10,93,334 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-01-18T05:05:24+05:30 IST

10,93,334 మందికి వ్యాక్సిన్‌

10,93,334 మందికి వ్యాక్సిన్‌
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో జిల్లాలో ఏడాది కాలంలో 10,93,334 మందికి టీకాలు వేశారు. 18ఏళ్లు పైబడిన వారిలో 7,13,986 మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వగా, వారిలో 3,61,627 మందికి రెండో ఇచ్చారు. 15-18ఏళ్ల వయసు వారిలో ఇప్పటి వరకు 15,355 మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. 60ఏళ్లు పైబడిరెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుని 9నెలలు పూర్తయిన వృద్ధుల కోసం నిర్వహిస్తున్న ప్రికాషనరీ(బూస్టర్‌) వ్యాక్సినేషన్‌లో భాగంగా 2,366 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఏడాది పూర్తయింది. జిల్లాలో 7,09,526 మందికి ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయాలనే లక్ష్యానికి మించి టీకాలు వేశారు. జిల్లాలో మొదటి డోస్‌ 103శాతం మందికి, రెండో డోస్‌ లక్ష్యంలో 51శాతం మందికి వేశారు.


  • టీనేజర్లలో వెనకడుగే..


రెండో డోస్‌, టీనేజర్ల వ్యాక్సినేషన్‌లో జిల్లా వెనకబడింది. రెండో డోస్‌ సంగం మందికే వేశారు. ఇంకా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వారు 68,161 మంది ఉన్నారు. మొదటి డోస్‌ టీకా తీసుకొని రెండో డోస్‌ తీసుకోని వారిని గుర్తించి వారందరికీ వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 నుంచి 18ఏళ్ల టీనేజర్లకు మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.  ఇప్పటి వరకు 15,355 మందికి టీకా వేశారు.


  • రెండో డోస్‌ లక్ష్యం పూర్తిచేయాలి


వికారాబాద్‌: రెండో డోస్‌ కరోనా వ్యాక్సిన్‌కు గడువు పూర్తయిన వారిని సబ్‌సెంటర్ల వారీగా గుర్తించి రెండు రోజుల్లో వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె క్యాంప్‌ కార్యాలయం నుంచి వ్యాక్సినేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రెండో డోస్‌కు అర్హులైన 68,161 మందిని సబ్‌ సెంటర్ల వారీగా ఏఎన్‌ఎం, ఆశా, సూపర్‌వైజర్ల సహకారంతో ఇంటింటికీ తిరిగి గుర్తించి రెండు రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలన్నారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ 51శాతం వేశామని, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో వెనుకబడి ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు. 15-18సంవత్సరాల పిల్లల్లో 31శాతం మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. 4,370మంది హెల్త్‌ వర్కర్లలో 1363మందికి, 5,796 ఫ్రంట్లైన్‌ వర్కర్లలో 423మందికి వ్యాక్సిన్‌ వేశామని కలెక్టర్‌ వివరించారు. అన్ని విభాగాల్లో మిగిలిన లక్ష్యాలను రెండు రోజుల్లో పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని నిఖిల ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌, ఉప వైద్యాధికారులు జీవరాజ్‌, ధరణికుమార్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:05:24+05:30 IST