సగంమందే.. మిత్రులు

ABN , First Publish Date - 2021-06-15T05:50:21+05:30 IST

ఆటో, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు, యజమానులకు ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా అందించే ఆర్థిక సహాయానికి ఈ ఏడాది చాలామంది దూరమయ్యారు.

సగంమందే.. మిత్రులు

వాహనమిత్ర పథకంలో భారీగా లబ్ధిదారుల తీసివేత

నిబంధనల కొర్రీతో అర్హుల ఏరివేత

ఈ ఏడాది దాదాపు జిల్లాలో 2 వేల మందిని తొలగింపు

నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్న నగదు 


గుంటూరు(తూర్పు), జూన్‌14: ఆటో, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు, యజమానులకు ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా అందించే ఆర్థిక సహాయానికి ఈ ఏడాది చాలామంది దూరమయ్యారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని అర్హులు గా చేరుస్తూనే, గత ఏడాది లబ్ధిదారుల్లో దాదాపు 2వేల మందికి పైగా జాబితా నుంచి తొలగించారు. కొవిడ్‌ కర్ఫ్యూ లాంటి సమయంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్లు దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ ఏడాది కొత్తగా 4,573 మంది దరఖాస్తు చేసుకోగా 4315 మందిని అర్హుల జాబితాలో చేర్చారు.


నిబంధనల కొర్రీ

అధిక కరెంట్‌ బిల్లులు, ఫైనాన్స్‌ క్లియరెన్స్‌లు, ఒకే వ్యక్తి పేరు మీద రెండు వాహనాలు లాంటి కారణాలు చూపి గత ఏడాది లబ్ధిదారులైన చాలామందిని అర్హుల జాబితా నుంచి తొలగించారు. వాస్తవానికి కొవిడ్‌ కారణంగా గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు ఆటో, మ్యాక్సీ డ్రైవర్లుకు పెద్దగా పనిలేదు. మరి అప్పటికి, ఇప్పటికీ  పరిస్థితిలో  ఏం తేడా ఉందని పథకం నుంచి తొలగించారో అర్ధం కావడం లేదు. దీంతో గ త ఏడాది 20,327 మంది ఉన్న జాబితా నుంచి 2,115 మందిని తొలగించారు. వీటిలో అధికంగా ఒక్క మంగళగిరి పరిధిలో 222పైగా ధరఖాస్తులను తొలగించారు.


సచివాలయానికో నిబంధన

గత రెండు సంవత్సారాలు లేని అనేక నిబంధనలు ఈ ఏడాది వాహనమిత్ర పథకంలో ప్రభుత్వం చేర్చింది. వాటిలో ముఖ్యంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలనే నిబంధనలు తీసుకువచ్చింది, వాహనమిత్రకు జూన్‌ 1 నుంచి 9 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ కారణంగా  వారం రోజుల్లో ఈ ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కాకపోవడంతో చాలామంది ఆటోడ్రైవర్లు ఈ పఽథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. వారం రోజుల్లో పత్రాలు ఎలా జారీ అవుతాయే ప్రభుత్వమే సమాధానం చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే గాక కొన్ని సచివాలయాల్లో బ్రేక్‌ సర్టిఫికెట్‌ జత చేయమనడం, మరికొన్ని సచివాలయాల్లో సదరు వాహనాలు ఎదురు నిలబడి ఫొటోలు దిగమనడం, లైసెన్స్‌లు రెన్యువల్‌ చేయాలి అంటూ నిబంధనలు చెప్పడంతో దాదాపు 10వేల మందికి పైగా ఉన్న కొత్త లబ్ధిదారులు ఉండగా కేవలం 4,573 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగలిగారు. జిల్లాలో మొత్తం ఈ ఏడాది 22,527 మంది వాహనమిత్ర పథకానికి ఎంపికయ్యారని వారికి, మంగళవారం నగదు జమ అవుతాయని డీటీసీ ఈ.మీరాప్రసాదు తెలిపారు.


మరో అవకాశమివ్వాలి..

కొవిడ్‌ లాంటి సమయంలో చాలామంది వాహన యజమానులు వాహనాల కిస్తీలు కట్టుకోలేక, కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఈ పథకం ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర నిబంధనలు తొలగించి మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలి.

- మస్తాన్‌వలి, ఆటోవర్కర్స్‌, అండ్‌ ఓనర్స్‌ జిల్లా అధ్యక్షుడు 



Updated Date - 2021-06-15T05:50:21+05:30 IST