నేటి నుంచే టీకా

ABN , First Publish Date - 2021-03-01T09:05:10+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ మూడో విడత నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య ఈ ప్రక్రియను ప్రారంభించడానికి

నేటి నుంచే టీకా

60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి 

దీర్ఘకాలిక సమస్యలున్న వారికీ వ్యాక్సిన్‌  

90లక్షల మందికి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు 

రాష్ట్రవ్యాప్తంగా 2,222 టీకా కేంద్రాలు

564 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ...

ప్రైవేటులో డోసు 150.. సర్వీస్‌ చార్జి 100

ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం టీకా ఉచితం 

రాష్ట్రంలో మళ్లీ కేసుల కలకలం!

రెండు రోజుల్లోనే 235 పాజిటివ్‌లు

ఆదివారం కొత్తగా 117 కరోనా కేసులు


అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ మూడో విడత నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దశలో దాదాపు 90 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. 60ఏళ్లు దాటినవారికి, 45-59 మధ్య వయసు వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి నేటి నుంచే టీకా ఈ విడతలో టీకా అందిస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 564 ఆస్పత్రులతో కలిపి మొత్తం 2,222 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్నిచోట్లా టీకా వేస్తారు. పేరు నమోదు చేసుకున్నవారు ఎక్కడైనా వ్యాక్సిన్‌ వేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తారు.


ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీకా ధర రూ.150 కాగా, ప్రైవేటు ఆస్పత్రులు సర్వీసు చార్జీగా మరో రూ.100 వసూలు చేయనున్నాయి. దీంతో డోసు ధర రూ.250 అవుతుంది. ఇప్పటివరకూ కొవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారికే వ్యాక్సిన్‌ వేసేవారు. ఇప్పుడు 60 ఏళ్లు దాటినవారు తమ ఆధార్‌ కార్డు చూపిస్తే వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి, ఆ వెంటనే వ్యాక్సిన్‌ అందిస్తారు. 45ఏళ్ల నుంచి 59ఏళ్ల మధ్య వయసు దాటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఇదే విడతలో వ్యాక్సిన్‌ వేస్తారు. అయితే వీరు షుగర్‌, బీపీ, తదితర సమస్యలతో బాధపడుతున్నట్లుగా వైద్యుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.

Updated Date - 2021-03-01T09:05:10+05:30 IST