డబ్బులిస్తే టీకా, పైరవీ చేస్తే టెస్టు

May 9 2021 @ 00:10AM
కంది పీహెచ్‌సీలో టీకా వేసుకోవడానికి వచ్చి వెళ్లిపోతున్న ఇతర ప్రాంతాల వారు


ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి, మే 8 :  ఓవైపు కొవిడ్‌ టెస్టులు, టీకాలను నియంత్రిస్తుండగా కొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు నచ్చినవారికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి రోజుకు 25 కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లు ఇస్తుండగా, కొందరు అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే టెస్టులు చేస్తున్నారు. వారి సిఫారసులతో వచ్చిన వారికే టీకా వేస్తున్నారు. లేదంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నది. టీకా రెండో డోసు వేసుకోవడానికీ ఇదే పరిస్థితి. టీకా లభ్యత లేకపోవడం, డిమాండ్‌ పెరగడంతో హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం సంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాలకు వస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులతో పైరవీ చేయించుకుని టీకా వేయించుకుంటున్నారు. మండల కేంద్రమైన కంది పీహెచ్‌సీలో శనివారం టీకా, టెస్టుల కోసం హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు రావడం కనిపించింది. స్థానిక అధికార పార్టీ నాయకుడొకరు వీరి నుంచి డబ్బు తీసుకుని టీకా వేయించారు. అవసరమైన వారికి కొవిడ్‌ టెస్టు చేయించారు. సరిగ్గా అదే ప్రాంతానికి పలు పత్రికల విలేకరులు వెళ్లడంతో సదరు నాయకుడితో సహా, టీకా కోసం వచ్చిన వారు పరుగులు తీశారు. ఈ వ్యవహారం అంటీముట్టని సిబ్బందిని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.


Follow Us on: