టీకా వరం

ABN , First Publish Date - 2020-10-24T05:59:22+05:30 IST

ఆత్రుత అతిశయిస్తే, ఇక విచక్షణ ఉండదట. ప్రయోజనం నెరవేరడం అత్యవసరం అనుకున్నప్పుడు గమ్యానికి చేరడం ముఖ్యం తప్ప...

టీకా వరం

ఆత్రుత అతిశయిస్తే, ఇక విచక్షణ ఉండదట. ప్రయోజనం నెరవేరడం అత్యవసరం అనుకున్నప్పుడు గమ్యానికి చేరడం ముఖ్యం తప్ప, అనుసరించే మార్గం మంచిచెడ్డలు లెక్కలోకి రావు. సామాన్యమానవుల ప్రవృత్తి గురించిన చర్చ కాదిది, ఒక ఘనత వహించిన జాతీయపార్టీ, కేంద్రంలో వరుసగా రెండో దఫాలో అధికారంలో ఉన్న పార్టీ, రాజకీయాలలో పద్ధతులూ సంప్రదాయాలూ పాటించాలని చెప్పే పెద్దల నాయకత్వంలో ఒకప్పుడు గౌరవం పొందిన పార్టీ– ఒక రాష్ట్రంలో అధికారం కోసం ఇంత తక్కువ రకంగా ప్రవర్తించవచ్చునా? ఈ ప్రశ్న ఆ పార్టీ అభిమానులను, ఈ దేశం భవితవ్యం ఏమి కానున్నదో అని ఆందోళన పడుతున్న దేశభక్తులందరినీ వేధిస్తున్నది. ప్రపంచానికంతటికీ మహమ్మారియై ఎనిమిది నెలల నుంచి వేధిస్తున్న ప్రాణాంతక వైరస్‌కు లభించబోయే వైద్యపరిష్కారాన్ని ఓటర్లకు ఒక తాయిలం లాగా భారతీయ జనతాపార్టీ ఇవ్వజూపింది. కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం నాడు బిహార్‌ వెళ్లి, పార్టీ మేనిఫెస్టోను పరిచయం చేస్తూ, కొవిడ్‌–19కు టీకాలను బిహార్‌ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని చెప్పారు.


దేశమంతా బిత్తరపోయింది. బహుశా ప్రపంచం అంతా కూడా ఎంతో కొంత ఆశ్చర్యపోయి ఉంటుంది. ఉచిత టీకా వాగ్దానం గురించి వినగానే, అనేక ప్రశ్నలు ముందుకు రావడం సహజం. బిజెపి కూటమికి ఓటు వేస్తేనే బిహార్‌ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ అందిస్తారా? మరి తక్కిన దేశంలోని వారికి ఏ పద్ధతిన ఇస్తారు? బిహార్‌లో ప్రతిపక్ష కూటమి గెలిస్తే అక్కడ టీకా ఉండదా? దేశమంతటికీ ఉచితంగానే ఇచ్చేట్టయితే, బిహార్‌కు అది ప్రత్యేకమైన అంశం, మేనిఫెస్టోలో మొదటి అంశం ఎట్లా అవుతుంది? కేంద్రం సహకారం లేకుండా, టీకా ధర ఎంతో, ఎన్ని విడతలు అవసరమో, పంపిణీ ఖర్చు ఎంతో తెలియకుండా రాష్ట్రప్రభుత్వం ఎట్లా ఉచితం గురించి నిర్ణయించగలుగుతుంది? దేశమంతటినీ పాలిస్తున్న కేంద్రప్రభుత్వం, ఒక రాష్ట్రానికి మాత్రం ఎట్లా వెసులుబాటు ఇస్తుంది? ప్రధానమంత్రో, కేంద్ర ఆరోగ్యమంత్రో చేయవలసిన ప్రకటనను కేంద్ర వాణిజ్యమంత్రి ఎట్లా చేస్తారు? 


కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇటువంటి వాగ్దానం ఉండడాన్ని నైతిక నియమావళికి విరుద్ధమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆ అధికారాన్ని అనువుగా చేసుకుని ఇచ్చే వాగ్దానాలు న్యాయమైనవి కావు. అదొక పార్శ్వం అయితే, టీకా గురించిన పురోగతిపై ఎటువంటి స్పష్టతా లేని సమయంలో, సాధ్యాసాధ్యాల చర్చ లేకుండా చేసే ఇటువంటి వాగ్దానాలు భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాకు భారం అవుతాయి. అమలు చేయకపోతే, అది ఓటర్ల పాలిట నమ్మకద్రోహంగా పరిణమిస్తుంది. 


గతంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీకా పంపిణీ గురించి ఒక వైఖరిని సూచించింది. కొవిడ్‌ టీకాను కూడా సార్వజనీన టీకా కార్యక్రమంలో భాగంగా చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పింది. అంటే దాని భారాన్ని ప్రధానంగా కేంద్రమే తీసుకోబోతోంది. మొత్తంగా 59 వేల కోట్లు ఇందుకు అవసరమవుతుందన్న అంచనాలు కూడా ఇటీవల వినిపించాయి. అయితే, టీకా ఇంకా ఖరారు కాలేదు. మూడో విడత పరీక్షలలో అవరోధాలు వస్తున్నాయి. ఏ టీకా మొదట రంగం మీదకు వస్తుందో తెలియదు. ఎన్ని విడతలు వేసుకుంటే దీర్ఘకాలపు నిరోధక శక్తి లభిస్తుందో ఇంకా అవగాహన రాలేదు. అన్నిటికి మించి, ఈ టీకాను పంపిణీ చేయడం పెద్ద ప్రక్రియ. ఎన్నికల నిర్వహణతో పోల్చారు కానీ, అంతకు మించిన సంక్లిష్టత ఈ పంపిణీలో ఉన్నది. ఏదో ఒక సరుకును పంపిణీ చేయడం కాదిది. ఏకకాలంలో ఒక ప్రదేశంలో విస్తృతంగా టీకా వేయాలి. పాక్షికంగా వేస్తే ఉపయోగం లేదు. ఆరోగ్యపరంగా ప్రతిక్రియలు ఏవీ రాకుండా చూసుకోవాలి. పంపిణీకి అయ్యే ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఇందులో కొంత రాష్ట్రాలు భరించవలసిరావచ్చు. కానీ, బిజెపి ఐటి విభాగం ప్రతినిధి చెప్పినట్టు, నామమాత్రపు ధరకు కేంద్రం అమ్మడం, ఆ ఖర్చును తామే భరించి రాష్ట్రాలు టీకాలు వేయడం సాధ్యమయ్యే విషయం కాదు. టీకా ధర, దాని పంపిణీ, పర్యవేక్షణ, సమీక్షల వ్యయం అంతా కలిపి చూడవలసి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటుందన్నదాన్ని బట్టి చేసే పని కాదు ఇది. రేపు తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రి అయినా, బిహార్‌కు అన్ని రాష్ట్రాల మాదిరిగా ఒకే విధానం అమలు చేయవలసి ఉంటుంది.


బిహార్‌ బిజపి మేనిఫెస్టోలో చెప్పారని అన్నాడిఎంకె కూడా తానూ ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తానని చెప్పింది. వచ్చే ఏడు అక్కడా ఎన్నికలున్నాయి మరి. ఎన్నికలేమీ లేకపోయినా, తెలంగాణ కూడా ఉచితమే అని చెప్పింది. ఒక తీవ్రమయిన ఆరోగ్య అంశం మీద విధాన నిర్ణయాలు తీసుకోవలసిన పద్ధతి ఇదేనా?


కరోనా కట్టడి వాతావరణాన్ని ఆసరా చేసుకుని విద్వేష ప్రచారాలు జరిగాయి. ఇదే అదను అనుకుని చర్చకు ఆస్కారం లేకుండా చట్టసభల్లో తీవ్రమైన చట్టాలు, నిర్ణయాలు జరిగిపోయాయి. చివరకు ప్రజలు అన్యాయంపై గొంతెత్తినా సాంక్రమిక వ్యాధుల చట్టాలు ఉరిమురిమి చూశాయి. చివరకు ఒక రాష్ట్ర ఎన్నికలలో కూడా, విజయం మీద అనుమానంతో, ఎట్లాగూ ఉచితమే అయిన వైరస్‌ వైద్యాన్ని ఉచితవాగ్దానంగా రంగంలోకి దించారు.

Updated Date - 2020-10-24T05:59:22+05:30 IST