వడపళని ఆలయంలో వైభవంగా రథోత్సవం

ABN , First Publish Date - 2022-06-10T13:36:00+05:30 IST

స్థానిక వడపళని మురుగన్‌ ఆలయం, ప్యారీస్‌ కార్నర్‌ కాళికాంబాళ్‌ ఆలయంలో గురువారం ఉదయం వైకాసి విశాఖ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం

వడపళని ఆలయంలో వైభవంగా రథోత్సవం

చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక వడపళని మురుగన్‌ ఆలయం, ప్యారీస్‌ కార్నర్‌ కాళికాంబాళ్‌ ఆలయంలో గురువారం ఉదయం వైకాసి విశాఖ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు రెండో తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. వడపళని మురుగన్‌ ఆలయం  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం నుంచి బయలుదేరిన రథాన్ని పడమటి మాడవీధి, ఉత్తర, తూర్పు, దక్షిణ మాడవీధులు, పళని ఆండవర్‌ కోయిల్‌ వీధి, దక్షిణ పెరుమాళ్‌ ఆలయ వీధి, ఆర్కాట్‌ రోడ్డు, వందడగులు రహదారి తదితర ప్రధాన వీధుల్లో ఊరేగిన తర్వాత మళ్ళీ రథమండప ప్రాంతాన్ని చేరుకుంది. దారి పొడవునా భక్తులు రథంపై సర్వాలంకరణశోభితులై ఇష్టదేవేరి సమేతుడై ఆశీనులైన బాల దండాయుధపాణి స్వామివారికి కర్పూరహారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. చండీ మేళాలు, మంగళవాయిద్యాలు, ‘హరోహర మురుగయ్యా’ అనే భక్తుల నినాదాల నడుమ రథం ఊరేగింపు కొనసాగింది. రథోత్సవ మార్గాల్లో ఉన్న ప్రాంతాల్లో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. రథోత్సవం సందర్భంగా ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ బాలమురుగన్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ రాజేష్‌ నాయకత్వంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రథోత్సవం ముగిసిన తర్వాత రాత్రి ఏడుగంటలకు ఒయ్యాలి ఉత్సవం నిర్వహించారు. ఈ నెల 12న రాత్రి స్వామివారికి తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.


ప్యారీస్‌ కార్నర్‌లో

స్థానిక ప్యారీస్‌ కార్నర్‌ తంబుశెట్టి వీధిలోని సుప్రసిద్ధ కాళికాంబాళ్‌ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఈ నెల 3న ఆ ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో ఏడోరోజైన గురువారం ఉదయం రథోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీనాక్షి అలంకరణతో కాళికాంబాళ్‌ రథంపై కొలువుదీరారు. ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. చండీమేళాలు, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడవీధుల్లో రథం ఊరేగింపు కొనసాగింది. ఆలయ ట్రస్టు అధ్యక్షుడు సర్వేశ్వరన్‌, ట్రస్టీలు దేవారాజ్‌, మోహన్‌, రమేష్‌, సుబ్రమణ్యం రథోత్సవ ఏర్పాట్లను  చేపట్టారు.

Updated Date - 2022-06-10T13:36:00+05:30 IST