వ్యాక్సిన్‌ వర్రీ

ABN , First Publish Date - 2021-05-07T06:13:02+05:30 IST

టీకా కోసం ప్రజలు ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్న తరుణంలోనే ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ పేరుతో కొత్త నిబంధన, వ్యాక్సిన్ల కొరత ఒక్కసారిగా నిరాశ పరిచింది.

వ్యాక్సిన్‌ వర్రీ
టీకా కోసం భూదాన్‌పోచంపల్లి పీహెచ్‌సీ వద్ద బారులుతీరిన జనం

స్లాట్‌ బుకింగ్‌ తెలియక గ్రామీణుల అయోమయం

నేరుగా కేంద్రాలకు వస్తుండటంతో రద్దీ

వ్యాక్సిన్‌ కొరత.. టీకాలు వేయక నిరాశ

స్లాట్‌లో నివాసాలకు దూరంగా టీకా కేంద్రాలు

పొంతనలేని నిబంధనలు.. వైద్య సిబ్బందిని నిలదీస్తున్న ప్రజలు

యాదాద్రి,(ఆంధ్రజ్యోతి)/భూదాన్‌పోచంపల్లి మే 6 : టీకా కోసం ప్రజలు ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్న తరుణంలోనే ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ పేరుతో కొత్త నిబంధన, వ్యాక్సిన్ల కొరత ఒక్కసారిగా నిరాశ పరిచింది. వారం రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా టీకాకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోలేక గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగొలాగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నా.. అసలు వ్యాక్సిన్‌ నిల్వలు లేవని కేంద్రాల వద్దకు వచ్చినవారిని తిప్పి పంపిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ల కొరత, స్లాట్‌ బుకింగ్‌ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


స్లాట్‌ బుకింగ్‌ తెలియక గ్రామీణుల అయోమయం

కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభంలో కేవలం ఆధార్‌కార్డ్‌ వెంట తెచ్చుకుంటే చాలు.. టీకాలు వేసి పంపించారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఈ విధంగానే టీకాలు వేశారు. మే 1వ తేదీ నుంచి కోవిన్‌ యాప్‌లో ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే టీకా వేయాలనే నిబంధన పెట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ, పల్లెలు అనే తేడా లేకుండా టీకా కోసం మీసేవ, ఇంటర్‌నెట్‌ సెంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. ఇందుకు ఈ కేంద్రాల నిర్వాహకులు రూ.30 చార్జీ వసూల్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కరోనా ఉధృతి కారణంగా టీకాలు వేయించుకోవడానికి ప్రజల్లో ఆసక్తి పెరి గి, స్వచ్ఛందగా ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నందున ప్రభుత్వం గతంలో మాదిరిగా ఆధార్‌ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేసుకుని టీకాల కార్యక్రమం కొనసాగించాలని కోరుతున్నారు.


వ్యాక్సిన్‌ కొరత.. టీకాల కేంద్రాల మూత

టీకాల కొరత మరింత ఆవేదనకు గురిచేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం రోజులుగా వ్యాక్సిన్లు నిండుకోవడంతో టీకాలు వేయలేకపోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గురువారం నాటికి జిల్లాలోని 25వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉండగా, వాటిలో అక్కడక్కడ 859వాయిల్స్‌ మాత్రమే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,81,620 డోసుల వ్యాక్సిన్‌ ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిలో ఇప్పటి వరకు 1,80,656మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 8,590 డోస్‌లు మాత్రమే నిల్వ ఉన్నాయి. వీటిని స్లాట్‌ బుకింగ్‌ జరిగిన కేంద్రాల్లో అక్కడక్కడ వాయిల్స్‌ కు పది మంది వరకు టీకాలు వేశారు. బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా కేవలం 937 మందికి మాత్రమే టీకాలు వేశారు. వీరిలో అత్యధికులు రెండో డోస్‌ వేయిం చుకున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న కేంద్రాల్లో టీకాలు లేక తిప్పి పంపించారు. 


హుజూర్‌నగర్‌లో వాగ్వాదం

హుజూర్‌నగర్‌: పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద వ్యాక్సిన్‌ కోసం గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం వందలాది మంది ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు తరలి వచ్చారు. అధికారులు కేవలం వందమందికి మాత్రమే వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సర్ది చెప్పి పంపివేశారు. రెండవ టీకా వేసుకోవాలంటే కనీసం 60 రోజుల పైనే పడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 45 రోజులకు వేయాల్సిన రెండో డోస్‌ 2 నెలలు దాటిన తర్వాతనే ఽఅదికారులు వ్యాక్సిన్‌ వేస్తున్నారని పేర్కొంటున్నారు.

భువనగిరి, చౌటుప్పల్‌లో నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కరోనా నియంత్రణకు భువనగిరి, చౌటుప్పల్‌ మునిసిపాలిటీల్లో శుక్రవారం నుంచి స్వచ్ఛం ద లాక్‌డౌన్‌ అమలుకానుంది. భువనగిరిలో ఉదయం6 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచుతారు. చౌ టుప్పల్‌లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దుకాణాలు తెరిచి ఆ తరువాత లాక్‌డౌన్‌ పాటించనున్నారు. 


ఉమ్మడి జిల్లాకు 3 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు

భువనగిరి టౌన్‌, మే 6: ఆక్సిజన్‌ కొరతతో కరోనా బాధితుల మరణాలను నిలువరించే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు మూడు ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లను మంజూరు చేసింది. ఆక్సిజన్‌ అవసరాలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 51 ప్లాంట్లు మంజూరు చేసింది. అందులో మూడు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ, సూర్యాపేట  ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో, భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిలో ఈ నెలాఖరులోగా ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. రోజుకు 500-1000లీటర్ల ఆక్సిజన్‌ను ఇవి ఉత్పత్తి చేయనున్నాయి. ఇవి గాలి నుంచే ఆక్సిన్‌ను వేరుచేసి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా వార్డులకు నేరుగా అందించనున్నాయి.

Updated Date - 2021-05-07T06:13:02+05:30 IST