అభిస్కొవాక్‌.. వేరియంట్లన్నిటినీ ఎదుర్కొనే టీకా!

ABN , First Publish Date - 2022-02-07T08:36:40+05:30 IST

డెల్టా, డెల్టా ప్లస్‌, ఒమైక్రాన్‌.. కొవిడ్‌ ఉధృతి సద్దుమణిగిందని అనుకుంటున్న దశలో కొత్తగా ఇలాంటి వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేస్తున్నాయి. ..

అభిస్కొవాక్‌.. వేరియంట్లన్నిటినీ ఎదుర్కొనే టీకా!

 రూపొందించిన భారతీయ శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:  డెల్టా, డెల్టా ప్లస్‌, ఒమైక్రాన్‌.. కొవిడ్‌ ఉధృతి సద్దుమణిగిందని అనుకుంటున్న దశలో కొత్తగా ఇలాంటి వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. అవి నూతన వేరియంట్లను ఎంతవరకు ఎదుర్కొనగలవనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము రూపొందించిన ‘‘అభిస్కొవాక్‌’’ టీకా అన్ని వేరియంట్లను నిలువరిస్తుందని అంటున్నారు పశ్చిమబెంగాల్‌ అసన్‌సోల్‌లోని కాజీ నజ్రుల్‌ వర్సిటీ, ఒడిసా భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌) శాస్త్రవేత్తలు. ఇమ్యునో ఇన్ఫర్మేటిక్‌ పద్ధతులను ఉపయోగించి దీనిని డిజైన్‌ చేసినట్లు చెబుతున్నారు. కాగా, ఇది పెప్టైడ్‌ (ఎమైనో ఆమ్లాలున్న అణువు) వ్యాక్సిన్‌. చిమెరిక్‌ పెప్టైడ్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేసే అభిస్కొవాక్‌.. కొవిడ్‌ కుటుంబంలోని ఆరు వేరియంట్ల (హెచ్‌కొవ్‌-229ఈ, హెచ్‌కొవ్‌-హెచ్‌కేయూ1, హెచ్‌కొవ్‌- ఓసీ43, సార్స్‌-కొవ్‌, మెర్స్‌-కొవ్‌, సార్స్‌-కొవ్‌2)కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నారు. కంప్యూటేషనల్‌ పద్ధతులను ఉపయోగించి.. ఈ టీకాను అభివృద్ధి చేశామని, పరీక్షల అనంతరం ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తామని పరిశోఽధనలో పాల్గొన్న కాజీ నజ్రుల్‌ వర్సిటీకి చెందిన అభిజ్ఞాన్‌ చౌధురి వెల్లడించారు. కాగా, వీరి పరిశోధన వివరాలను ప్రచురించేందుకు మాలిక్యులర్‌ లిక్విడ్స్‌ జర్నల్స్‌ అంగీకరించింది. సాధారణ పరమాణు, సంక్లిష్ట ద్రవ నిర్మాణం-పరస్పర చర్యలు, గతిశీల ప్రక్రియలు, ప్రాథమిక అంశాలకు సంబంధించిన పరిశీలనలను ఈ జర్నల్‌ ప్రచురిస్తుంటుంది.

Updated Date - 2022-02-07T08:36:40+05:30 IST