వ్యాక్సిన్‌ వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి

ABN , First Publish Date - 2021-01-25T08:16:59+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆశా వర్కర్‌ ఒకరు మరణించారు. గుంటూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

వ్యాక్సిన్‌ వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి

  • పక్షవాత లక్షణాలతో ఆస్పత్రికి... బ్రెయిన్‌స్టెమ్‌ స్ర్టోక్‌గా నిర్ధారణ 
  • టీకా వికటించడం వల్లే: కుటుంబ సభ్యులు
  • గుంటూరు జీజీహెచ్‌ వద్ద ఆందోళన 
  • ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం,
  • 50 లక్షల పరిహారం కోసం డిమాండ్‌ 


గుంటూరు(సంగడిగుంట)/గుంటూరు (మెడికల్‌), జనవరి 24: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆశా వర్కర్‌ ఒకరు మరణించారు. గుంటూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన ఆశా వర్కర్‌ బొక్కా విజయలక్ష్మి(45) మంగళగిరి సమీపంలోని నవులూరులో నివాసం ఉంటున్నారు. ఈ నెల 19న ఆమె తాడేపల్లి పీహెచ్‌సీలో 19న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 21న ఉదయం పక్షవాత లక్షణాలకు గురైన ఆమెను మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి, అనంతరం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్‌ స్టెమ్‌ స్ర్టోక్‌ (బీఎ్‌సఎ్‌స)గా నిర్ధారించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. చికిత్సకు ఏమాత్రం స్పందించని ఆమె ఆదివారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ప్రకటించారు. విజయలక్ష్మి వ్యాక్సిన్‌ వికటించడం వల్లనే మృతి చెందిందని, ఆమెకు ఇంతకుముందు ఎప్పుడూ అనారోగ్య లక్షణాలు లేవని మృతురాలి ఇద్దరు కుమారులు, భర్త సాంబశివరావు, బంధువులు ఆరోపించారు. మృతి కి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ తమకు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు.


 వీరికి సీఐటీయూ, పలువురు ఆశా వర్కర్లు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు నజీర్‌ అహ్మద్‌ తదితరులు మద్దతు తెలపడంతో జీజీహెచ్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బాధితులతో జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ చర్చించి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి నిర్మాణానికి అంగీకరించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా కారణంగా మృతిచెందితే ఇస్తామన్న రూ.50లక్షల బీమా సదుపాయం వర్తించేలా ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కాగా, తమకు ఎటువంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించకుండానే వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందేనని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని జీజీహెచ్‌ వద్ద పలువురు ఆశా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అనంతరం వివిధ కారణాలతో జీజీహెచ్‌లో చేరి చికిత్స తీసుకున్న 13మంది ఆరోగ్యంగా ఉన్నారు. విజయలక్ష్మి మృతితో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో కలకలం రేగింది. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ గీతా ప్రసాదిని అధ్యక్షతన ఆదివారం గుంటూరు ప్రభుత్వాస్పత్రి నాట్కో సెంటర్‌లో అడ్వర్స్‌ ఈవెంట్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌ (ఏఈఎ్‌ఫఐ) రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత లక్ష మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని, విజయలక్ష్మిది కూడా ఆ తరహా మరణం కావచ్చని కమిటీ అభిప్రాయపడింది.

Updated Date - 2021-01-25T08:16:59+05:30 IST