‘టీకా’ లడాయి!

ABN , First Publish Date - 2021-04-12T08:07:10+05:30 IST

కొవిడ్‌ టీకా కోసం కేంద్రంతో కయ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కాలు దువ్వుతోంది. ఆరోగ్యశాఖ చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నింద మోపేందుకు సిద్ధమైంది.

‘టీకా’ లడాయి!

కేంద్రం ఎందుకివ్వదంటూ మొండిపట్టు

నిల్వలు పూర్తిచేయాలని అర్ధరాత్రి ఆదేశాలు

ఉద్దేశపూర్వకంగానే వ్యాక్సిన్‌ డోస్‌లు ఖాళీ 

90వేల డోస్‌లతోనే టీకా ఉత్సవ్‌ ప్రారంభం

చాలా జిల్లాల్లో జీరోకు చేరిన టీకా నిల్వలు

నేటి సాయంత్రానికి 2లక్షల డోస్‌ల వ్యాక్సిన్‌ 


అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకా కోసం కేంద్రంతో కయ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కాలు దువ్వుతోంది. ఆరోగ్యశాఖ చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నింద మోపేందుకు సిద్ధమైంది. చివరికి ప్రధాని మోదీ ఆదేశాలు, సూచనలను కాదని రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మొండి వైఖరి అవలంబిస్తున్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొలిరోజు టీకా ఉత్సవ్‌ పూర్తిస్థాయిలో జరగకుండా అధికారులు నీరుగార్చేశారు. సరిపడా నిల్వలు లేవని సాకుగా చూపించి ఈ కార్యక్రమం సక్రమంగా చేపట్టలేదు. సమయానికి వ్యాక్సిన్‌ సరఫరా చేయలేదంటూ తప్పంతా కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండూ కలిపి రాష్ట్రానికి కేంద్రం 40.93 లక్షల డోస్‌లు అందించింది. వీటిలో 2.69లక్షల డోస్‌లను ఆరోగ్యశాఖ వృథా చేసింది. వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.


వాటిని కచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం వీటిని పెడచెవిన పెడుతూ వచ్చింది. నిర్దేశించిన దానికంటే అత్యధిక సెషన్లు ఏర్పాటు చేయడంతో పాటు కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ కాకపోయినా లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేశారు. వెబ్‌సైట్‌లో తప్పుడు సమాచారం ఆప్‌లోడ్‌ చేసిన సుమారు 50వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే దాదాపు 39వేల మందికి వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ ఇచ్చేశారు. వీటన్నింటిపై కేంద్రం తొలినుంచి హెచ్చరిస్తూనే ఉంది. అయినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.


చివరికి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి, వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్‌ వేసేశారు. దీనివల్లనే రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఉంది. కాబట్టి సెలవు రోజుల్లో సెషన్స్‌ ఏర్పాటు చేయవద్దని కేంద్రం సూచనలు చేస్తూనే ఉంది. అయినా ఆరోగ్యశాఖ పట్టించుకోలేదు. దేశంలో ఏ రాష్ట్రలోనూ చేయని విధంగా ఏపీలో 13.66 శాతం కొవాగ్జిన్‌ టీకాను వృథా చేశారు. అలాగే కొవిషీల్డ్‌ 4.85 శాతం వృథా చేశారు. ఈ స్థాయిలో వృథా చేయడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. 


నిల్వలు జీరో చేసేయండి 

టీకా ఉత్సవ్‌ జరగకుండా ఆరోగ్యశాఖ అధికారులు పక్క ప్రణాళికలు రచించారు. రాష్ట్రంలో సరిపడా టీకా లేదు వెంటనే కోటి డోస్‌లు పంపించాలని కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం కొంచెం కొంచెంగా పంపిస్తామని సమాధానం చెప్పింది. దీనిపై సంతృప్తి చెందని ఆరోగ్యశాఖ టీకా నిల్వలు ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీకా ఉత్సవ్‌కు ఒక్క డోస్‌ కూడా లేకుండా చేయాలని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం వ్యాక్సినేషన్‌ ప్రారంభించే సమయానికి రాష్ట్రంలో 3.74లక్షల డోస్‌లు అందుబాటులో ఉంది.


ఆదివారం మొదలయ్యే టీకా ఉత్సవ్‌లో 2లక్షలకు మించి వ్యాక్సినేషన్‌ జరగడం కష్టం. కాబట్టి శనివారం కొంత నిదానంగా చేసినా ఆదివారం వ్యాక్సిన్‌ అందుబాటులో పెట్టుకోవచ్చు. కానీ ఆరోగ్యశాఖ అధికారులు అన్ని జిల్లాల్లో టీకా నిల్వలు జీరోకు చేరుకోవాలంటూ శనివారం ఉదయమే జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు మౌఖికాదేశాలు జారీ చేశారు. అవసరమైతే శనివారం అర్ధరాత్రి వరకూ వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని సూచించారు. దీంతో కృష్ణా, కర్నూలు జిల్లాల్లో శనివారం రాత్రి 2గంటల వరకూ వ్యాక్సినేషన్‌ చేశారు. అయినా ఆదివారం నాటికి 90,570 డోస్‌లు ఉండిపోయాయి. అనంతపురంలో జిల్లాలో ఒక్క డోస్‌ కూడా లేదు. మిగిలిన జిల్లాల్లో 10వేల లోపు డోసులే అందుబాటులో ఉన్నాయి.


ఆదివారం అందుబాటులో ఉన్న డోసులతోనే టీకా ఉత్సవ్‌ను తూతూమంత్రంగా నిర్వహించారు. వాటిని కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందించలేకపోయారు. ఆదివారం రాత్రికి ఇంకా 23వేల డోస్‌ల వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయి. అనంతపురం, కర్నూలు, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరుల్లో నిల్వలు జీరోకు చేరాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2లక్షల డోస్‌ల వ్యాక్సిన్‌ చేరుకోనుంది. వాటిని క్షేత్రస్థాయికి పంపిణీ చేసేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

Updated Date - 2021-04-12T08:07:10+05:30 IST