వచ్చేది అరకొర... సిఫార్సులతో విలవిల

ABN , First Publish Date - 2021-05-07T05:45:29+05:30 IST

కరోనా రాకుండా వ్యాక్సిన్‌ వేయించుకుందామని వెళితే అదే కరోనా బారినపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయా!

వచ్చేది అరకొర... సిఫార్సులతో విలవిల
వినుకొండలో వ్యాక్సిన్‌ కోసం పోటీ పడుతున్న ప్రజలు

వ్యాక్సిన్‌ కేంద్రాల దగ్గర బారులుతీరి...

సామాజిక దూరం అసలే లేదు

కరోనా సోకే ప్రమాదాలూ పొంచే ఉన్నాయ్‌

కట్టదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు


గుంటూరు, తెనాలి, నరసరావుపేట, వంటి నగరాలు, పట్టణాల్లో రెండో దశ వ్యాక్సిన్‌ 2.5 లక్షల వరకు అవసరం ఉంటే, తాజాగా అందింది మాత్రం 68వేల డోసులు మాత్రమే. తెనాలి, నరసరావుపేట వంటివాటికైతే 40వేల వరకు అవసరమైతే కేవలం 11వేల నుంచి 14వేల లోపే వ్యాక్సిన్‌ డోసులు అందాయి. అయితే వీటిలోనూ సిఫార్సులు ఎక్కువైపోయాయి. ఉదాహరణకు తెనాలి పట్టణానికి రెండో దశ వ్యాక్సిన్‌ వారికి 38,000 డోస్‌లు అవసరమైతే కేవలం 11,000 డోస్‌లు మాత్రం అందాయి.

 

తెనాలి, మే6(ఆంధ్రజ్యోతి): కరోనా రాకుండా వ్యాక్సిన్‌ వేయించుకుందామని వెళితే అదే కరోనా బారినపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయా! అవసరానికి మించి వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవటం, స్థాయికి మించి జనం రావటం, కేంద్రాలు తక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. జిల్లాలో వ్యాక్సిన్‌ కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక వైల్‌ పదిమందికి సరిపోతుందనుకుంటే, అక్కడ వందమంది ఉంటున్నారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ ఎవరికివారే ముందు తామే వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే తపనతో చివరకు గుంపులో తెలియకుండానే పాజిటివ్‌ బాధితులుంటే వారినుంచి మిగిలిన వారికి కరోనా సోకుతోంది.


డిమాండ్‌ కంటే తక్కువగా..

సాధారణంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. లేదంటే ఆధార్‌కార్డు తీసుకువెళ్లి స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అయితే ఇక్కడే కనిపించని కష్టాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం అవసరం ఉన్నదానికంటే తక్కువగా వ్యాక్సిన్‌ రావటం ప్రధాన కారణమైతే, పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో భయంతో వ్యాక్సిన్‌కోసం క్యూలు కడుతున్నవారూ పెరిగిపోయారు. రెండో డోస్‌ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా, వారికీ సరిగా అందని పరిస్థితి. దీంతో గడువు దాటిపోతుందన్న భయంతో నిత్యం వ్యాక్సిన్‌ కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్న పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడా సిఫార్సులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రాల దగ్గర రద్దీ పెరిగిపోతోంది.  


వ్యాక్సిన్‌ కోసం పైరవీలు..

 వీటిలో రాజకీయ, అధికారిక పలుకుబడితో వైల్స్‌ దాచేస్తున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇవిపోతే, మిగిలిన వాటిలో బ్యాంకర్‌లు, కోర్టుల సిబ్బంది, రెవెన్యూ వంటి శాఖల సిఫార్సులతో వీటిలో సగం మొదటి డోస్‌కు వెళ్లిపోతుంటే, మిగిలిన వాటిలో రెండో డోస్‌ వారికి అందడం లేదు. దీంతో కొన్ని వ్యాక్సిన్‌ కేంద్రాల దగ్గర గొడవలు కూడా జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌కోసం తిరిగితిరిగి వేసారినవారు ఏఎన్‌ఎంలపై ఘర్షణకు దిగుతున్న పరిస్థితిఉంది. తెనాలి, రేపల్లె, బాపట్ల, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల, మరికొన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఈ తరహా గొడవలు పదేపదే బయటకు వస్తూనే ఉన్నాయి.ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నాక వారికి ఏ వ్యాక్సిన్‌ కేంద్రంలో వేయించుకోవాలనే వివరాలు ఇవ్వటం, అవసరం ఉన్నంత వ్యాక్సిన్‌ సరఫరా చేయలేని పక్షంలో ఉన్న వ్యాక్సిన్‌ను ఎంతమందికి సరిపోతుందనే అంచనాతో సీరియల్‌ ప్రకారం ఎవరెవరు కేంద్రాలకు వెళ్లాలనే విధంగా సంక్షిప్త సందేశాలు ఇవ్వగలిగితే కొంతవరకు వత్తిడి తగ్గుతుంది. 


  జిల్లాలో పరిస్థితి ఇలా.. 

  చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. కొన్ని ఆరోగ్య కేంద్రాలలో 100 మందికి వేసేందుకు టీకా డోసులు అందుబాటులో ఉంటే 60మందికి స్లిప్పులు ఇచ్చి  ఆరోజు వ్యాక్సిన్‌లు అయిపోయానని చెప్పి వెనక్కు పంపుతున్నారు. సిఫార్సులు ఉన్న వారికి వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ఆరోగ్యకేంద్రాలలో సిబ్బందికి, ప్రజలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాచర్ల నియోజకవర్గ పరిధిలో కారంపూడి మండలంలో మినహా వ్యాక్సిన్‌ నిల్వలు లేవు. మొదటి డోస్‌ వేయించుకున్న వారు సెకండ్‌ డోస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో రెండో డోస్‌ వారికి అంతంతమాత్రంగానే అందుతోంది.  దీంతో తమదాకా వస్తాయో లేదోనని స్థానిక ప్రజా ప్రతినిధులు, అఽధికార పార్టీ నాయకులతో సిఫార్సు చేయించుకుంటున్నారు.  పెదకాకాని, చేబ్రోలు, పొన్నూరు మండలాల్లో వైద్యాధికారుల గణాంకాల ప్రకారం  20వేల మంది వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సివుంది. రెండవడోస్‌ కింద 10 వేలమంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సి వుంది.  రానురాను వ్యాక్సిన్‌ కొరత పెరిగింది. వినుకొండ పట్టణంతో పాటు 5 మండలాల్లో 2వ విడత వ్యాక్సిన్‌ 16,889 మందికి వేయాల్సి ఉండగా కేవలం 1,577మందికి మాత్రమే వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-07T05:45:29+05:30 IST