టీకా కాలం

ABN , First Publish Date - 2020-12-11T06:07:53+05:30 IST

వ్యాధిగురించి కాక, చికిత్స నివారణల గురించి తరచు మాట్లాడుకుంటున్నామంటే పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని ఆశపడవచ్చును....

టీకా కాలం

వ్యాధిగురించి కాక, చికిత్స నివారణల గురించి తరచు మాట్లాడుకుంటున్నామంటే పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని ఆశపడవచ్చును. పదకొండు నెలల కిందట, ఒక పొరుగుదేశంలో పుట్టిన సమస్యగా పరిచయమై, అతి వేగంగా దేశసమస్యగా కూడా మారి, జనజీవితాన్నే స్తంభింపజేసిన పెనువిపత్తుగా పరిణమించి, కోటిమందికి సోకి, లక్షన్నర మందిని పొట్టన బెట్టుకున్న కొవిడ్–19, ఇప్పుడు వెనుకపట్టు పట్టినట్టే కనిపిస్తోంది. తిరగబెట్టే ప్రమాదం తొలగిపోలేదు, జనం ఇంకా జాగ్రత్తగానే మెలగవలసి వస్తోంది. సమ్మర్దం, సమూహం ఉండే చోట్లు ఇంకా మునుపటి వలె సందడిగా ఉండడం లేదు. వ్యాధి పతాకదశను దాటేసిందని చెబుతున్న గణాంకాలకు తోడు, టీకాలు శీఘ్రంగా సిద్ధమవుతున్నాయని వస్తున్న వార్తలు ఉత్సాహం, ఆశ కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా జీవసాంకేతిక సంస్థలు టీకాలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో మూడు తుది పరీక్షల దశకు చేరుకుని, త్వరలో లక్షిత జనసమూహాలకు చేరబోతున్నాయి. కొవిడ్ నిరోధక టీకాలు వేయడం మానవ చరిత్రలోనే మునుపెన్నడూ జరగనంత భారీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా అనేక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. 


హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవాక్సిన్ టీకా ప్రయోగాల మూడో దశలో ఉన్నది. ఈ దశలో 26 వేల మందిపై ఔషధాన్ని పరీక్షిస్తారు. పరీక్షలను దాటుకుని, విజయవంతమయ్యే టీకా కావచ్చునని భావిస్తున్న కోవాక్సిన్ తయారీ కేంద్రాన్ని, టీకాల ఉత్పత్తిలో పేరెన్నిక గన్న హైదరాబాద్‌లోని మరో సుప్రసిద్ధ జీవసాంకేతిక కంపెనీ బయొలాజికల్ ఇవాన్స్‌ను 64 దేశాల రాయబారులు బుధవారం నాడు సందర్శించారు. ప్రపంచంలో టీకామందుల్లో మూడింట ఒకవంతు ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరగడం విశేషం. పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్ సహకారంతో టీకా ప్రయోగంలో పాలుపంచుకుంటోంది. అమెరికన్ కంపెనీ ఫైజర్ రూపొందిస్తున్న టీకా కూడా త్వరితగతిన సిద్ధపడుతోంది. ఒక పక్కన ఈ మూడు టీకాలకు సంబంధించి సానుకూల సమాచారం వస్తూనే ఉండగా, అనేక సందేహాలు, ప్రతికూల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఫైజర్ వారి టీకామందు వేయడం ఇంగ్లండ్‌లో రెండు రోజుల కిందట 90 సంవత్సరాల మహిళతో ప్రారంభించారు. అంతర్జాతీయంగా టీకా వినియోగం దానితో ప్రారంభమైనట్టే. ఫైజర్ వారి టీకా అలర్జీలు కలిగిస్తుందని వార్తలు వస్తున్నాయి. భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా తీసుకున్న హర్యానా మంత్రికి కొద్దిరోజులకే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనం కలిగించింది. రెండు డోసులు వేసుకుంటేనే రక్షణ ఉంటుందని, ప్రయోగాలలో పాల్గొన్నవారందరికీ మందు వేయరని, కొందరికి మందులేని ద్రవాన్ని మాత్రమే వేస్తారని కంపెనీ వివరణ ఇచ్చింది. కానీ, మందు భద్రతపై సందేహాలు తొందరగా చెదిరిపోవు. పైగా, మందు తీసుకున్న తరువాత కొద్దిసేపు వైద్యకేంద్రం దగ్గరే నిరీక్షించాలని, ఏ సమస్యా లేకపోతేనే ఇంటికి వెళ్లాలని నిపుణులు చెబుతున్న మాటలు ఎంత కాదన్నా భయం కలిగిస్తాయి. మందు వినియోగించడం మొదలై కొన్ని రోజులు గడిస్తే తప్ప, ధీమా ఏర్పడదు. 


టీకా ఉత్పత్తి గురించి ప్రధానమంత్రి స్వయంగా పట్టించుకోవడం ప్రజలకు ధైర్యాన్నిచ్చే చర్య. ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించడం, పంపిణీ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించడం అభినందనీయాలు. అయితే, టీకా ద్వారా రాజకీయ ప్రయోజనాన్ని కూడా పొందాలని నాయకులు చూడడం వాంఛనీయం కాదు. ఆగస్టు 15 లోగా టీకా సిద్ధం కావాలని కంపెనీలకు హుకుం జారీచేసిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. దానిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, ఇంకా అన్ని నిర్ధారణలూ జరగకముందే డిసెంబర్ 25 అన్న తేదీని ప్రకటించారు. కానీ, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్‌ ఆఫ్ ఇండియా అనుమతి ఇంకా లభించలేదు. ఆ కంపెనీలు తమ తమ టీకాలకు సంబంధించిన ప్రయోగాల సమాచారాన్ని పూర్తిగా సమర్పించలేదని తెలుస్తోంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ టీకా ప్రయోగంలో పాల్గొన్న ఒక చెన్నై వ్యక్తి, తనకు కలిగిన ఆరోగ్య ప్రతిచర్యకు టీకాయే కారణమని కోర్టుకు ఎక్కాడు. దాని గురించిన పూర్తి వివరణలు కూడా డ్రగ్ కంట్రోలర్‌కు అందలేదు. వేగవంతంగా టీకా అందుబాటులోకి రావడం మంచిదే. కానీ, అదే సమయంలో భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. వ్యాధి కంటె ఔషధం ప్రమాదకారి కాగూడదు.


తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ చెబుతున్న వివరాలను బట్టి, టీకాల పంపిణీకి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైనట్టే ఉన్నది. మొదటి దశలో టీకా అందవలసిన 80 లక్షల మందికి సంబంధించిన స్పష్టత ఇప్పటికే ఏర్పడింది. కొవిడ్‌తో పోరాడిన అగ్రశ్రేణి సిబ్బందితోపాటు, 60 ఏళ్లకు పైబడినవారిని, 50-–60 ఏళ్ల మధ్య వయస్సు వారిని, అంతకంటె తక్కువ వయస్సున్నవారిలో దీర్ఘవ్యాధులున్నవారిని మొదటిదశ టీకా వినియోగానికి ఎంచుకోవడం అభినందనీయం. ఔషధం నిల్వలో, రవాణాలో, ప్రతిక్రియల పర్యవేక్షణలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. అట్లాగే, అవసరమున్నవారికి అందరికీ లభించేలా, పక్షపాతానికి తావులేనట్టుగా పంపిణీ జరగడం కూడా అవసరం.

Updated Date - 2020-12-11T06:07:53+05:30 IST