వ్యాక్సిన్ వేసుకుంటే ఫేస్‌మాస్క్ అవసరం లేదు: అమెరికా

ABN , First Publish Date - 2021-03-09T08:56:46+05:30 IST

కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను తీసుకున్న అమెరికన్లు ఇండోర్ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్ ధరించకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా

వ్యాక్సిన్ వేసుకుంటే ఫేస్‌మాస్క్ అవసరం లేదు: అమెరికా

వాషింగ్టన్: కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను తీసుకున్న అమెరికన్లు ఇండోర్ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్ ధరించకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా సమావేశమవ్వచ్చని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాత్రం వ్యాక్సిన్ తీసుకున్నా సరే ఫేస్‌మాస్క్ తప్పక ధరించాలని సూచించింది. అమెరికా వ్యాప్తంగా కేవలం పది శాతం మందికే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని సీడీసీ డైరెక్టర్ రాషెల్ వాలెన్స్కీ తెలిపారు. ఇంకా 90 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. 


అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 9.2 శాతం మంది రెండు వ్యాక్సిన్ డోస్‌లను తీసుకున్నారు. దాదాపు 18 శాతం మంది ఒక డోస్ తీసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రెండు వ్యాక్సిన్ డోస్‌లు తీసుకున్న వారంతా ఇండోర్ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్ లేకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా చిన్న చిన్న సమూహాలుగా సమావేశమవ్వొచ్చని సీడీసీ చెబుతోంది. అమెరికా ప్రభుత్వం పైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను ప్రజలకు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 2,97,04,563 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి 5,37,976 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-03-09T08:56:46+05:30 IST