ఇంటింటికీ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-10-24T06:38:52+05:30 IST

జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే లక్ష్యంలో భాగంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ వేగంవతం చేశారు. ఇంటింటా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో వంద శాతం పూర్తి చేసే దిశగా వైద్య, ఆరోగ్య సిబ్బంది కృషి చేస్తున్నారు. కొంతమంది టీకాకు ముందుకురాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇంటింటికీ వ్యాక్సిన్‌
వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

- లక్ష్యం దిశగా వైద్య,ఆరోగ్య సిబ్బంది కృషి 

- కొవిడ్‌ టీకా వేసుకోవాలని ఫోన్లు 

- ప్రజల కుంటి సాకులు 

- తలలు పట్టుకుంటున్న ఏఎన్‌ఎంలు 

- అధికారుల ఒత్తిడితో డేటా ఎంట్రీలో తప్పులు 

- జిల్లాలో  3,59,927 మందికి మొదటి డోసు

-  గ్రామాల్లో వందశాతం పూర్తి

-   1,26,051 మందికి రెండో డోసు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే లక్ష్యంలో భాగంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ వేగంవతం చేశారు. ఇంటింటా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో వంద శాతం పూర్తి చేసే దిశగా వైద్య, ఆరోగ్య సిబ్బంది కృషి చేస్తున్నారు. కొంతమంది టీకాకు ముందుకురాక పోవడంతో  ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బందిపై అధికారుల ఒత్తిడితో జిల్లాలోని పలు ప్రాంతాల్లో డేటా ఎంట్రీలో తప్పిదాలు వెలుగు చూశాయి. ఇద్దరు ఏఎన్‌ఎంలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆందోళనలు  సైతం చేశారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎలా ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది మాత్రం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మొదటి డోసు తీసుకోనివారి ఇళ్లకు వెళ్లి టీకా తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. రెండో డోసు వారికి ఫోన్లు చేసి టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.  ప్రజలు ముందుకు రాకపోవడంతో ఏఎన్‌ఎంలు, డాక్టర్లు  ఇబ్బందులు పడుతున్నారు. 

జిల్లాలో 4,85,978 డోసులు 

జిల్లాలో ఇప్పటి వరకు 4,85,978 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. ఇందులో మొదటి డోసు 3,59,927 మంది ఉండగా రెండు డోసులు వేసుకున్నావారు 1,26,051 మంది ఉన్నారు. మొదటి డోసులో హెల్త్‌ కేర్‌ వర్కర్‌లు 2667 మంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 4334, సూపర్‌ స్పైడర్లు 18 నుంచి 45 ఏళ్ల వారు 1,96,468 మంది, 60 ఏళ్ల పైబడిన వారు 54,558 మంది, 45 నుంచి 59 మధ్య వాళ్లు 1,01,900 మంది ఉన్నారు. రెండో డోసులో హెల్త్‌ కేర్‌ వర్కర్‌లు 2013 మంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 4118 మంది, సూపర్‌ స్ర్పెడర్లు 18 నుంచి 45 ఏళ్ల వారు 19.719 మంది, 60 ఏళ్ల పైబడిన వారు 35,047 మంది, 45 నుంచి 59 మధ్య వాళ్లు 65,154 మంది ఉన్నారు. మొదటి డోసు పూర్తయిన వారు గడువు ముగిసి రెండో డోసు వేసుకోవాల్సి ఉన్నా ముందుకు రావడం లేదు. వీరి కోసం సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. వైద్య సిబ్బంది మొదటి డోసు వేసుకున్న వారికి ఫోన్లు చేసి రెండో డోసు వేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. 

 తలలు పట్టుకుంటున్న ఏఎన్‌ఎంలు 

వ్యాక్సినేషన్‌ కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఏఎన్‌ఎం, వైద్య సిబ్బందికి కొంతమంది కుంటి సాకులు  చెబుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. సెకండ్‌ డోసు వారికి ఫోన్లు చేసినపుడు జ్వరంగా ఉందని, ఇంట్లో ఫంక్షన్లు ఉన్నాయని, ఊర్లో లేమని ఇలా రకరకాల సాకులు చెబుతున్నారు.  వ్యాక్సిన్‌ చేసుకోవాలని సూచిస్తే అనేక మంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని   వైద్య సిబ్బంది వాపోతున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి   కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాగా మొదటి డోసులో వంద శాతంగా 255 గ్రామ పంచాయతీలు నిలిచాయి. రెండో డోసు ప్రక్రియ కొనసాగుతోంది. 

తగ్గుతున్న కొవిడ్‌ ఉధృతి 

రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకూతలం చేసిన కొవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్‌ కేసులు నామమాత్రంగానే ఉంటున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 32,169 మంది కొవిడ్‌ బారిన పడగా 98.22 శాతం మంది కోలుకున్నారు. 31,476 మంది కోలుకున్న వారు ఉండగా ప్రస్తుతం 125 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో హోం ఐసోలేషన్‌లో 115 మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 568 మంది మృతిచెందారు. ఇందులో హోం ఐసోలేషన్‌లో 12 మంది, 568 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. కొవిడ్‌ను నియంత్రించే దిశగా 8వ విడత ఫీవర్‌ సర్వేను కొనసాగిస్తున్నారు మొదటి విడతలో 3789 మంది, రెండో విడతలో 3372మంది, మూడో విడతలో 1710 మంది, నాలుగో విడతలో 679 మంది, ఐదో విడతలో 571 మంది, ఆరో విడతలో 762 మంది, ఏడో విడతలో 916 మంది, ఎనిమిదో విడతలో 373 మందిని జ్వర పీడిత లక్షణాలు ఉన్నవారిగా గుర్తించి ముందస్తుగానే కిట్లను అందించారు. ఇది ముందస్తుగా కొవిడ్‌ నియంత్రణకు దోహదపడింది. 

Updated Date - 2021-10-24T06:38:52+05:30 IST