కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదు..అప్రమత్తంగా ఉండాలి: సీఎంలతో మోదీ

ABN , First Publish Date - 2022-04-27T19:24:38+05:30 IST

దేశంలో కోవిడ్-19 ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని..

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదు..అప్రమత్తంగా ఉండాలి: సీఎంలతో మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ‌జరిపారు.  కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల మళ్లీ పెరుగుతుండటం, నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, దేశంలో కొత్తగా కరోనా కేసులు దాదాపు 3 వేలకు చేరుతున్న నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించారు. ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు తరతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సంక్షోభాన్ని మనం సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కోవిడ్ సవాళ్లను ఇంకా అధిగమించ లేదనే విషయం మాత్రం చాలా స్పష్టమని ముఖ్యమంత్రులను ప్రధాని అప్రమత్తం చేశారు. కోవిడ్‌ బారిన పడకుండా చూసే రక్షణకవచం వ్యాక్సిన్లని అన్నారు. దేశంలోని వయోజనుల్లో 96 శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు డోసులు తీసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. 15 ఏళ్లు పైబడిన అర్హులైన వారిలో 85 శాతం మంది సెకెండ్ డోస్ తీసుకున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సీఎంలకు సూచించారు. అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు.

Updated Date - 2022-04-27T19:24:38+05:30 IST