వ్యాక్సిన్‌తోనే రక్షణ!

ABN , First Publish Date - 2021-05-02T05:53:17+05:30 IST

కొవిడ్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో ఇంకా అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి చాలా మంది వెనకంజ వేస్తున్నారు...

వ్యాక్సిన్‌తోనే రక్షణ!

కొవిడ్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో ఇంకా అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి చాలా మంది వెనకంజ వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ ద్వారానే కొవిడ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో కొవిడ్‌ పట్ల ఉన్న అపోహలు, వాస్తవాల గురించి తెలుసుకుందాం...


అపోహ : వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినట్టే!

వాస్తవం : వ్యాక్సిన్‌లో కొవిడ్‌ లైవ్‌ వైరస్‌ ఉండదు. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా కొవిడ్‌ శరీరంలోకి ప్రవేశించడం జరగదు.

అపోహ : వ్యాక్సిన్‌ తీసుకున్నాక పరీక్ష చేయిస్తే కొవిడ్‌ పాజిటివ్‌గా వస్తుంది..

వాస్తవం : కొవిడ్‌ వైరస్‌ను గుర్తించడానికి శ్వాసవ్యవస్థకు సంబంధించిన భాగాల్లో నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తారు. వ్యాక్సిన్‌లో లైవ్‌ వైరస్‌ ఉండదు కాబట్టి పరీక్ష ఫలితాలపై దాని ప్రభావం ఉండదు.

అపోహ : కొవిడ్‌ వల్ల వచ్చే లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి నాకు వ్యాక్సిన్‌ అవసరం లేదు!

వాస్తవం : ఎవరైనా, ఎప్పుడైనా వైరస్‌ బారినపడొచ్చు. అంతేకాకుండా ఇతరులకు దాన్ని వ్యాపింపజేయవచ్చు. అందుకే వ్యాక్సిన్‌ వేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీకు, మీ కుటుంబానికి, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

అపోహ : వ్యాక్సిన్‌ తీసుకుంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది!

వాస్తవం : వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం లేదు. అప్పటికే మీకున్న జబ్బు తీవ్రత పెరుగుతుందనడానికి కూడా ఆధారాలు లేవు.

అపోహ : కొన్ని రకాల బ్లడ్‌ గ్రూపుల వాళ్లు కొవిడ్‌ బారినపడే అవకాశం చాలా తక్కువ. వాళ్లకు వ్యాక్సిన్‌ అవసరం లేదు...

వాస్తవం : పరిశోధనల్లో ఆ విషయం నిరూపితం కాలేదు. కాబట్టి అన్ని రకాల బ్లడ్‌గ్రూపుల వాళ్లు వ్యాక్సిన్‌ తీసుకోవాలి. అప్పుడే వైరస్‌ బారినపడకుండా కాపాడుకోగలుగుతారు.

అపోహ : ఒకసారి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు...

వాస్తవం : కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయునా కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చి, తరువాత కోలుకున్న వారిలో ఎన్ని రోజులు వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందో చెప్పలేం. అందుకే డాక్టర్‌ సలహా మేరకు కోలుకున్న తరువాత వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 

అపోహ : వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల అలర్జీ వంటి సైడ్‌ ఎఫెక్టులు వస్తున్నాయి...

వాస్తవం : కొంతమందిలో మాత్రమే కండరాల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలర్జిక్‌ రియాక్షన్‌ అనేది చాలా తక్కువ. అలర్జీ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ముందుగా డాక్టర్‌కు ఆ విషయం తెలియజేయాలి. డాక్టర్‌ సూచన మేరకు, వాళ్ల పర్యవేక్షణలో వ్యాక్సిన్‌ తీసుకోవాలి.


Updated Date - 2021-05-02T05:53:17+05:30 IST