపోతే ఆ పెట్‌ విమానప్రయాణానికి తగిన ఫిట్‌నె్‌సతో ఉందని నిర్ధారించాలి. ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ లాంటివి అనుమతించినా, ఇండిగో వంటి ఎయిర్‌వేస్‌ మాత్రం వీటిని అనుమతించవు.


సదుపాయాల కోసం వెదకాల్సిందే

ఇటీవలి కాలంలో స్టార్‌ హోటల్స్‌ సైతం పెట్‌ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో నోవోటెల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంటివి పెట్స్‌ కోసం పిక్నిక్‌లను నిర్వహిస్తున్నారని పెట్‌ ప్రియులు పేర్కొంటున్నారు. హోటల్‌ను బుక్‌ చేసుకునే ముందు పెట్‌ ఫ్రెండ్లీ హోటల్స్‌ అని వెతకాలి. దీంతో ఇబ్బంది పడకుండా గది బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కష్టమేమో కానీ ప్రస్తుతం రిసార్ట్‌లు, హోటళ్లు, హోమ్‌ స్టేలు.. అన్నీ పెట్‌ ఫ్రెండ్లీగా మారాయి. హోటల్స్‌లో మీ పెట్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా లేదా దగ్గరలో ఏవైనా పార్కులు ఉన్నాయా అన్న విషయాలు చూసుకుంటే మీరు ఎంజాయ్‌ చేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ పెట్‌కు సైతం ప్రత్యేక వంటకాలు వడ్డించే హోటల్‌ అయితే మంచిది. గమనించాల్సి విషయం ఏమిటంటే... వెళ్లే ప్రతి ప్రదేశానికి పెట్‌ను అనుమతించరని గుర్తుంచుకోవాలి. 


Updated Date - 2022-05-24T22:04:01+05:30 IST