ఔషధం, విచికిత్స

ABN , First Publish Date - 2021-01-05T05:45:23+05:30 IST

దాదాపు ఏడాదిగా ఆవరించిన చీకటి ఎంత తొందరగా తొలగిపోతుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. ఈ ఉపద్రవం దేవుని ఆగ్రహమా, దెయ్యపు ప్రసాదమా తెలియదు కానీ, నిష్కృతి మాత్రం మనిషి నుంచి రావలసిందే....

ఔషధం, విచికిత్స

దాదాపు ఏడాదిగా ఆవరించిన చీకటి ఎంత తొందరగా తొలగిపోతుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. ఈ ఉపద్రవం దేవుని ఆగ్రహమా, దెయ్యపు ప్రసాదమా తెలియదు కానీ, నిష్కృతి మాత్రం మనిషి నుంచి రావలసిందే. ప్రకృతిసూత్రాలను అర్థం చేసుకుని, సృష్టి రహస్యాలను ఛేదిస్తున్న మానవ మేధ, కొవిడ్ 19కు అతి త్వరలోనే విరుగుడు కనుగొన్నది. అనేక ప్రయోగాలు ఏకకాలంలో వివిధ దేశాలలో జరుగుతున్నాయి. అందులో మూడు రకాల టీకాలు తుది దశకు చేరుకుని, ఆశ కలిగిస్తున్నాయి.


ఈ మూడింటిలో రెండు– కొవిషీల్డ్ (ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించినది, పూణే సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్పత్తి జరిగేది), కొవాగ్జిన్ (హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ దేశీయ ఆవిష్కరణ, ఉత్పాదన)–అత్యవసర, పరిమిత వినియోగానికిగాను, భారత ఔషధ నియంత్రణ డైరెక్టర్ అనుమతిని పొందాయి. ఈ రెంటిలోనూ ప్రధానంగా కొవిషీల్డ్ వినియోగమే అధికంగా ఉంటుందని, దానికి అనుబంధంగా, అత్యవసర వినియోగం కోసం కొవాగ్జిన్ ఉపయోగిస్తారని కొందరు అధికారులు సూచించారు కానీ, వినియోగ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు ఇంకా ప్రకటితం కాలేదు. ఈ లోగా, ఈ టీకాలకు అనుమతులు ఇవ్వడంపై వివాదం మొదలయి, శాస్త్ర పరిశోధనారంగంలోను, రాజకీయరంగంలోనూ కూడా కలకలం రేపుతోంది. 


ఇటువంటి ఉత్పాత పరిస్థితులలో, లభించే పరిష్కారం స్వదేశీయా, విదేశీయా అని చూడనక్కరలేదు. ఇది విశ్వవిపత్తు అయినట్టే, దీనికి చికిత్స కూడా మానవాళి సమష్టి హక్కు. ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవలసింది, చికిత్స ఎంత వరకు సురక్షితం, ఎంత వరకు సమర్థం అని మాత్రమే. ఎన్నో వైరస్ జబ్బులు వచ్చాయి, పోయాయి కానీ, కరోనా ప్రత్యేకత వేరు. మొట్టమొదటి సారిగా ఒక ప్రపంచస్థాయి సాంక్రమిక వ్యాధిగా, ఆరోగ్యవిపత్తుగా కొవిడ్ 19 పరిణమించింది. ప్రపంచాన్నంతా ఆవరించిన జబ్బు ఇంతకుముందు ఏదీ మనకు తెలిసి రాలేదు. దీనికి విరుగుడుగా వేయవలసిన టీకాను కూడా ఒక నిర్ణీత కాలక్రమణికకు లోబడి వెంటనే ప్రపంచమంతా వేయవలసి ఉంటుంది. ఇంత పెద్ద సార్వజనీన టీకా కార్యక్రమం ఎప్పుడూ అమలుజరిపింది లేదు. టీకాలను సార్వజనీనంగా ఉపయోగించేముందు రకరకాల దశలలో పరీక్షిస్తారు. మానవులపై పరీక్షించే ముందు జంతువులపై ప్రయోగించి చూస్తారు. ఈ ప్రయోగాలలో గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని టీకామందును మరింత దృఢం, సమర్థం, లోపరహితం చేస్తారు.


ఈ ప్రయోగాలకు సంబంధించిన సమస్త సమాచారం పరిశోధకులకు, వైద్యరంగ నిపుణులకు అందుబాటులో ఉండాలి. చివరగా, కీలకమయిన గణాంకాలు, మానవప్రయోగానికి తగినదని భావించడానికి సమర్థనగా ఉన్న సమాచారం అంతా ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా అందించాలి. ఈ పద్ధతులన్నిటి లక్ష్యం మనుషుల భద్రత. కరోనా విషయంలో కూడా ఈ భద్రత అంశాన్ని ముఖ్యంగా పరిగణించాలి. ఎంత విస్తృతంగా పరీక్షలు జరిపినా, మందు వేర్వేరు శ్రేణులలో వేరువేరుగా ప్రభావం చూపవచ్చు, కొందరిలో ఊహించని ప్రభావాలూ కలగవచ్చు. అన్నిటికి తగిన ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరం.


