కొవిడ్‌ టీకా.. తిరుగు టపా

ABN , First Publish Date - 2022-06-26T09:35:16+05:30 IST

టీకా నిల్వలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. కానీ, వాడుకునే అవకాశం లేదు. అటుచూస్తే వినియోగ గడువు దగ్గరపడుతోంది.

కొవిడ్‌ టీకా.. తిరుగు టపా

  • రాష్ట్రంలో కాలం చెల్లనున్న లక్షలాది డోసులు..!
  • ఇటీవల 3.50 లక్షల వ్యాక్సిన్లు తిరిగి కేంద్రానికి
  • తెలంగాణ సర్కారు వద్ద మరో 30 లక్షల టీకాలు
  • సెప్టెంబరులో అత్యధిక నిల్వలకు తీరనున్న గడువు
  • బూస్టర్‌గా వాడకానికి అనుమతివ్వని కేంద్రం
  • హరీశ్‌ మూడు లేఖలు రాసినా స్పందన కరువు
  • కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన విషయం


హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): టీకా నిల్వలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. కానీ, వాడుకునే అవకాశం లేదు. అటుచూస్తే వినియోగ గడువు దగ్గరపడుతోంది. ఇంకొన్ని రోజులు దగ్గరపెట్టుకున్నా మురిగిపోవడమే తప్ప ఫలితం ఉండదు. ముందుజాగ్రత్త డోసుగా ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన కరువైంది. మూడో డోసును ప్రైవేటులో డబ్బులు పెట్టి వేయించుకోమన్న కేంద్రం.. ఉచితంగా పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించడం లేదు. దీంతో వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తోంది. ఇలా.. వినియోగ తుది గడువు జూలై నెలలో ముగియనున్న 3.50 లక్షల డోసులను నాలుగు రోజుల కిందట వెనక్కుపంపింది. మరికొన్ని డోసులకు త్వరలో గడువు తీరనుంది. కేంద్రం ఏమీ తేల్చకుంటే.. వీటినీ రాష్ట్ర సర్కారు తిరిగి పంపించేయాల్సిన పరిస్థితి రానుంది.


ముందుజాగ్రత్త డోసు అర్హులు లక్షల్లో!

రాష్ట్రంలో అర్హులైన 2.86 కోట్లమంది కొవిడ్‌ టీకా పూర్తిగా పొందారు. రెండో డోసు వేయించుకుని 9 నెలలు దాటినవారు ముందుజాగ్రత్త డోసుకు అర్హులు. ఇప్పటికిప్పుడు చూసినా వీరి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. 3 శాతం మందే బూస్టర్‌ తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం వద్ద 30.04 లక్షల డోసులున్నాయి. ఇందులో కొవిషీల్డ్‌ 8 లక్షలు, కొవాగ్జిన్‌ 16.25 లక్షలు, కొర్బెవ్యాక్స్‌ 5.71 లక్షల డోసులు. రాష్ట్ర కొవిడ్‌ స్టోర్‌లో 27.89 లక్షల డోసులు, శీతల నిల్వ కేంద్రాలు, జిల్లా టీకా కేంద్రాల్లో 2.14 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. వీటిలో అత్యధిక డోసుల గడువు సెప్టెంబరులో ముగియనుంది. దీనికి కొద్దిగా ముందుగానే.. అంటే ఆగస్టు ఆఖరులోనే విడతల వారీగా వెనక్కుపంపనున్నారు.


ఉచితంగానే అయితేనే..

రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ముందుజాగ్రత్త డోసు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ, దీనిని 59 ఏళ్లు దాటినవారికేసర్కారీ టీకా కేంద్రాల్లో ఉచితంగా ఇస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల లోపువారు ప్రైవేటులోనే కొనుక్కోవాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పెద్దమొత్తంలో నిల్వ ఉన్నప్పటికీ 59 ఏళ్లలోపు వారికి ముందుజాగ్రత్త డోసుగా వినియోగించే పరిస్థితి లేదు. కాగా, మొదటి రెండు డోసులు ఉచితంగా తీసుకున్నవారంతా.. ప్రైవేటులో కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. మూడో డోసును ఉచితంగా ఇస్తే తీసుకుందామనే ధోరణి ఎక్కువమందిలో ఉంది. కొవిడ్‌ తీవ్రత తెలిసినవారు మాత్రమే ప్రైవేటులో వేయుంచుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కొవాక్సిన్‌, కొవిషీల్డ్‌ డోసుకు రూ.225 చొప్పున చార్జ్‌ చేస్తున్నాయి.


కేంద్ర మంత్రితో సమావేశంలో చెప్పినా.. 

టీకాల వినియోగ గడువు దగ్గరపడుతుండడంతో వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు మూడుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. 18-59 ఏళ్లలోపు వారికి ప్రభుత్వ కేంద్రాల్లో మూడో డోసు పంపిణీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్లు పుట్టి మరో వేవ్‌కు దారితీయకముందే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనూ దీనిపై ఆలోచించాలని సూచించారు. వృథాగా పడేయడం కంటే ముందుజాగ్రత్త డోసుగా ఇస్తే మేలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ల్లోనూ హరీశ్‌రావు  ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు.

Updated Date - 2022-06-26T09:35:16+05:30 IST