వ్యాక్సిన్‌ పంపిణీకి కసరత్తు షురూ!

ABN , First Publish Date - 2020-12-03T06:00:27+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొదటి దశలో హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

వ్యాక్సిన్‌ పంపిణీకి కసరత్తు షురూ!
టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

జిల్లాలో మొదటిసారిగా కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్న కలెక్టర్‌ 

పోలియో వ్యాక్సిన్‌ తరహాలోనే పంపిణీ ఏర్పాట్లు

(విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి)

 జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొదటి దశలో హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన హెల్త్‌ కేర్‌ వర్కర్ల వివరాలు అధికారులు సేకరించి, 65 వేల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఇమ్యునైజేషన్‌ (డీటీఎఫ్‌ఐ) కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టర్‌ చాంబర్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సన్నద్ధత కావాలని, అందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో హెల్త్‌ వర్కర్లు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు. అనంతరం 50 ఏళ్ల వయస్సు దాటినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రాధాన్యతనిస్తామన్నారు. జిల్లాలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ డేటాబేస్‌ తయారు చేయాలని, వ్యాక్సిన్‌ స్టోరేజీ పాయింట్లను గుర్తించి సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూట్‌ మ్యాప్‌ తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. శానిటరీ వర్కర్లు, అంబులెన్స్‌ డ్రైవర్లు(104, 108), ఆసుపత్రుల్లో పనిచేస్తున్న టెక్నీషియన్లు, పరిపాలన, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సింగ్‌ స్టాఫ్‌, ఎంబీబీఎస్‌, స్పెషలిస్టు డాక్టర్ల డేటా సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్‌ సూచించారు. స్ర్తీ, శిశు సంక్షేమ శాఖలో సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, పంచాయతీరాజ్‌ శాఖలో స్వీపర్లు, విలేజ్‌ వలంటీర్లు, జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలలో స్వీపర్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఇన్‌స్పెక్టర్లు నుంచి ఉన్నత స్థాయి వరకు సిబ్బంది వివరాలు సేకరించాలాన్నారు.  జిల్లాలో  రీజనల్‌, జిల్లా స్టోరేజీ పాయింట్లను వేర్వేరుగా గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. తదుపరి వ్యాక్సిన్‌ జిల్లా వ్యాప్తంగా సరఫరాకు రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. సమావేశంలో జేసీ అరుణ్‌బాబు, జేసీ-3 గోవిందరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పీఎస్‌ సూర్యనారాయణ, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, డీఈవో లింగేశ్వరరరెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ సీతామహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


పోలియో వ్యాక్సిన్‌ తరహాలో.. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పోలియో వ్యాక్సిన్‌ తరహాలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర స్టోరేజీ పాయింట్‌ నుంచి మినీ స్టోరేజీ పాయింట్లకు, అక్కడి నుంచి  చిన్నపాటి కూలింగ్‌ బాక్స్‌లతో సిబ్బంది వ్యాక్సిన్‌ను తీసుకువెళ్లి ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్న రెండు, మూడు వారాల ముందు వ్యాక్సిన్‌ ఇవ్వడంపై సిబ్బందికి  శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2020-12-03T06:00:27+05:30 IST