వ్యాక్సిన్‌ స్లాట్‌.. బుక్కయితే ఒట్టు

ABN , First Publish Date - 2021-05-08T05:06:20+05:30 IST

కొవిడ్‌.. ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. వ్యాక్సినేషన్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చని చెబుతోన్న ప్రభుత్వం ఆ ప్రక్రియ అమలును గాలి కొదిలేసింది.

వ్యాక్సిన్‌ స్లాట్‌.. బుక్కయితే ఒట్టు

చుక్కలు చూపిస్తున్న కొవిన్‌ సైట్‌

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

దుమ్ముగూడెం మే 7: కొవిడ్‌.. ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. వ్యాక్సినేషన్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చని చెబుతోన్న ప్రభుత్వం ఆ ప్రక్రియ అమలును గాలి కొదిలేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తామంటూ ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్న వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి అమలులో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతోన్న అధికారులు సక్రమ అమలును పూర్తిగా విస్మరిస్తున్నారు. 

స్లాట్‌....బుక్కయితే ఒట్టు

వ్యాక్సినేషన్‌ కోసం ఎన్నో ఇబ్బందుల కోర్చి కొవిన్‌ సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్న మండల ప్రజలకు పలు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. బుక్‌ చేసిన తేదీల్లో వ్యాక్సినేషన్‌ అందుబాటులో లేకపోవడం, స్లాట్‌ యాథృశ్ఛికంగా రద్దు అవుతుండటంతో ప్రజలు ఇబ్బందిపడతున్నారు. వ్యాక్సినేషన్‌ చేయించుకుందామని ఆశతో పీహెచ్‌సీలకు ఎంతో దూరం నుంచి వస్తున్న ప్రజలకు మొండి చేయి మిగులుతోంది. ఈనెల ఏడు వ్యాక్సినేషన్‌ కోసం నాలుగు రోజులకు ముందే నరసాపురం పీహెచ్‌సీలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి అక్కడి సిబ్బంది మొండిచెయ్యి చూపారు. వ్యాక్సిన్‌ అందుబాటులో లేదనడంతో వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. మరోమారు ఈనెల 9వ తేదీన స్లాట్‌ బుకింగ్‌ జరగ్గా, కొద్ది గంటలకే స్లాట్‌  రద్దయియినట్లు సందేశాలు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సినేషన్‌ అందుబాటులో లేకుంటే అసలు స్లాట్‌ బుకింగ్‌ ఎలా జరుగుతుందో, వెంటనే రద్దువుతుందో ఆ శాఖ అధికారులే సెలవీయాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ కోసం ఇటు మీసేవా కేంద్రాలకు అటు పీహెచ్‌సీలకు తిరగలేక నీరసించి పోతున్నారు. వ్యాక్సిన్‌ మాట పక్కన బెడితే...ఎండ దెబ్బకు చచ్చేట్లున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిన్‌ సైటులో సరైన సమాచారం ఉంచి, ప్రజలకు అవసరమైన వ్యాక్సినేషన్‌ సేవలు అందించాలని పలువురు బాధితులు అఽధికారులను వేడుకుంటున్నారు. కాగా ఈ విషయమై నరసాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ జితేంద్ర మాట్లాడుతూ, వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే తప్ప తాము ఏమీ చేయలేమని, పూర్తి వివరాలు తనకు కూడా తెలియవని అన్నారు. 


Updated Date - 2021-05-08T05:06:20+05:30 IST