మెదక్ జిల్లాలో వ్యాక్సినేషన్‌ 40 మందికి

ABN , First Publish Date - 2021-01-17T06:20:41+05:30 IST

ఏడాది కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైర్‌సకు విరుగుడు మందు పంపిణీ ప్రక్రియ జిల్లాలో విజయవంతమైంది. వేయి కళ్లతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సినేషన్‌ శనివారం మెదక్‌ జిల్లాలో సాఫీగా ప్రారంభమైంది. మెదక్‌, నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు.

మెదక్ జిల్లాలో వ్యాక్సినేషన్‌ 40 మందికి

తొలిరోజు మెదక్‌, నర్సాపూర్‌ ఆస్పత్రుల్లో ప్రారంభం

మొదటి టీకా వేయించుకున్న డీఎంహెచ్‌వో

రేపటి నుంచి 24 చోట్ల టీకా పంపిణీ


ఏడాది కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైర్‌సకు విరుగుడు మందు పంపిణీ ప్రక్రియ జిల్లాలో విజయవంతమైంది. వేయి కళ్లతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సినేషన్‌ శనివారం మెదక్‌ జిల్లాలో సాఫీగా ప్రారంభమైంది. మెదక్‌, నర్సాపూర్‌ ప్రభుత్వ  ఆసుపత్రుల్లో ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ రాకపోవడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. 

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌/మెదక్‌ అర్బన్‌/ నర్సాపూర్‌, జనవరి 16


తేడాది మార్చిలో కరోనా పాజిటివ్‌ తొలి కేసు మెదక్‌ పట్టణంలో నమోదైంది. నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు వేల మందికిపైగా కొవిడ్‌-19 బారిన పడగా 38 మందిని మహమ్మారి బలితీసుకున్నది. సుమారు రెండు నెలల పాటు లాక్‌డౌన్‌, ఆతర్వాత మినహాయింపులతో క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నా.. వైరస్‌ ముప్పు మాత్రం పూర్తిస్థాయులో తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో కరోనా నిరోధక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. తొలి విడతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అందజేస్తున్నారు. జిల్లాలో 4,221 మందిని తొలివిడత టీకా తీసుకునేందుకు ఎంపిక చేయగా.. మొదటిరోజు 60 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే డ్రైరన్‌ విజయవంతం కాగా.. శనివారం మెదక్‌, నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పంపిణీ ప్రారంభమైంది. మెదక్‌లోని జిల్లా ఆసుపత్రిలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హేమలత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 10:30 నిమిషాలకు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో భద్రపరిచిన టీకాను కోల్డ్‌ స్టోరేజ్‌ నుంచి జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక గదికి తరలించారు. ఉదయం 11:29 నిమిషాలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో తొలి టీకాను డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, నర్సాపూర్‌లో వైద్యుడు గురి కృష్ణ తీసుకున్నారు. మొదటి రోజు రెండు కేంద్రాల్లో 30 మంది చొప్పున 60 మందికి టీకా తీసుకునేందుకు ఎంపిక చేయగా.. మెదక్‌లో 22 మంది, నర్సాపూర్‌లో 18 మందికి వేశారు. టీకా తీసుకున్న వారిని గంటసేపు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాతే ఆస్పత్రి బయటకు పంపించారు. జిల్లాలో వ్యాక్సిన్‌ తీసుకున్న 40 మందిలో ఎవరికీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు తలెత్తలేదు. 20 మంది టీకాకు దూరంగా ఉన్నారు. కోవిషీల్డ్‌ తొలి టీకా తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ఈనెల 18 నుంచి 22 వరకు జిల్లాలోని నాలుగు వైద్య విధాన పరిషత్‌, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ప్రాధాన్య క్రమంలో అందరికీ టీకా

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత మాట్లాడుతూ వ్యాక్సిన్‌ రూపొందించి సమాజానికి అందించిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఈ టీకాను ప్రాధాన్య క్రమంలో అందరికీ వేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు ముందుండి ప్రాణాలను ఫణంగా పెట్టి సైనికులుగా పోరాడారని వారి సేవలు మరువలేనివన్నారు. సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ ప్రకటించి ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం, మాస్కులు, శానిటైజర్లులతోపాటు పేదల ఇబ్బందుల పడకుండా బియ్యం, పప్పు, రూ.1500 నగదుతో ఆదుకున్నారని గుర్తు చేశారు. కరోనా అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేసి ఏడాదిలోపే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్షారెడ్డి మాట్లాడుతూ  దేశ ప్రజలు గర్వించే ఈ రోజు చరిత్రలో నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యారెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, డీపీవో తరుణ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఎస్పీ కృష్ణమూర్తి, డిప్యుటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయనిర్మల, నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మిర్జాబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.


కొవిషీల్డ్‌ టీకా సురక్షితం

కొవిషీల్డ్‌ టీకా సురక్షతమైనదని టీకా తీసుకున్న వైద్య సిబ్బంది రుజువు చేశారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దు. టీకాతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు. భయపడకుండా టీకాను తీసుకోవాలి. ఈనెల 18 నుంచి 24 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇస్తారు. రోజు ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున టీకా వేస్తాం. తొలి విడతలో మొత్తం 3,284 మందికి వ్యాక్సినేషన్‌ వేయనున్నాం. ఆ తర్వాత ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తాం. జిల్లాలో మొత్తం 50 ఏళ్లుపైబడినవారు దాదాపు లక్షా 50 వేల మంది వరకు ఉంటారని వారికి మూడో దశలో టీకాలు వేస్తాం. మొదటి డోస్‌ తీసుకున్న వారు 28 రోజుల తరువాత  ఇదే కేంద్రంలో రెండో డోస్‌ తీసుకోవాలి. 

- డా.వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి 


మొదటి టీకా తీసుకోవడం సంతోషం 

నర్సాపూర్‌ ఆసుపత్రిలో మొదటగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. టీకా తీసుకునే సమయంలో ఏమి భయం అనిపించలేదు. ఓ డాక్టర్‌గా తానే ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటగా తీసుకోవడానికి ఆసక్తి చూపాను. టీకాతో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు.

- డాక్టర్‌ గురి కృష్ణ, ఆర్థోపెడిషియన్‌, నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రి


Updated Date - 2021-01-17T06:20:41+05:30 IST