వ్యాక్సిన్‌ ఖాళీ

ABN , First Publish Date - 2021-04-12T06:27:34+05:30 IST

జిల్లాలో వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. ఆదివారం ఉదయానికి 580 డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండగా... మధ్యాహ్నంకల్లా అయిపోయాయి.

వ్యాక్సిన్‌ ఖాళీ
నిమ్స్ లో ఖాళీగా ఉన్న వాక్సినేషన్ సెంటర్

జిల్లాలో నిండుకున్న కొవిడ్‌ టీకా నిల్వలు

ఆదివారం 580 మందికి మాత్రమే వ్యాక్సిన్‌

‘వ్యాక్సిన్‌ ఉత్సవ్‌’కు 2.70 లక్షల డోసులకు ఇండెంట్‌

ఒక్క డోసు కూడా జిల్లాకు చేరని వైనం

ప్రారంభంకాని ఉత్సవం

నేడు వ్యాక్సినేషన్‌పై సందిగ్ధం


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

జిల్లాలో వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. ఆదివారం ఉదయానికి 580 డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండగా... మధ్యాహ్నంకల్లా అయిపోయాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ‘వ్యాక్సిన్‌ ఉత్సవ్‌’ను ప్రారంభించాలి. ఈ కార్యక్రమం కోసం  2.70 లక్షల డోసుల వ్యాక్సిన్‌ పంపాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇండెంట్‌ పెట్టారు. కానీ జిల్లాకు చేరకపోవడంతో వ్యాక్సిన్‌ ఉత్సవానికి శ్రీకారం చుట్టలేదు. 

జిల్లాలో వ్యాక్సిన్‌ నిల్వలు ఖాళీ అయ్యాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత ఒక్క వ్యాక్సిన్‌ కూడా లేకపోవడం ఇదే తొలిసారి. శనివారం సాయంత్రం వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యేసరికి అతికొద్ది డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే వుంది. మరోవైపు ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు ‘వ్యాక్సిన్‌ ఉత్సవ్‌’ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలకు 2.70 లక్షల డోసులు అవసరమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల క్రితం ఇండెంట్‌ పెట్టారు. ఆదివారం ఉదయానికి వ్యాక్సిన్‌ డోసులు చేరుకుంటాయని భావించినప్పటికీ రాలేదు. దీంతో వ్యాక్సిన్‌ ఉత్సవ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు జిల్లాలో రోజూ పది వేల మందికిపైగా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఆదివారం 580 డోసులు మాత్రమే అందుబాటులో వుండడంతో కొద్దిసేపటికే నిల్వలు అయిపోయాయి. జిల్లాకు వ్యాక్సిన్‌ డోసులు ఎప్పుడు వస్తాయో ఆదివారం రాత్రి వరకు అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో సోమవారం వ్యాక్సినేషన్‌పై ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వారి పరిస్థితిపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. కొన్నిచోట్ల వారం రోజుల నుంచే వ్యాక్సిన్‌ కొరతగా ఉందని, తరువాత రావాలని చెబుతున్నారు. అయితే రెండో డోసు వ్యాక్సిన్‌కు నాలుగు నుంచి ఆరు వారాల సమయం ఉన్నందున భయపడాల్సిన పని లేదని, ఈలోగానే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 


అదనంగా 80 కేంద్రాలు 

జిల్లాలో ప్రస్తుతం 228 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, కొన్ని గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అయితే, ఆదివారం నుంచి జరగాల్సిన వ్యాక్సిన్‌ ఉత్సవ్‌కు అదనంగా మరో 80 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తంగా జిల్లాలో 300 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఉత్సవ్‌ను నిర్వహించాలని నిర్ణయించి ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. అయితే వ్యాక్సిన్‌ జిల్లాకు చేరకపోవడంతో కొత్త కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయలేదు. వ్యాక్సిన్‌ ఉత్సవ్‌ ప్రారంభం కాలేదు.


వ్యాక్సిన్‌కు ముందుకొస్తున్న జనం... నిండుకున్న నిల్వలు

కొద్దిరోజుల కిందట వరకు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రాని పరిస్థితి. చాలా మందిలో అనుమానాలు, అపోహలతో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశించడం, మరోవైపు కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా వుండడంతో వ్యాక్సిన్‌ కోసం ఆయా కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఈ నెల మొదటి వారంలో ఐదు వేల నుంచి ఏడు వేల మంది వరకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. తరువాత ఈ సంఖ్య పది వేలకు పెరిగింది. కానీ కీలకమైన సమయంలో జిల్లాలో వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా అడుగంటాయి.


నేడు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం 

డాక్టర్‌ పీఎస్‌ సూర్యనారాయణ, డీఎంహెచ్‌వో

జిల్లాలో ఆదివారం మధ్యాహ్నానికి వ్యాక్సిన్‌ పూర్తిగా అయిపోయింది. వాస్తవంగా వ్యాక్సిన్‌ ఉత్సవ్‌ కోసం పెట్టిన ఇండెంట్‌ శనివారం రాత్రికి వస్తుందని, ఆదివారం ఉదయం నుంచి వ్యాక్సిన్‌ ఉత్సవ్‌ నిర్వహించాలని భావించాం. అయితే ఆదివారం కూడా వ్యాక్సిన్‌ రాలేదు. సోమవారం కొన్ని డోసుల వాక్సిన్‌ అయినా జిల్లాకు వస్తుందని భావిస్తున్నాం. వెంటనే వ్యాక్సిన్‌ ఉత్సవ్‌ను ప్రారంభిస్తాం. 







పాజిటివ్‌ కేసులు

పైపైకి...

జిల్లాలో ప్రతాపం చూపుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌

మరో 405 మందికి వైరస్‌ నిర్ధారణ

నానాటికీ పెరుగుతున్న ఉధృతి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 405 మంది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌ ప్రారంభం అయిన తరువాత పాజిటివ్‌ కేసులు 400 దాటడం ఇదే తొలిసారి. శనివారం అత్యధికంగా 391 కేసులు నమోదుకాగా ఆదివారం ఆ రికార్డును అధిగమించింది. మొదటి దశ వైరస్‌ వ్యాప్తి సమయంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడానికి 125 రోజుల సమయం పడితే.. సెకండ్‌ వేవ్‌లో 41 రోజుల్లోనే అంతకంటే ఎక్కువ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా  నమోదైన 405 కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 65,270కు చేరింది. వీరిలో 62,069 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 2,643 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌ బారినపడి 558 మంది మృతి చెందారు. 





Updated Date - 2021-04-12T06:27:34+05:30 IST