వడివడిగా నాట్లు..

ABN , First Publish Date - 2022-01-02T05:41:39+05:30 IST

భారీవర్షాలు, వరదలతో అపారంగా నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

వడివడిగా నాట్లు..
రాపూరు : నాట్లు వేస్తున్న మహిళా కూలీలు

భారీ వర్షాలు, వరదల నుంచి కోలుకుంటున్న అన్నదాతలు

రబీ సాగుకు సమాయత్తం 


నెల్లూరు, (వ్యవసాయం)/రాపూరు

భారీవర్షాలు, వరదలతో అపారంగా నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులతో సాగుకు సమాయత్తం అవుతన్నారు. జిల్లాకు ప్రధానమైన రబీ సీజన్‌లో దాదాపు 4,51,899 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. అయితే గత రెండేళ్లలో అధికారుల అంచనాలకు మించి సాగవుతోంది. ఈ ఏడాది కూడా దాదాపు 5,54,263 ఎకరాల్లో పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే వరదలు, వర్షాలతో నారుమడులు, నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 11,722 ఎకరకాల్లో వరినాట్లు, 6,650 ఎకరాల్లో వరినారుమడులు పాడయ్యాయి. మరికొన్ని పొలాలు ఇసుకమేటలతో పంట సాగుకు విరామం ప్రకటించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీరు పుష్కలంగా ఉండటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వరదలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు దాదాపు జిల్లావ్యాప్తంగా దాదాపు 14వేల కిలోల వరి విత్తనాలను ఆర్‌బీకేలలో జిల్లా వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచగా దాదాపు 12,343 కిలోలను రైతులకు 80శాతం సబ్సిడీతో అందజేసింది. మరో 10వేల కిలోల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొంత మంది రైతులు మాత్రం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాపూరు మండలంలో సుమారు 35 చెరువుల కింద సుమారు 3వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఒకవైపు దుక్కులు, చెంగూరా,  నారుమళ్లు సిద్ధం చేయడం, మరోవైపు నారేతలతో సాగు సందడి నెలకొనింది. తెలంగాణ మసూరా, నెల్లూరు మసూర రకాలను అత్యధికంగా సాగుచేస్తున్నారు. 


ధాన్యం కొనుగోలు ప్రకటన

రైతులు పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం జరుగుతుందని ఇటీవల అధికారులు ప్రకటించారు. అంతేగాక రవాణా, కూలి ఖర్చులు సైతం అన్నదాతపై పడవన్న ప్రకటనతో వడివడిగా అన్నదాతలు వరిసాగుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే దాదాపు 2.3 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. రబీ సీజన్‌ పూర్తయ్యేందుకు కొంత సమయం మాత్రమే ఉండడంతో ఇంకో వారం రోజుల్లో మరో 40శాతం మేర నాట్లు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

 




Updated Date - 2022-01-02T05:41:39+05:30 IST