కొవిషీల్డ్, కొవాగ్జిన్- ఈ రెంటికీ అంతిమ అనుమతులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొవిషీల్డ్ మొదటి రెండు దశలకు చెందిన ప్రయోగాల సమాచారం అందించింది కానీ, అందులో ట్రయల్స్‌లో పాల్గొన్నవారు భారతీయులు కారు. భారతదేశంలోని 17 పట్టణాలలో 1600 మంది వలంటీర్లపై చేసిన పరీక్షల సమాచారం ఆక్స్‌ఫర్డ్/సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వారు సమర్పించలేదు. అట్లాగే, కొవాగ్జిన్ మూడోదశ ప్రయోగాలు ఇంకా సాగుతున్నాయి. మూడోదశలో భారత్ బయోటెక్ 26,500 మందిపై మనదేశంలో ప్రయోగాలు జరుపుతున్నది. ఈ సంస్థలు అంతిమ దశ ప్రయోగాలను పూర్తిచేయకుండా, నేరుగా అత్యవసర వినియోగానికి టీకాలు ఎలా వేస్తాయి? మూడుదశల ప్రయోగాలలో మూడోదశే ముఖ్యమయినది. టీకాకు మనుషుల స్పందనలను మరింత సూక్ష్మంగా పరీక్షించే దశ ఇది. ఈ దశ ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలియకుండా మందును సార్వజనీన వినియోగానికి ఎట్లా అనుమతిస్తారన్నది ప్రశ్న. అంతే కాదు, ఆదివారం నాడు ఔషధ నియంత్రణ ఉన్నతాధికారి చేసిన ప్రకటనలో, ఈ రెండు టీకాలను అత్యవసర ప్రాతిపదిక మీద, క్లినికల్ ట్రయల్స్ తరహాలో వినియోగానికి అనుమతిస్తున్నట్టు చెప్పడం శాస్త్రవేత్తలలో విస్మయం కలిగించింది. ఇప్పటిదాకా వివిధ దశల ట్రయల్స్‌ను ఆయా సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే నిర్వహిస్తున్నాయి కదా, తిరిగి ట్రయల్స్ తరహాలో వినియోగం అంటారేమిటి? ఇంతకీ ఈ అనుమతులు సాధారణ వినియోగానికి కాదా, మళ్లీ పరీక్షల వరకేనా?


ఈ సందేహాలను నివృత్తి చేయడం ఆయా సంస్థల బాధ్యత. ప్రశ్నలు అడిగితే, దేశభక్తి లేదా, విజయం సాధిస్తే గుర్తించలేరా, వంటి ఉద్వేగపు ఒత్తిడులు తీసుకురావడం మంచిది కాదు. ఒక శాస్త్రవేత్త అన్నట్టు, అంతిమంగా భారత్ బయోటెక్ ఔషధమే ప్రభావశాలిగా నిరూపితం కావచ్చు. కొత్త రకం కరోనాను కూడా అది కట్టడి చేయవచ్చు. అదంతా క్షేత్రంలో తేలే విషయం. అధికారులే అసంబద్ధపు ప్రకటనలు చేసి, అనవసరపు భయాలు పెంచుతున్నారు. 


టీకాల అంశాన్ని రాజకీయ వివాదంగా మలచడం మంచిది కాదు. కానీ, టీకా ఆవిష్కరణను, పంపిణీని ఒక ప్రచార విన్యాసంగా కూడా ప్రభుత్వం భావిస్తున్నదా అని అనుమానం కలుగుతున్నది. టీకా ఆవిష్కరణకు మొదట ఆగస్టు 15, తరువాత డిసెంబర్ 25 గడువులను ఏకపక్షంగా ప్రకటించడం, బిహార్ ఎన్నికలలో, చివరకు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఉచిత టీకాను ఒక అంశంగా చేయడం-, ప్రభుత్వం తీరును వివాదాస్పదం చేస్తున్నాయి. ఇప్పుడు మూడోదశ ముగియకుండానే ఔషధ వినియోగానికి అనుమతులు ఇవ్వడం ఎందుకు? మరొక్క వారం పదిరోజులు ఆగితే, తక్కిన లాంఛనాలు కూడా పూర్తి అయ్యేవి. టీకా పంపిణీ విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం కావాలి. ఇటువంటి వివాదాలు, టీకాపై భయాలను పెంచుతాయి తప్ప, తగ్గించవు.

Updated Date - 2021-01-05T05:45:23+05:30 IST